శాసనసభలో రేషన్ కార్డుల రగడ

హైదరాబాద్, నవంబర్ 13: రేషన్ కార్టుల పంపిణీపై ప్రజల్లో గందరగోళం నెలకొందని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని విపక్షాలు కోరాయి. రేషన్ దుకాణాల్లో ప్రవేటు వ్యక్తులు లబ్దిదారుల వివరాలు సేకరిస్తున్నారని, అదేవిధంగా కొన్ని చోట్ల లబ్దిదారుల నుంచి డబ్బులు కూడా వసూలు చేస్తున్నారని వారు సభ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వ అస్పష్ట నిర్ణయాలతో తమ రేషన్ కార్డులు ఎక్కడ రద్దౌతాయోనని పేదలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారని విపక్షాలు పేర్కొన్నారు.

 

తెలంగాణ శాసనసభ ప్రారంభమైన వెంటనే సభాపతి మధుసూదనాచారి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా రేషన్ కార్డుల అంశంపై అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పరస్పర ఆరోపణలతో సభ దద్దరిల్లింది. ఈ అంశంపై తెదేపా సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండానే పాత రేషన్ కార్డులు తొలగించడం ఎందుకని ప్రశ్నించారు. ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిస్తూ కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. కార్డుల పంపిణీలో దళారుల ప్రమేయం లేకుండా వీఆర్వోలు మాత్రమే దరఖాస్తులు స్వీకరించి, కార్డులు పంపిణీ చేస్తారని స్పష్టం చేశారు. రేషన్ కార్డుకు, ఆరోగ్రశ్రీకి సంబంధం ఉండదన్నారు.

 

రేషన్ కార్డుల అంశంపై ఆర్ధికమంత్రి ఈటెల రాజేందర్ సమాధానంతో సంతృప్తి చెందని విపక్షాలు ప్రభుత్వ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా సభనుంచి వాకౌట్ చేస్తున్నట్లు తెదేపా శాసనసభాపక్షనేత ఎర్రబెల్లి దయాకర్ రావు, బాజపా పక్షనేత కె.లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి, సీపీఎం నేత సున్నం రాజయ్యలు ప్రకటించారు.

 

విపక్షాల వాకౌట్ అనంతరం ఆర్ధిక మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసే వరకు పాతకార్డుల ద్వారానే బియ్యం అందిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ కార్డులు ఎక్కడా తీసేయలేదని స్పష్టంచేశారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే తమ రాజకీ మనుగడ ఉండదనే ఆందోళనతోనే విపక్షాలు అనవసరంగా రాద్దాంతం చేస్తున్నాయని విమర్శించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.