రైతుల ఆత్మహత్యలను కుటుంబ తగాదాలకు ముడిపెట్ట వద్దు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 7: “ప్రపంచంలో ఎవరికైనా విలువైనది, తిరిగి రానిది, ప్రాణం. తెలంగాణ రాష్ట్రంలో 360 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, కరెంటు కోతల వల్ల, పంటలు ఎండిపోవడం వల్ల, గుండె పగిలి రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల వారి కుటుంబాలు అనాథలపాలవుతున్నారు. కుటుంబ తగాదాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిని రైతు ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అనడం బాధ్యాతారాహిత్యానికి నిదర్శనమని, “ టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్ మధుసూధనాచారి తెదేపా సభ్యులను సస్పెండ్ చేసిన అనంతరం రేవంత్ రెడ్డి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ మంత్రి ప్రకటన రైతులను అవమానపరచే విధంగాను, రైతుల ఆత్మహత్యలు ప్రేరేపించే విధంగా ఉన్నాయని, తక్షణం అసెంబ్లీలో మంత్రి చేత మృతిచెందిన రైతాంగ కుటుంబాలకు క్షమాపణ చెప్పించాలని, ఆ కుటుంబాలను ఆదుకొనే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గతంలో తెలంగాణ కోసం విద్యార్ధులు ఆత్మబలిదానాలు చేసుకున్నప్పుడు ప్రేమలో విఫలం చెందినవాళ్లు, కుటుంబ సమస్యలతోటి, ఆర్ధిక సమస్యలతోటి మృతి చెందుతున్న వారిని తెలంగాణ కోసం ఆత్మహత్యలుగా చిత్రికరిస్తున్నారని ఆంధ్రా నాయకులు అన్నప్పుడు దానిని ఖండించిన విషయాన్నిరేవంత్ రెడ్డి గుర్తుచేశారు. ఇలాంటి భాద్యాతారాహిత్యమైన మాటలు మాట్లడవద్దని మంత్రులు పోచారం శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు వారు చేసిన ప్రకటనలను ఖండించారు. గతంలో ఆంధ్రా పాలకులు ఏవైతే ఆరోపణలు చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న విద్యార్ధుల బలిదానాలను చిన్నవిగా చేసి చూపించి వాళ్లను అవమానించిన విధానాన్నే తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం వారిని ఆదర్శంగా తీసుకొని వారి బాటలోనే నడుస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. మృతి చెందిన రైతాంగ కుటుంబాలకు మంత్రి శ్రీనివాస రెడ్డి క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.