శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం

విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తుదిదశకు చేరుకున్నాయి. శరన్నవరాత్రి మహోత్సవాల్లో అమ్మవారి అలంకారాలలో చివరి రూపం శ్రీ రాజరాజేశ్వరీదేవి. తొమ్మిది రోజులుగా విశిష్ఠ పూజలందుకున్న దుర్గమ్మ చివరిరోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. సకల భువన బ్రహ్మాండాలకు ఈమె ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయంలో పూజలందుకుంటుంది. ఈమెను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారం ఉంది. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి వరాలుగా అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈమె అధిష్ఠాన దేవత.  చివరి రోజు కావడంతో రాష్ట్రం నలుమూలనుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. భవానీ మాలధారణ చేసిన భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చకునేందుకు  వేకువజామునుంచే ఇంద్రకీలాద్రిపైకి చేరుకున్నారు. ఆదివారం సాయంత్రం క్రిష్ణా నదిలో జరిగే శ్రీ కనకదుర్గమ్మ తెప్పోత్సవంతో శరన్నవరాత్రి  మహోత్సవాల కీలక ఘట్టం ముగుస్తుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.