రైల్వే ప్రాజెక్టులను సత్వరం చేపట్టండి : కేసీఆర్

rly minister-19

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు తో సమావేశం అయిన కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభు

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్రంలో వివిధ రైల్వే ప్రాజెక్టులను సత్వరం చేపట్టాలని కేంద్ర రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు విజ్ఞప్తి చేశారు. సోమవారం మధ్యాహ్నం మంత్రి సురేష్‌ ప్రభు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ప్రాజెక్టుల పరిస్థితిని కేంద్రమంత్రికి వివరించి వినతి పత్రం అందించారు.

కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా మార్చాలని, వరంగల్‌లో రైల్వే యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని కోరారు. అదే విధంగా హైదరాబాద్‌లో మరిన్ని స్టేషన్లు ఏర్పాటు చేయాలని, ఏపీ ఎక్స్ ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్‌ ప్రెస్ గా మార్చాలని ఆయన కోరారు. ఎంతోకాలంగా ప్రజలు డిమాండ్ చేస్తున్న నూతన ప్రాజెక్టుల అనుమతుల విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నూతన రైల్వేలైన్ల కు భూకేటాయింపు అంశంలో సహాయ సహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలాలి, నాగులపల్లి రైల్వే స్టేషన్లను పూర్తిస్థాయి వసతులను కల్పించి అప్‌ గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని వల్ల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై ఉన్న ఒత్తిడిని మరింత తగ్గించవచ్చని తెలిపారు. ముఖ్యమంత్రి వినతులను సావధానంగా విన్న కేంద్ర మంత్రి సురేష్‌ ప్రభు రాష్ట్రంలోని పెండింగు ప్రాజెక్టులపై త్వరలో ఒక సమావేశం నిర్వహించి తగు నిర్ణయాలు తీసుకుంటామని హామి ఇచ్చారు.

ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పీకే శ్రీవాత్సవ, ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, వేణుగోపాలచారి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.