లక్షకుపైగా ఉద్యోగాల భర్తీ

kcr-sakalam-25

తెలంగాణ శాసనసభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్, నవంబర్ 25: ఉద్యోగుల విభజనపై కమలనాథన్ కమిటీ నివేదికను బట్టి వయోపరిమితి మినహాయించి అన్ని ఉద్యోగ ఖాళీలను భర్తీచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. సోమవారం శాసనసభలో కేసీఆర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువత ఎలాంటి నిరాశా నిస్పృహలకు లోనుకావద్దని, వచ్చే నాలుగైదు నెలల్లోనే ఐదేండ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చి ప్రభుత్వ శాఖల్లో ఉన్న 1.07 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుడుతుందని తెలిపారు.

కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్వోఆర్) పాటించి అందరికీ న్యాయం చేస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారని, అందులో 21 వేల మంది వరకు తెలంగాణ రాష్ట్రం పరిధిలోకి వస్తారని అధికారులు చెప్తున్నారన్నారు. వారిలో 19 వేల మందిపై స్పష్టత వచ్చింది అని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటుచేశామని, ఈ కమిటీ త్వరలో నివేదిక ఇస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగావకాశాలకు ప్రాధాన్యం పెరిగిందని, ఒక్క హైదరాబాద్‌లోనే రెండు లక్షల మందికిపైగా యువత ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నదని తెలిపారు. ఉద్యోగుల విభజనపై ఏర్పాటైన కమిటీలు ఏ విషయాన్ని తేల్చకపోవడం వల్ల ఉద్యోగ భర్తీపై సందిగ్ధ స్థితి నెలకొందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలపై స్పష్టత వస్తే కొన్ని శాఖలను విస్తరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలను కుదించాల్సి ఉంటుంది.

త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నియామకాలు చేపడుతామని, క్యాడర్లవారీగా ఎన్ని పోస్టులు వస్తాయనే అంశంపై స్పష్టత వస్తే నిరుద్యోగులకు లక్షకు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని కేసీఆర్ చెప్పారు.

కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న రకరకాల పథకాల పరిధిలో గౌరవ వేతనంతో పనిచేస్తున్న ఉద్యోగస్తులు కూడా తమకూ ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారని తెలిపారు. వారికి కూడా తగు న్యాయం చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.