సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య

ప్రముఖ తెలుగు సినీ నటుడు ఉదయ్ కిరణ్ ఆదివారం అర్ధరాత్రి హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ లోని ఆయన స్వగృహంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందు ఆయన స్నేహితులకు ఫోన్ చేసి చెప్పి మరీ, ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఆర్ధిక కారణాలతో బాటు, మరికొన్ని ఇతర కారణాల వలన తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వారికి తెలిపాడు. స్నేహితులు హుటాహుటిన బయలుదేరి ఉదయ కిరణ్ ఇంటికి చేరుకుని ఆయనను అపోలో ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు ధ్రువీకరించాయి. సినీ హీరో శ్రీకాంత్, తరుణ్, ఆర్యన్ రాజేష్ తదితరులు విషయం తెలియగానే అర్ధరాత్రి హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.

సినీ హీరో ఉదయ్ కిరణ్ నివాసంలో క్లూస్ టీం అధికారుల తనిఖీలు చేశారు. ఆత్మహత్య చేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించలేదని, ఆత్మహత్య చేసుకున్నట్టుగానే కనిపిస్తుందని క్లూస్ టీం అధికారి వెంకన్న తెలిపారు. పోస్టు మార్టం నివేదిక అనంతరం మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందన్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు ఎవరెవరితో మాట్లాడారన్న దానిపై ఆరా తీస్తున్నామని, ఉరి వేసుకునే ముందు భార్య విషిత సెల్ ఫోన్ కు చివరగా ‘ఐ లవ్ యూ’ అని ఎస్ఎంఎస్ పంపించాడని వివరించారు. కాగా ఆయన వాడే ల్యాప్ టాప్, ఇతర వస్తువులను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది.

ఉదయ్ కిరణ్ 1980 జూన్ 26న జన్మించాడు. 2012 అక్టోబర్ 24న విషితను వివాహం చేసుకున్నాడు. 2000 లో ‘చిత్రం’ సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు. ఈ సినిమా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్లో తేజ దర్శకత్వంలో రూపొందింది. ఇప్పటి వరకు మొత్తం 19 సినిమాలలో నటించాడు. ఇందులో 16 తెలుగు సినిమాలు కాగా, మూడు తమిళ చిత్రాలు ఉన్నాయి. ‘నువ్వు-నేను’, ‘మనసంతా నువ్వే’, ‘శ్రీరాం’ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న ఉదయ్ కిరణ్,’నువ్వు-నేను’ చిత్రానికి ఉత్తమ కధానాయకుడిగా 2001లో ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్నాడు. ఉదయ్ కిరణ్ చివరిగా ‘జై శ్రీరామ్’అనే చిత్రంలో నటించాడు.

వీవీకే మూర్తి, నిర్మల దంపతులకు జన్మించిన ఉదయ్ కిరణ్, సికింద్రాబాద్ లోని వెస్లీ కళాశాలలో కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ప్రవేశించాడు. ఉదయ్ కిరణ్ అకాలమరణంతో చిత్ర పరిశ్రమ దిగ్భ్రాంతికి గురయింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.