రైతులు ఆత్మహత్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది

హైదరాబాద్, అక్టోబర్ 25: రైతు ఆత్మహత్యలపై తెలంగాణ ప్రభుత్వం నిర్లక్షంగా వ్యవహరిస్తుందని తెలంగాణ బిజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఒక్క దీపావళి రోజే 14 మంది అన్నదాతలు ప్రాణాలు తీసుకున్నారంటే ఇది బంగారు తెలంగాణ, లేదా ఆత్మహత్యల తెలంగాణ అని ప్రశ్నించారు. కరెంటు ఇస్తామని చత్తీస్ ఘడ్ ముందుకు వస్తే కార్యచరణ కూడా చేయలేసి పరిస్థితిలో కేసీఆర్ ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలపై సమాచారం లేదని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అనడం బాధాకరమన్నారు. ఇప్పటికి 270 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఒక్క దీపావళి రోజే 14 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయని, భారతదేశంలో అత్యధికమైన రైతులు ఆత్మహత్యలు ఒక్క తెలంగాణలో జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ఇది బంగారు తెలంగాణనా, ఆత్మహత్యల తెలంగాణనా అని ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. సమస్యలను నిర్మాణాత్మకంగా ఏ రకంగా పరిష్కారం చేద్దామనే తపన ప్రభుత్వానికి ఉండాలని ఆయన హితవు పలికారు. ఎంత సేపు ఇతరులను తిడుతూ కాలం గడిపే ప్రయత్నం చేయకూడదని ఆయన తెలిపారు. చత్తీస్ ఘడ్ ప్రభుత్వం నాలుగు నెలల క్రితం వెయ్యి మెగావాట్ల విద్యుత్ను చాలా తక్కువ రేటుకు ఇవ్వడానికి ముందకువస్తే ఈ రోజు వరకు కూడా దానిపైనా కనీసం కార్యాచరణ రూపొందించుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. సమస్యలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి చర్చించాలని ఆయన సూచించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.