సొంత గూటికి తిరుగుబాటు కాంగ్రెస్ నాయకులు

  • పావులు కదుపుతున్న ఉండవల్లి
  • లగడపాటి, హర్షకుమార్. సబ్బం హరి అదే బాట
  • అధిష్ఠానం సుముఖం
  • ఢిల్లీలో, హైదరాబాద్ లో సమాలోచనలు

 

 

 

హైదరాబాద్, అక్బోబర్ 14:     సొంత గూటికి వచ్చేందుకు మాజీ కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. విభజన ముందు పార్టీని ఎదిరించి బయటకు వచ్చిన వారు ఇప్పుడు కాంగ్రెస్ మాత్రమే శరణ్యమనే నిర్ణయానికి వచ్చారు.  సీమాంద్ర కాంగ్రెస్ దిగ్గజాలుగా పేరొందిన నాయకులు ఇప్పుడు సొంత గూటికి వచ్చేందుకు ఆరాట పడుతున్నారు. ఈ మధ్య డిల్లీ పెద్దలతో కూడా సంప్రదింపులు జరిపారు. సమయం సందర్భం రాగానే తిరిగి కాంగ్రెస్ కండువాలు కప్పుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

రాష్ట్ర విభజన విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్, లగడపాటి రాజగోపాల్, హర్షకుమార్, సబ్బం హరి కాంగ్రెస్ అధిష్టానాన్ని ఎదిరించారు. పార్టీపై విమర్శలు గుప్పించి శాపనార్ధాలు కూడా పెట్టారు. నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో చేతులు కలిపి పార్టీపై ఆరోపణాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవంటూ దుమ్మెత్తి పోసి పార్టీకి రాజీనామా చేసారు. అంతగా గొప్పలు చెప్పిన ఈ నేతలంతా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఉండవల్లి అరుణ్ కుమార్ ఎఐసిసిలోని తన పాత సన్నిహితులతో తమ ఆవేదన పంచుకున్నారని తెలిసింది. తామంతా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు సిద్దంగా ఉన్నట్లు, సోనియా నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అధిష్టానం కూడా ఈ నేతల విజ్ఞప్తులపై పరిశీలిస్తామని పరోక్షంగా సానుకూల సంకేతాలిచ్చిందని పార్టీ వర్గాలు చెపుతున్నాయి.

కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉందని తెలుసుకున్న ఉండవల్లి తాజాగా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కూడా భేటీ అయ్యారు. అయితే నాడు పార్టీని నట్టేట ముంచిన నాయకులు ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ లోకి రావడంపై కొందరు సీనియర్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. క్లిష్ట పరిస్థితుల్లో పార్టీ వెంట ఉండాల్సిన నాయకులు, పార్టీపై దుమ్మెత్తి పోసి బయటికి వెళ్లి ఇప్పుడు తిరిగి పార్టీలోకి వస్తామంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.