విజయవాడ సమీపంలోనే రాజధాని

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సమదూరంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని, ఈ నెల 1న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ రోజు జరిగిన శాసనసభ సమావేశంలో రాజధానికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యసాధనకు ప్రభుత్వం ఏడు మిషన్లను, ఐదు గ్రిడ్ లను మరియు నాలుగు విభిన్న సందేశాత్మక కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్లు తెలిపారు. ప్రాథమిక రంగం, పట్టణీకరణతోపాటు స్మార్ట్ సిటీల నిర్మాణం, పారిశ్రామిక మిషన్, మౌళికవసతుల రంగం, సేవా రంగం, నైపుణ్యాన్ని పెంపొందించే రంగం మరియు సామాజిక సాధికారతతోపాటు అందరికి నీరు అందించడం, 24 గంటల విద్యుత్ సరఫరా, ప్రతి ఇంటికి గ్యాస్ సరఫరా, ప్రతి గ్రామానికి బి.టి.రోడ్డు మరియు ఫైబర్ ఆప్టిక్ బ్రాడ్ బాండ్ కనెక్టివిటిని కల్పించడం రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని ఆయన పేర్కొన్నారు. ప్రగతి సాధనలో ప్రజలను భాగస్వామ్యం చేసి వారిలో ఉద్యమ స్ఫూర్తిని కల్పించే లక్ష్యంతో పేదరికంపై గెలుపు, పొలం పిలుస్తోంది, బడి పిలుస్తోంది మరియు నీరు చెట్టు అని నాలుగు వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిందని ఆయన తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు, అందుబాటులో ఉన్న అవకాశాలు, ఆర్ధిక ప్రగతికి దోహదపడే అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర అధ్యయనం చేయడంతోపాటు ప్రతి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించిందని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాతోపాటు మరికొన్ని ప్రాంతాలు అతి తక్కువ వర్షపాతానికి నోచుకొన్న నేపథ్యంలో కరువు నివారణ కోసం మెరుగైన నీటి నిర్వహణ పద్ధతులు మరియు వ్యవసాయ ఆధునికి విధానాలైన డ్రిప్ మరియు తుంపర్ల సేద్యానికి ఆయా జిల్లాల ప్రణాళికలను రూపొందించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తూ అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించడంతోపాటు, అంతర్జాతీయ విమానాశ్రయాలు నిర్మించడానికి చర్యలు చెపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. అదే విధంగా అన్ని జిల్లాల్లో పద్నాలుగు స్మార్ట్ సిటీలను నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో చర్యలు చేపట్టినట్లు చంద్రబాబు తెలిపారు. నూతన రాజధాని నిర్మాణానికి అవసరమైన విధానపర, ఆర్ధిక మరియు పరిపాలన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందించగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రూపు దిద్దుకోనున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని దేశ ఆర్ధిక వ్యవస్థకు బలమైన కేంద్రంగా నిలబడగలదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.