‘స్మృతీ’ ఇరానీ గారి కొత్త కహానీ

స్మృతీ ఇరానీ…టీవీ యాక్ట్రెస్ గా ఉన్న ఈమె కాస్తా రెండేళ్ల క్రితం, ఎవరూ ఉఃహించని ఎత్తుకు ఎదిగారు. కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించడమేకాదు, ఏకంగా  కీలకమైన మానవవనరుల అభివృద్ధి మంత్రి అయిపోయారు. వెంటనే ఆమె విద్యార్హతల గురించి వివాదం రేగింది. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో, ఢిల్లీ జే ఎన్ యూలో జరిగిన పరిణామాలు ఆమెను మరింత వివాదాస్పదురాలిగా మార్చేశాయి. చివరికి, కేంద్ర మంత్రివర్గ విస్తరణలో చడీచప్పుడు కాకుండా ఆమెను ప్రతిష్టాత్మకమైన మానవవనరుల శాఖనుంచి తప్పించి, అంత ప్రాధాన్యం లేని జవుళి శాఖకు మార్చేశారు. సరే, అదంతా చరిత్ర.

ఈ అనుభవం తర్వాత కూడా ఆమె మాటతీరులో ఎలాంటి మార్పూ లేదు. ఇప్పుడామె తన గత చరిత్ర చెప్పుకుంటూ పై చరిత్రను ఇంకా పొడిగిస్తున్నారు. రెండేళ్ల క్రితం తను అనూహ్యంగా కేంద్రంలో అతి ముఖ్య శాఖకు మంత్రి కావడం తనలో కలిగించిన అతిశయం నుంచి, మైకం నుంచి ఆమె ఇప్పటికీ బయటపడలేదు. నేను పుట్టినప్పుడే పరిమళించినదాన్ని, నేను ముందునుంచీ గొప్పదాన్నే, కానీ ప్రపంచమే నన్ను గుర్తించలేదన్నట్టు నిష్ఠురాలు ఆడుతున్నారు. తనను తనే ఆకాశానికి ఎత్తుకుంటున్నారు. నరేంద్ర మోడీ తర్వాత ప్రధానమంత్రి అయ్యే అర్హత తన ఒక్కదానికే ఉందని ఆమె అనుకుంటున్నా ఆశ్చర్యంలేదు.  ప్రసంగాలలో, ప్రతిపక్షాల మీద విమర్శలు చేయడంలో ఆమె ‘లేడీ మోడీ’ కావడానికి ప్రయత్నిస్తున్నట్టూ కనిపిస్తుంది. అనుకోకుండా కేంద్రంలో కీలక మంత్రిత్వశాఖకు మంత్రి కాగలిగినప్పుడు రేపు ప్రధానమంత్రి ఎందుకు కాలేనని ఆమె అనుకుంటూ ఉండవచ్చు.

ఇంతకీ సంగతేమిటంటే, ఢిల్లీలో ఎయిర్ పాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో మాట్లాడుతూ, ”ఎంతమందికి తెలుసో?” అంటూ తన గతచరిత్రను విప్పుకుంటూ వచ్చారు. తనంతటి వ్యక్తికి చెందిన గతచరిత్ర తెలియకపోవడం ఎంత అజ్ఞానమో అని ఎత్తిపొడవడం అన్నమాట.  తను  ఓం ప్రథమంగా జెట్ ఎయిర్ వేస్ లో క్యాబిన్ క్రూ లో చేరాలని ముచ్చట పడ్డారట. అయితే,  నీ కంత పర్సనాలిటీ లేదంటూ జెట్ ఎయిర్ వేస్ యాజమాన్యం తిరస్కరించిందట.  అలా తిరస్కరించడం వల్ల తనకు మంచే జరిగిందనీ, వెళ్ళి మెక్ డొనాల్డ్ లో చేరానని చెప్పారు. చివరిగా, “ ఆ తర్వాత అంతా చరిత్ర” అంటూ ముక్తాయించారు.

ఎవరైనా ఒక ఎత్తుకు ఎదిగేముందు ఎన్నో అనుభవాలను ఎదుర్కొంటారు. వాటిలో తీపీ చేదూ; తిరస్కారాలూ పురస్కారాలూ  కలగలిసే ఉంటాయి. జీవితమే అంత. పరిణతి కలిగినవారు ఎవరైనా  దానిని జీవితగమనంలో భాగంగానే తీసుకుంటారు తప్ప; “భవిష్యత్తులో కేంద్రమంత్రి అయ్యేంత అర్హత ఉన్న తనని చిన్న ఉద్యోగానికి కూడా పనికిరావన్నారు చూసారా?” అంటూ గతాన్ని తవ్వుకుంటూ అవతలి వాళ్ళను ఆడిపోసుకోరు. తన గురించి తనే అతిశయంగా చెప్పుకోరు. విందుభోజనం చేస్తూ, కడుపు మాడిన రోజుల్ని తలచుకుని కారాలూ మిరియాలూ నూరరు.

కేంద్ర ‘విద్యా’శాఖ మాజీ మంత్రిగారిలో ఆ కనీసం ఆ  ‘వివేకం’ కూడా లేదు. అదే వింత!.

సూర్య

Have something to add? Share it in the comments

Your email address will not be published.