విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదు

హైదరాబాద్, అక్టోబర్ 22: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి ఆపేది లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణకు హక్కు ఉందని దానిని వినియోగించుకుంటామని తెలిపారు. పునర్విభజన చట్టంలో నిర్దేశించిన 54 శాతం విద్యుత్‌వాటా ఇవ్వకుండా, శ్రీశైలం మీద కృష్ణా నదీ యాజమాన్య మండలికి లేఖలు రాయడమేమిటని ఆయన మండిపడ్డారు. ప్రాజెక్టు నీటిలో విద్యుత్ ఉత్పత్తికి ఉన్న కేటాయింపుల ప్రకారమే తెలంగాణ ప్రభుత్వం నడుచుకుంటున్నదని స్పష్టం చేశారు.

శ్రీశైలం ఎడమ కాలువ వద్ద విద్యుత్ ఉత్పత్తి విషయంలో తాము నిబంధననూ ఉల్లంఘించడం లేదని కృష్ణా నదీ యాజమాన్య మండలి కార్యదర్శి ఆర్‌కే గుప్తాకు బుధవారం రాసిన లేఖలో తెలంగాణ నీటిపారుల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ పేర్కొన్నారు. రిజర్వాయర్ నీటిని వినియోగించుకోవడంలో ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆ లేఖలో పేర్కొన్నారు.

బుధవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం సంతృప్తికర స్థాయిలోనే ఉన్నదని, నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి ఇంకా రెండు అడుగుల తేడా ఉందని, 2004 నాటి 107 జీవో తు.చ. తప్పకుండా పాటిస్తున్నామని మంత్రి తెలిపారు. ఎస్‌ఆర్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగు గంగకు 15 టీఎంసీలు మొత్తం 34 టీఎంసీలు వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటికే 60 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాడుకొని ప్రాజెక్టులు నింపుకున్నారన్నారు. తెలంగాణ ప్రభుత్వం 800 మెగా వాట్ల ఉత్పత్తి ఆపుకుని, మీరిచ్చే 300 మెగావాట్లను తీసుకోవాలా అని మంత్రి ప్రశ్నించారు.

“తెలంగాణలో పరిశ్రమలకు ఇవ్వాల్సిన కరెంటును ఆపుచేసి అది రైతులకు అందజేస్తున్నాం. యూనిట్‌కు 8-50 నుంచి 9 రూపాయలు ఖర్చు చేసి కరెంటు కొని రైతులకు అందజేస్తున్నాం. ఎగువ సీలేరు, కృష్ణపట్నం, సీమలో తెలంగాణకు రావల్సిన వాటను ఇవ్వాలని“ మంత్రి డిమాండ్ చేశారు.

“రైతులకు కరెంట్ రాకుండా చేసేందుకు విద్యుత్ ఉత్పత్తి ఆపాలని చంద్రబాబు చెబుతున్నారు. ఆపే ప్రసక్తి లేదని మేం చెబుతున్నాం, తెలంగాణకు రావల్సిన వాటాను ఇవ్వాలని చంద్రబాబు నాయుడుని నిలదీస్తున్నాం. మీరు కూడా నిలదీస్తారా? మీరు ఎటువైపో ఉంటారో తేల్చుకోవాలని“ తెలంగాణ టీడీపీ నేతలను హరీశ్ రావు ప్రశ్నించారు.

తెలంగాణలో ఎండిపోతున్న పంటలను కాపాడుకోవడానికే విద్యుత్‌ను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. రైతులు నానా ఇబ్బందులకు గురవుతున్నారని, వారి బాధలను తీర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం నిబంధనల ప్రకారం తెలంగాణకు ఇవ్వాల్సిన విద్యుత్ వాటాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వనందునే ఈ వివాదాలు తలెత్తుతున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.