విజయవంతమైన జీఎస్ఎల్ వీ-డీ5 ప్రయోగం

GSLV-D5

భారత అంతరిక్షపరిశోధన సంస్థ(ఇస్రో) ప్రయోగించిన కీలకమైన జియో సింక్రనన్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్ వీ-డీ5) నిప్పులు చిమ్ముతూ విజయవంతంగా నింగికెగసింది. శ్రీహరి కోటలో ఉన్న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ లో సాయత్రం 4.18నిమిషాలకు 1980 కిలోల బరువున్న సమాచార ఉపగ్రహం జీశాట్-14ను మోసుకుని అంతరిక్షంలోకి దూసుకువెళ్లింది. ఈ ఉపగ్రహ నిర్మాణానికి 45 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి.
205 కోట్ల రూపాయలతో జీఎస్ఎల్ వీ లాంచ్ వెహికల్స్ ను షార్ రూపొందించింది. అందులో భాగంగా ఈ ఉపగ్రహాన్ని 2013 ఆగష్టులోనే ప్రయోగించాల్సి వుండగా సాంకేతిక కారణంగా వాయిదా వేశారు. 7020 అనే ప్రత్యేక అల్యూమినియం లోహంతో తయారైన ఇంధన ట్యాంకు పగలడంతో, దానిని సరి చేసి ఇప్పడు విజయవంతంగా ప్రయోగించారు.

జీఎస్ఎల్ వీలో దేశీయ క్రయోజనిక్ ఇంజిన్ ను వాడుతున్నారు. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవఇంధనాన్ని, మూడో దశలోని క్రయోజనిక్ ఇంజన్ లో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ లను మండించి ఉపగ్రహాన్ని అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. దీనిపై సర్వత్ర ఆసక్తి నెలకోవడంతో శాస్త్రవేత్తలు పూర్తి సర్వసన్నద్దంగా ప్రయోగం నిర్వహించారు. ఇస్రో చరిత్రలో ఇది 105 వ ప్రయోగం కాగా జీఎస్ఎల్ వీ సిరీస్ లో 8 వ ఉపగ్రహం.

ఈ ప్రయోగంతో భారత్ అగ్రరాజ్యాల సరసన చేరింది. చైనా, రష్యా, జపాన్ వంటి అగ్రరాజ్యాల తర్వాత స్థానంలో భారత్ చేరడం ఎంతో గర్వించదగ్గ విషయం.

జీఎస్ఎల్ వీ ప్రయోగం విజయవంతమవ్వడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ అనుకున్నట్టే కక్ష్యలో జీఎస్ఎల్ వీ డీ5 విజయవంతంగా అడుగుపెట్టిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు.

ఇందుకు కష్టపడిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రముఖ శాస్త్రవేత్త యూఆర్ రావు 1992లో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ తమ అంచనాలకు అనుగుణంగా పని చేసిందని అన్నారు. ఈ విజయం ఇస్రో సభ్యులందరిదీ అని, దేశ శాస్త్రీయ సమాజానికి ఇది సుదినం అని రాధాకృష్ణన్ అభిప్రాయపడ్డారు. దీంతో ఇస్రో చిరకాల స్వప్నం నెరవేరినట్టయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.