సెప్టెంబర్ 7

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ రాష్ట్రవిభజనకు అనుకూలంగా చేసిన ప్రకటనతో ఇప్పటికే నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల పోటాపోటీ ఆందోళనలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటుండగా…ఇప్పుడు తాజాగా సెప్టెంబర్ 7 న ఏపియన్ జీవోలు, ఓయూ జేఏసిలు పోటాపోటీగా సభలకు అనుమతివ్వాలంటూ  దరఖాస్తులు చేసుకోవడం పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారింది.అసలే నగరంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉండగా ఈ సమయంలో సభలకు అనుమతిస్తే అది ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అని హడలిపోతున్నారు.దీంతో నగరంలో సెప్టెంబర్ 7 న ఏం జరుగబోతోందో అన్న టెన్షన్ సర్వత్రా నెలకొంది.

హైదరాబాద్ లో ఇప్పుడు పోలీసుల పరిస్థితి ముందు నుయ్యి…వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది. తెలంగాణ రాష్ట్రఏర్పాటుకు సమ్మతితెలుపుతూ సీడబ్లూసీ చేసిన తీర్మానంతో ఇప్పటికే అటు సీమాంధ్రలో ఇటు హైదరాబాద్ లో ఆందోళనలు పెరిగిపోయాయి. దీనికి తోడు నగరంలోని ప్రభుత్వకార్యాలయాల్లో ఉద్యోగులు ప్రాంతాల వారీగా విడిపోయి పోటాపోటీ ఆందోళనలు చేస్తుండటంతో ప్రతీ రోజూ ఏదో ఓ చోట టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. వీటిని కంట్రోల్ చేయలేక పోలీసులు తలలు పట్టుకుంటుండగా తాజాగా రెండు ప్రాంతాల వారు హైదరాబాద్ లో పోటాపోటీ సభలనిర్వహణకు సమాయత్తం అవుతుండటం పోలీసులకు సరికొత్త సమస్యలను తెచ్చిపెట్టింది.

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ ఏపియన్ జీవోలు నగరంలో భారీ సభకు సన్నాహాలు చేస్తున్నారు. లక్షమందితో సమైక్యసభనిర్వహిస్తామని ఏపియన్ జీవో అధ్యక్షులు అశోక్ కుమార్ ప్రకటించారు. దీనికి అన్ని విభాగాల ఉద్యోగులతో పాటు రాజీకీయ పార్టీల నాయకులను ఆహ్వానిస్తామని ప్రకటించారు. సభకు అనుమతి వచ్చేలా కృషి చేస్తామని వీలైతే…కోర్టు ద్వారా అనుమతి తీసుకుంటామని ఏపియన్ జీవో నాయకులు చెపుతున్నారు. తాము యల్ బి స్టేడియంలో నే సభ నిర్వహిస్తున్నందున ఎలాంటి సమస్య లేదని వారు అంటున్నారు. ఒక వేళ సభకు అనుమతివ్వకున్నా జరిపి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే ఏపి ఎన్జీవో సభకు అనుమతిస్తే తమ శాంతి ర్యాలీకి అనుమతివ్వాలంటూ ఓయూ జేఏసి నాయకులు పోలీసులకు దరఖాస్తు చేసుకున్నారు. నిజాం కళాశాల నుండి గన్ పార్క్ వరకు తమకు శాంతి ర్యాలీకి అనుమతివ్వాలంటూ గత గురువారం రోజున ఓయూ జేఏసి నాయకులు సెంట్రల్ జోన్ డీసిపి కమాలకర్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. ర్యాలీకి అనుమతివ్వని పక్షంలో ఎల్బీ స్టేడియంలో జరిగే సమైక్యసభను అడ్డుకుని తీరుతామని ఓయూ జేఏసి నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఇక మరికొన్ని విద్యార్థి సంఘాలు అదే రోజు మిలియన్ మార్చ్ 2 ను నిర్వహిస్తామని ప్రకటించాయి. ఇక మరోవైపు అటు తెలంగాణ పొలిటికల్ జేఏసి ఆధ్వర్యంలో ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా శాంతిర్యాలీలు నిర్వహిస్తున్నారు.వీటికి ముగింపుగా హైదరాబాద్ లో భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు జేఏసి ప్రకటించింది.ఏపియన్ జీవో సభకు అనుమతిచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం శాంతి ర్యాలీ నిర్వహించితీరుతామని ఇప్పటికే జేఏసి ఛైర్మన్ కోదండరామ్ ప్రకటించారు. దీనికి తెలంగాణ అన్ని జిల్లాలనుండి పెద్ద సంఖ్యలో తెలంగాణ వాదులు తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

విభజన ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే నగరంలో ఉద్రిక్తపరిస్థితులు ఉండగా…  బహిరంగ సభలకు, ర్యాలీల వంటి వాటికి అనుమతిస్తే అగ్నికిఆజ్యం పోసినవారమవుతామని పోలీసులు భావిస్తున్నారు. నగరంలో సభలు, సమావేశాలకు అనుమితిస్తే పెద్దయెత్తున గొడవలు జరిగే అవకాశాలున్నట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.ఏ ఒక్కరికి అనుమితిచ్చినా.. మిగిలిన సంఘాలనుండి పెద్దయెత్తున ప్రతిఘటన ఎదురుకాక తప్పదు. ఒకవేళ అన్ని సంఘాలకు అనుమతిస్తే పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలూ ఉన్నాయిదీంతో పోలీసుల పరిస్థితి ఇప్పుడు ముందు గొయ్యి, వెనుక నుయ్యి అన్నట్టుగా తయారైంది. ప్రస్తుతం నగరంలో నెలకొన్న పరిస్థితులపై డీజిపి దినేష్ రెడ్డి వివిధవిభాగాలకు చెందిన అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించినట్లు సమాచారం.సభకు అనుమతివ్వాలా… వద్దా అనే విషయాలపైనే ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఒక వేళ సభలకు అనుమతిచ్చినా ఇప్పుడు అందుబాటులో ఉన్న బలగాలు సరిపోవు కాబట్టి ఇంకా కొన్ని అదనపు బలగాలు అవసరమని కొందరు అధికారులు డీజిపి దృష్టికి తీసుకువచ్చినట్లు సమాచారం. ఐతే ప్రస్తుతం నెలకొన్న పిరిస్థితుల్లో ఎవ్వరికీ అనుమతివ్వకుండా నగరంలో నిషేధాజ్ఞలు పొడిగించడమే మంచిదన్న అభిప్రాయాలను పోలీసు అధికారులు వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఏదేమైనా… ఇప్పుడు ఎక్కడ చూసినా సెప్టెంబర్ 7 గురించే చర్చ జరుగుతోంది……అసలు ఆ రోజు ఏం జరగబోతోందన్న దానిపైనా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అనుమతివ్వకున్నా సభ నిర్వహించి తీరుతామని ఏపియన్ జీవోలు, ఏపియన్ జీవోలు సభనిర్వహిస్తే ర్యాలీ చేపడుతామని తెలంగాణ సంఘాలు ప్రకట చేసిన తరుణంలో ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అన్న ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి.

Have something to add? Share it in the comments

Your email address will not be published.