సిటీ బస్సుల్లో మహిళల కోసం ప్రత్యేక క్యాబిన్ల ఏర్పాటు

ladies comportment1-30

మహిళల ఇబ్బందులు తొలగించేందుకు తెలంగాణ ఆర్టీసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆడవారికోసం ప్రత్యేక క్యాబిన్లను ఏర్పాటు చేసింది. దీంతో సిటి బస్సుల్లో ప్రయాణించే ఆడపిల్లల అగచాట్లకు అడ్డుకట్ట పడనుంది. భద్రతరీత్యా ఆడవారికి బస్సుల్లో ప్రయాణం శ్రేయస్కరం అయినప్పటికీ, రద్దీగా ఉండే సిటి బస్సులో మాత్రం ప్రయాణం నరకప్రాయంగా ఉంటంది. ఆడవారికోసం కేటాయించిన సీట్లు ఉన్నా విపరీతమైన రద్దీతో కూర్చోవడమే ఇబ్బందిగా మారింది. దీనికి తోడు మగవారి తోపులాటలు, ఆకతాయిల ఈవ్ టీజింగ్ తో కాలేజీలకు వెళ్లే అమ్మాయిలు, ఆఫీసులకు వెళ్లే మహిళలు నిత్యం నరకం చూస్తుంటారు. ఇక మీదట ఈ ఇబ్బందులు ఏమి లేకుండా ఆడవారి కోసం ఆర్టీసి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మహిళలకోసం బస్సుల్లో ప్రత్యేక కంపార్ట్ మెంట్లను ఏర్పాటు చేసింది. పురుషుల సీట్లకు, ఆడవారి సీట్లకు మధ్యలో గ్రిల్స్ ఏర్పాటు చేశారు.

ప్రయాణాల్లో స్త్రీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ప్రభుత్వం నియమించిన మహిళా రక్షణ కమిటి చర్చించింది. ఆర్టీసి బస్సుల్లో మహిళలకోసం ప్రత్యేక ఏర్పాట్లపై ఓ నివేదిక సమర్పించింది. సిటి బస్సుల్లో మగవారి, ఆడవారి సీట్ల మధ్య గ్రిల్స్ ఏర్పాటు చేయాలని కమిటి సూచింది. కమిటి నివేదిక ఆధారంగా ఆర్టీసి యాజమాన్యం సిటి బస్సుల్లో మహిళా కంపార్ట్ మెంట్లను ఏర్పాటు చేసింది. మహిళా సీట్లకు, పురుషుల సీట్లకు మధ్య స్లైడింగ్ డోర్ ను ఏర్పాటుచేసింది. ఈ ఏర్పాటు వల్ల పురుషులు గతంలో మాదిరిగా మహిళా సీట్లలో కూర్చునే వీలు ఉండదు.

రాష్ట్ర రవాణాశాఖ మంత్రి మహేందర్ రెడ్డి ఈ గ్రిల్స్ ఏర్పాటు చేసిన బస్సుని ప్రారంభించారు. ఆడపిల్లల భద్రతకోసం ఆర్టీసి బస్సులో మరిన్ని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.

నగరంలో మొత్తం 3800 బస్సులుండగా వీటిలో 1500 ఆర్డనిరీ బస్సులు ఉన్నాయి. ముందుగా ఆర్డనిరీ బస్సుల్లో ఈ ఏర్పాట్లను పూర్తిచేయనున్నారు. దీని కోసం ఒక్కొబస్సుకు సుమారు 17 వేల రూపాయల ఖర్చు అవుతుంది.

ఆర్టీసి ఉన్నతాధికారులు ఈ గ్రిల్స్ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్టీసి ఎం.డి పూర్ణచందర్ రావు స్వయంగా ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రయాణంలో మహిళలకు భద్రత కల్పించడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ప్రయాణికుల అభిఫ్రాయాలు స్వయంగా తెలుసుకుంటున్నారు.

సిటి బస్సుల్లో తమ కోసం కంపార్ట్ మెంట్ ఏర్పాటు చేయడంపై మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆకతాయిలు, పోకిరీలనుంచి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో మహిళలకోసం లేడీస్ స్పెషల్ నడుపుతున్న ఆర్టీసీ ఇప్పుడు అన్ని బస్సుల్లోను మహిళల కోసం ప్రత్యేక కంపార్టు మెంట్ ఏర్పాటుచేయడంపై సర్వత్రా హర్షవ్యక్తమౌతుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.