వెంకటస్వామి కన్నుమూత

venkataswamy-23

(పాత చిత్రం)

హైదరాబాద్, డిసెంబర్ 23: కాంగ్రెస్ సీనియర్ నేత జి వెంకటస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. పిసిసి అధ్యక్షుడిగా, సీడబ్ల్యుసీ సభ్యుడిగా ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. వెంకటస్వామి మృతితో కాంగ్రెస్ పార్టీ వర్గాలవారు విషాదంలో మునిగిపోయారు. పలు రాజకీయపార్టీల నేతలు ఆయన మృతికి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం పంజాగుట్ట శ్మశానవాటికలో వెంకటస్వామి పార్థివదేహాన్ని అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కాంగ్రెస్ పార్టీ కురవృద్ధుడు, పార్టీకి ఎనలేని సేవలు అందించిన గడ్డం వెంకటస్వామి అనారోగ్యంతో కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన కేర్ అసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుది శ్వాస విడిచారు. కాకాగా సుపరిచితులైన వెంకటస్వామి 1929 అక్టోబర్ 5న జన్మించారు. వెంకటస్వామికి భార్య ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు వినోద్, వివేక్ ఇద్దరు కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, ఏడుసార్లు ఎంపీగా ఎన్నికైన ఆయన దాదాపు 5 దశాబ్దాలపాటు కాంగ్రెస్ పార్టీలో అనేక పదవులను చేపట్టారు.

1957లో చెన్నూరు నుంచి అసెంబ్లీకి మొదటిసారి ఎన్నికైన ఆయన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటి సభ్యుడిగా సుదీర్ఘకాలంపాటు పనిచేశారు. 1982-84 మధ్యకాలంలో పీసీసీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన వెంకటస్వామి కేంద్రంలో అనేక పదవులను అలంకరించారు. 1967 నుంచి 2004 మధ్య కాలంలో వెంకటస్వామి ఏడు సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. దళిత వర్గానికి చెందిన వెంకటస్వామి పేదల నేతగా మంచిపేరు తెచ్చుకున్నారు. ఇందిరాగాంధీ, పీవీ హాయాంలో కేంద్రలో పలు మంత్రిపదవులను కూడా ఆయన నిర్వహించారు.

ముక్కుసూటి స్వభావం కలిగిన ఆయన తెలంగాణ విషయంలో సోనియా జాప్యంచేస్తున్న తీరుపై విమర్శలు చేశారు. దీంతో కొంతకాలం కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం అయ్యారు. వెంకటస్వామి మృతితో కాంగ్రెస్ శ్రేణుల్లో విషాదం నెలకొంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపి సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, టిపిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితర నేతలు వెంకటస్వామి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.