సమాధానం అడిగితే సస్పెండ్ చేశారు : రేవంత్ రెడ్డి

హైదరాబాద్, నవంబర్ 14: “నేను ఎక్కడా నిజామాబాద్ ఎంపి పేరు అనలేదు, అవమానించే మాటలు, అభ్యంతరకరమైన పదాలు నేను ఎక్కడా వాడలేదు. నిజామాబాద్ ఎంపి మీద ఆరోపణలు ఉన్నాయి వీటికి సంబంధించి ప్రభుత్వాన్ని నేను సమాధానం మాత్రమే అడిగాను“ అని తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష ఉపనేత రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్టీ ఆర్ భవన్ లో ఆయన శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సభలో సమగ్ర సర్వేపై అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులకు ప్రదర్శించారు. నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పేరు కూడా తాను సభలో ప్రస్తావించలేదని, నిజామాబాద్ ఎంపీ అని మాత్రమే అన్నానని, ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదన్నారు. నిజామాబాద్ ఎంపీ సమగ్ర సర్వేలో రెండు చోట్ల పేరు నమోదు చేయించుకున్నట్లు పత్రికల్లో వచ్చిందని, ఇది నిజమా కాదా అని మాత్రమే తాను సభలో అడిగితే దానికి మంత్రి ఈటెల రాజేందర్ సమాధానమిచ్చారని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ తర్వాత కూడా 16 మంది శాసనసభ్యులు చాలా విషయాల మీద మాట్లాడటం జరిగిందన్నారు. ఆ తరువాత రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడాల్సి ఉండగా నన్ను తొలగించి వేరే సభ్యునికి అవకాశమిచ్చారన్నారు. శాససభ్యుడు మాట్లాడిన తరువాత మాట్లాడమని స్పీకర్ అన్నారని తెలిపారు. నేను మాట్లాడుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ మీద మంత్రి కేటీఆర్ పరుషమైన వ్యాఖ్యలు చేయడం, అవమానించే విధంగా మాట్లాడన్నారు. శాసనసభను వేదికను చేసుకొని తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులకు ఓట్లేసిన ప్రజలను అవమానించే విధంగా మాట్లాడంతో కేటీఆర్ పై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును స్పీకర్ అనుమతితో శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. కేటీఆర్ మీద సభా హక్కుల ఉల్లంఘన నోటీసును చదువుతున్నప్పుడు అర్ధంతరంగా నా మైకు ఆపుచేసి, అంతకముందు రోజు జరిగిన అంశం ప్రస్తావించి తనను సస్పెండ్ చేయడమేంటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో మాట్లాడుతూ.. ఈ సభ్యుడు సభను తప్పుదోవ పట్టిస్తున్నాడు, ఎక్కడ ఎక్కడినుంచే సమాచారం తెచ్చి సభలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు క్షమాపణ చెప్పాల్సిందేనని అనడం సరికాదన్నారు. పత్రిక, ప్రసార సాధనాల్లో వచ్చిన వాటి ఆధారంగా ప్రశ్న అడగాల్సిన అవసరం లేదా? అలాంటి నియమ నిబంధనలు శాసనసభలో చేయబోతున్నారా? అని ప్రశ్నించారు. సభలో జరిగినవన్నీ ముఖ్యమంత్రికి తెలుసునని, తనను మాట్లాడనివ్వకుండా ఉండేందుకే సస్పెండ్ చేయించారని రేవంత్ రెడ్డి తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.