లింగమంతుల జాతర ప్రారంభం

lingamantula jathara-9

నల్గొండ: నల్లొండ జిల్లాలోని చివ్వెంల మండలం దురాజ్ పల్లిలో యాదవుల కులదైవంగా పేరొందిన లింగమంతుల జాతర  ఆదివారం అర్ధరాత్రి ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ జాతర తర్వాత రెండో అతిపెద్ద జాతరగా పెద్దగట్టు గుర్తింపు పొందింది. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ లింగమంతుల స్వామి జాతరకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. నల్లొండ జిల్లా దురాజ్ పల్లిలో ఐదు రోజులపాటు జరిగే ఈ జాతరకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కృష్ణా, గుంటూరు, ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులను తీర్చుకుంటారు.

ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత సూర్యాపేట మండలం కేసారం నుంచి దేవరపెట్టెను శ్రీ లింగమంతుల స్వామి పెద్దగట్టుపైకి చేర్చారు. అనంతరం దేవరపెట్టెను లింగమంతుల స్వామి, చౌడమ్మ ఆలయాల నడుమ ప్రతిష్ఠించారు. యాదవభక్తులు సంప్రదాయాలకు అనుగుణంగా గజ్జెల లాగులు ధరించి భేరీల చప్పుళ్లతో, కటారుల విన్యాసాలతో సంబరాలు చేస్తూ ప్రత్యేకంగా అలంకరించిన గంపలతో దేవుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. భక్తులు లింగమంతుల స్వామికి బోనాలు చెల్లించి చౌడమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకున్నారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా సూర్యాపేట డీఎస్పీ అబ్దుల్ రషీద్ ఆధ్వర్యంలో పోలీసులు లింగమంతుల జాతర బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్-విజయవాడ 65వ జాతీయ రహదారిపై పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చర్యలను చేపట్టారు. హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుకు వెళ్లే వాహనాలు నార్కట్ పల్లి, నల్గొండ, మిర్యాలగూడ మీదుగా కోదాడకు దారి మళ్లించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.