వాజ్ పేయీ, మాలవ్యకు భారతరత్న

bharataratna-24

న్యూఢిల్లీ, డిసెంబర్ 24: ప్రతిష్టాత్మక పురస్కారం భారతరత్నను కేంద్రం ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయితో పాటు స్వాతంత్ర సమరయోధుడు, విద్యావేత్త పండిత మదన్ మోహన్ మాలవ్యాలకు భారతరత్నను ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం చేసిన సిపారసులను ఆమోదిస్తూ రాష్ట్రపతి భవన్ ఓ ప్రకటన విడుదల చేసింది.

1924 డిసెంబర్ 25న మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో జన్మించిన అటర్ బిహారి వాజ్ పేయ్ దేశ రాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. 1968లో జన్ సంఘ్ అధ్యక్షుడిగా, బిజేపి వ్యవస్థాపక అధ్యక్షుడిగా బిజేపిలో వాజ్ పేయికి ప్రత్యేకమైన స్థానం ఉంది. 1996లో తొలిసారిగా భారతీయ జనతాపార్టీ నుంచి మొదటి ప్రధానిగా పదవి చేపట్టిన వాజ్ పేయి అప్పటి రాజకీయ సంక్షోభం వల్ల 13 రోజుల్లోనే ఆ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తదుపరి 1998లోనూ ప్రధానిగా 13 నెలలు మాత్రమే పరిపాలించారు.

1999లో 13వ లోక్ సభకు ఎన్నికైన వాజ్ పేయి పూర్తి కాలం దేశానికి సుస్థిర పాలన అందించారు. వివాదరహితుడిగా, మృదుస్వభావిగా పేరున్న వాజ్ పేయ్ నేటి తరం బిజేపి నేతల ఎందరికో మార్గదర్శి. వాజ్ పేయ్ 90వ జన్మదినం సందర్భంగా మోడీ ప్రభుత్వం ఒక రోజు ముందుగానే ఆయనకు భారతరత్నను ప్రకటించింది.

వాజ్ పేయ్ తోపాటు పండిట్ మదన్మోహన్ మాలవ్య కు కూడా భారతరత్నను ప్రకటించారు. మాలవ్య 1861 డిసెంబర్ 25న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు. అలహాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా, హైకోర్టులో న్యాయవాదిగా పనిచేసిన మాలవ్య మంచి గుర్తింపును పొందారు.

1886లో రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన 1887 లో నేషనలిస్ట్ వీక్లీ ఎడిటర్ గా పనిచేశారు. 1907లో అభ్యుదయ వేదిక, మరియాద హిందీ వారపత్రిక ప్రారంభించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బనారస్ హిందూ విద్యాలయాన్ని స్థాపించిన మదన్ సత్యమేవ జయతే నినాదాన్ని నలుదిశలా వ్యపింపజేశారు.

1919-39 మధ్య కాలంలో ఆయన బనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్స్ లర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 1924-46 మధ్య హిందుస్తాన్ టైమ్స్ చైర్యన్ గా వ్యవహరించారు. మాలవ్య 1946 నవంబర్ 12న వారణాసిలో కన్నుమూశారు. ఎంతో కీర్తిగడించిన మాలవ్యకు మోడీ ప్రభుత్వం భారతరత్నతో ఆయన కీర్తిని మరింత పెంచారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.