సచివాలయంలో మీడియాపై ఆంక్షలు

telangana-24

హైదరాబాద్ : గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణ సచివాలయంలో మీడియా ప్రతినిధుల ప్రవేశంపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను అనుమంతిరాదంటూ సూత్రప్రాయ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం పలువురు ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. భద్రతాపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయంటూ కొందరు మంత్రులు, అధికారులు చేసిన ఫిర్యాదులను అనుసరించి అనుమతుల నిషేదానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారు.

సచివాలయంలో సందర్శకులతోపాటు మీడియా ప్రతినిధులు నిత్యం ఉండటంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందని కొంతమంది మంత్రులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి విధాన రూపకల్పన ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని, మంత్రులు, కార్యదర్శులు వెళ్లే లిఫ్టుల్లోకి చొరబడి ఇబ్బంది పెడుతున్నారని వారు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు.

ఇటీవల జరిగిన ముఖ్యకార్యదర్శుల భేటీలో చాలా మంది అధికారులు మీడియా ప్రతినిధులతో బాధలు పడుతున్నట్లు చెప్పుకున్నారు. మీడియా ప్రతినిధులమంటూ చాలా మంది సచివాలయంలోకి వస్తున్నారని, ముఖ్యమంత్రి కార్యాలయమైన సి బ్లాక్, మంత్రుల చాంబర్ల వద్ద తిరుగుతున్నారని, దీంతో భద్రతాపరమైన సమస్యలు వచ్చే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ముఖ్యమంత్రికి ఓ నివేదికను సమర్పించారు. రాష్ట్రంలో 20 న్యూస్ చానళ్లు, 15 దినపత్రికలు, ఇతర పక్ష పత్రికలు, ఇంటర్‌నెట్ న్యూస్ వెబ్‌సైట్లున్నాయి. ఈ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులు, వీడియో గ్రాఫర్లు, ఫోటో గ్రాఫర్లు దాదాపు 200 మందికి పైగా  సెక్రటేరియట్ కు వస్తుంటారు. రాష్ట్ర విభజన తర్వాత ప్రభుత్వానికి కేవలం 4 భవనాలే రావడంతో అధికారుల కార్యాలయాలు, మంత్రుల చాంబర్లు, పార్కింగ్ స్థలం ఇరుకుగా మారాయి. సచివాలయానికి వచ్చిన వారిలో ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడం కష్టంగా ఉందని, దీని వల్ల భద్రతపరమైన చిక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

దిల్లీలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు ఉండే సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ లలోను మీడియాను అనుమతించడం లేదు. గతంలో నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నారు. తాజాగా ఇటీవల దిల్లీలో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు మీడియాను సచివాలయంలోకి అనుమతించొద్దని నిర్ణయించింది. ఇదే పద్ధతిన తెలంగాణ సచివాలయంలో కూడా కొనసాగించాలని,  ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి మాత్రమే మీడియాను అనుమతించాలని  కొందరు ఉన్నతాధికారులు, మంత్రులు ముఖ్యమంత్రికి తెలిపారు.

ఈ నేపథ్యంలో విలేకరులను సచివాలయంలోకి అనుమతించకుండా ప్రభుత్వ తరపునే వారికి సమాచారం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఎప్పటికప్పుడు మీడియాకు సరైన సమాచారం అందించేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలన్నారు. దీంతో విలేకరులు సచివాలయంలో పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వానికి సంబంధించిన పత్రికా ప్రకటనలు, ఫొటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఇంటర్‌నెట్ ద్వారా పంపించాలన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.