వాహన కాలుష్య నివారణ అందరి బాధ్యత – గవర్నర్ నరసింహన్

హైదరాబాద్: నగరంలో వాహన కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. దీన్ని నివారించాల్సిన బాధ్యత నగరావాసులందరిపై ఉందని రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌ అన్నారు. జీహెచ్‌ఎంసి, ఎపిఐఐసిలతో కలిపి సైబరాబాద్ లో ఏర్పాటైన బైక్ స్టేషన్‌ను రాష్ట్ర గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ బైక్‌స్టేషన్‌లో పర్యావరణ కాలుష్యం తగ్గించేందుకు ఉద్యోగుల్లో అవగాహన పెంచేందుకు  300 విదేశీతరహా  సైకిళ్ళను హైదరాబాద్  బైసైక్లింగ్  క్లబ్ అందుబాటులో ఉంచింది. ఆరోగ్య స్పృహ, పర్యావరణ కాలుష్య నివారణ లక్ష్యంగా,  సైక్లింగ్ క్లబ్, జీహెచ్ఎంసీ కృషిని ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ అభినందించారు. హైదరాబాద్‌లో సైక్లింగ్‌ కల్చర్‌ పెరగాలని గవర్నర్‌ ఆశించారు. రాబోయే రోజుల్లో సోలార్‌ వాహనాలతోపాటు, కేవలం సైకిళ్ళు మాత్రమే అందుబాటులో ఉంటే పర్యావరణ కాలుష్యం ఎంతో తగ్గించుకోవచ్చని నరసింహన్‌ ఆశాభావం వ్యక్తంచేశారు.

ఐటీ కారిడార్‌లో కాలుష్యాన్ని తగ్గించేందుకు త్వరలో 60 కిలోమీటర్ల సైక్లింగ్‌ ట్రాక్‌ ఏర్పాటు చేస్తున్నామని జిహెచ్‌ఎంసీ కమిషనర్‌ కృష్ణబాబు తెలిపారు.  ఐటీ కంపెనీలకు వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ప్రత్యేకంగా సైకిళ్లపై వెళ్లేందుకు ట్రాక్‌ను ఇప్పటికే అభివృద్ధి చేశామని చెప్పారు. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి చేరుకోవడంతో పాటు ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్ల నుంచి ఆయా ఐటీ కంపెనీలకు చేరుకునేలా వీటిని డిజైన్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.  గచ్చిబౌలిలో ప్రారంభమైన బైక్‌ స్టేషన్‌లో ఉన్న 300 ఇంపోర్టెడ్‌ సైకిళ్ళను హైదరాబాద్ మెట్రో అందించిందని కృష్ణబాబు తెలిపారు. రాబోయే రోజుల్లో మెట్రో స్టేషన్లలోనూ సైక్లింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు మెట్రోరైల్‌ ఎండీ ఎన్‌విఎస్‌ రెడ్డి తెలిపారు.

సైకిళ్ల వినియోగంపై ప్రజల్లో రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోందని హైదరాబాద్‌ సైక్లింగ్‌ క్లబ్‌ చైర్మన్ డీవీ మనోహర్ తెలిపారు. రెండేళ్ల క్రితం నెక్లెస్‌రోడ్డులో తాము ఏర్పాటుచేసిన బైక్‌స్టేషన్  ద్వారా నాలుగు వేలమంది సభ్యులుగా ఉన్నారని తెలిపారు. సైకిల్ టు వర్క్ పేరుతో ఐటీ ఉద్యోగుల్లో అవగాహన పెంపొందేలా కృషి చేస్తూనే సైకిల్‌ వినియోగం పెరిగేలా ప్రయత్నిస్తామని మనోహర్‌ స్పష్టంచేశారు. అంతేగాక సైకిల్‌పై ఆఫీసులకు వచ్చే వారికి స్పెషల్‌ ఇన్సెంటివ్స్‌ ఇచ్చేలా ఐటీ కంపెనీలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

అనంతరం నిర్వహించిన ‘బైసైక్లోన్ -2013’లో వెయ్యికి పైగా సైక్లిస్టులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దానం నాగేందర్, ప్రసాద్‌కుమార్, మేయర్ మాజిద్ హుస్సేన్, ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ , డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్, మెట్రోరైల్ ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్, ఏపీఐఐసీ ఎండీ జయేష్ రంజన్, తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.