సున్నం రాజయ్య కు అవమానం

హైదరాబాద్: సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్యకు తెలంగాణ సచివాలయం వద్ద అవమానం జరిగింది. ఆటోలో సచివాలయానికి వచ్చిన రాజయ్యను, ప్రధాన ద్వారం వద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆయనను సచివాలయం లోపలికి వెళ్లకుండా అడ్డుకొన్నారు. గుర్తింపు కార్డు చూపించినప్పటికీ మీ గన్ మెన్ కారు ఎక్కడ అంటూ ఆయనను అవహేళన చేశారు. తనకు జరిగిన అవమానం పై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.

దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ ఘటనలో గాయపడిన యువకుడికి ప్రభుత్వం తరపున ఉద్యోగం కల్పించే విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసేందుకు గురువారం సాయంత్రం సీపీఎం ఎమ్మెల్యే సున్నం రాజయ్య ఆటోలో సచివాలయానికి చేరుకున్నారు. అయితే రాజయ్య వచ్చిన ఆటో సచివాలయం ప్రధాన ద్వారం వద్దకు రాగానే సెక్యూరిటీ సిబ్బంది ఆయనను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. తాను ఎమ్మెల్యే అని గుర్తింపు కార్డును చూపించినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది అడ్డుచెప్పారు. ఎమ్మెల్యే అయితే గన్ మెన్, వాహనం ఎక్కడ ఉందటూ ఆయనను అవహేళన చేశారు. ఆయనతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కూడా సెక్యూరిటీ సిబ్బందికి చెప్పే ప్రయత్నం చేసినా పట్టించుకోలేదు. అతి కష్టం మీద ఎంఏల్ఏ తో పాటు మరో ఇద్దరు ప్రధాన ద్వారం నుండి సచివాలయంలోకి నడుచుకొంటూ వెళ్లారు. అనంతరం సీఎంఓ ముఖ్యకార్యదర్శి భూపాల్ రెడ్డిని కలిసి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ ఘటనలో గాయపడిన యువకుడికి ఉద్యోగ విషయమై చర్చించారు.

సచివాలయం సెక్యూరిటీ సిబ్బంది ఎమ్మెల్యే సున్నం రాజయ్య ను అవమానించిన విషయాన్ని తెలుసుకొన్న పోలీసు ఉన్నతాధికారులు ప్రధాన ద్వారం వద్ద విధి నిర్వహాణలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందిని పిలిపించి మాట్లాడారు. ఈ లోగా సచివాలయం నుండి బయటకు వస్తోన్న రాజయ్యను చూసిన సిబ్బంది ఆయన ఎమ్మెల్యే అని తెలియదంటూ పోలీసు ఉన్నతాధికారులకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఎమ్మెల్యే గుర్తింపు కార్డు చూపించినప్పటికీ సచివాలయంలోకి అనుమతించకుండా తనని హేళన చేశారంటూ పోలీసులపై రాజయ్య మండిపడ్డారు. ఈ విషయమై స్పీకర్ కు ఫిర్యాదు చేస్తానని సున్నం రాజయ్య తెలిపారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.