సుజనాచౌదరి, దత్తాత్రేయకు కేంద్ర మంత్రివర్గంలో చోటు

హైదరాబాద్, నవంబర్ 8: రేపు జరగబోయే కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఇద్దరు ఎంపీలకు చోటు దక్కనుంది. కేంద్రంలో ఇప్పటికే ముగ్గురు తెలుగు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్ , అశోక్ గజపతిరాజులు ఉన్నారు. రేపు జరబోయే విస్తరణలో మరో ఇద్దరికి చోటు దక్కే అవకాశం ఉంది. తాజా విస్తరణతో రెండు రాష్ట్రాలకు చెరో మంత్రి పదవి దక్కినట్టవుతుంది.

 

మంత్రి వర్గంలో స్థానం కల్పించే విషయంపై తనకు పిఎంవో నుంచి ఫోన్ వచ్చిందని తెలుగుదేశం ఎంపీ సుజనాచౌదరి తెలిపారు. ప్రధాని ఏ శాఖ కేటాయించినా సమర్ధవంతగా నిర్వహిస్తానని ఆయన చెప్పారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రానికి, దేశానికి పేరు తెచ్చిపెట్టేలా పాటుపడతానని సుజనా చౌదరి తెలిపారు. రేపు మధ్యాహ్నం కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సుజనా చౌదరి తెలిపారు.

 

అదేవిధంగా సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయకు కేంద్ర మంత్రివర్గంలో చోటు ఖరారైంది. ఈ సాయంత్రం బండారు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. తెలంగాణ నుంచి బిజేపి నుంచి గెలిచిన ఎంపి బండారు దత్తాత్రేయను మోదీ తన మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. తొలిసారి నిరాశపరచినా మోదీ ఈ సారి కరుణించడంపై రాష్ట్ర బిజేపి వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దత్తాత్రేయకు మంత్రి పదవి వస్తే తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం పెరగనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.