స్వచ్ఛ హైదరాబాద్ విజయవంతం

swachh hyderabad-22

హైదరాబాద్: న‌గ‌రాన్ని ప‌రిశుభ్రంగా మార్చాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం త‌ల‌పెట్టిన స్వ‌చ్ఛ హైదరాబాద్ (క్లీన్ హైదరాబాద్) కార్య‌క్ర‌మం న‌గ‌రంలో విజ‌యవంతంగా సాగింది. ఐదు రోజుల పాటు సాగిన స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం ఆశించిన ప్ర‌యోజ‌నం నెర‌వేరింద‌ని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు రోజుల్లో సుమారు 32 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను సేక‌రించారు. వ్య‌ర్థాల నుండి విద్యుత్ తో పాటు ఎరువుల త‌యారీకి సంబందించిన ప్ర‌ణాళిక‌ల‌ను ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది. న‌గ‌రంలోని పేద‌ల‌కు ఇళ్ళ నిర్మాణానికి స‌ర్వే చేప‌ట్టాల‌ని ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకొంది. యూనివ‌ర్శిటీ స్థ‌లాల్లో పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణాన్ని చేప‌డతామ‌ని ముఖ్యమంత్రి ప్ర‌క‌టించారు.

స్వ‌చ్ఛ హైద్రాబాద్ కార్య‌క్ర‌మాన్ని రాష్ట్ర  ముఖ్య‌మంత్రి కేసీఆర్, గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహాన్ ఈనెల 16న హైటెక్స్ లో ప్రారంభించారు. న‌గ‌రంలో ప్ర‌తి రోజు సుమారు 3600  మెట్రిక్ ట‌న్నుల చెత్త పోగ‌వుతుంది. జీహెచ్ఎంసీకి చెందిన దాదాపు 18000 మంది  సిబ్బంది ప్ర‌తిరోజు చెత్త‌ను తొల‌గిస్తారు. అయితే దీనికి అద‌నంగా ప్ర‌తిరోజు మ‌రో దాదాపు 8 వేల ట‌న్నుల చెత్త, నిర్మాణ వ్య‌ర్థాలు త‌ర‌లించ‌డం ద్వారా హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌రిశుభ్ర న‌గ‌రంగా తీర్చిదిద్ద‌డానికి రాష్ర్ట ప్ర‌భుత్వం స్వ‌చ్ఛ హైద‌రాబాద్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. దీనిలో భాగంగా గ‌త నాలుగు రోజులుగా 32 వేల మెట్రిక్ ట‌న్నుల చెత్త‌ను తొల‌గించారు. జీహెచ్ఎంసీ, మెట్రోవాట‌ర్ వ‌ర్క్స్, విద్యుత్‌, పోలీస్‌, రెవెన్యూ శాఖ‌ల‌కు చెందిన దాదాపు 36 వేల మంది అధికారులు, సిబ్బంది స్వ‌చ్ఛ హైదరాబాద్ లో స్వచ్చంధంగా భాగ‌స్వామ్యుల‌య్యారు.  ఈ కార్యక్రమంలో ప్ర‌తి రోజు సుమారు ల‌క్ష‌న్న‌ర నుండి రెండు ల‌క్ష‌ల మంది పాల్గొన్నార‌ని అంచ‌నా.   ప్ర‌తి స్వ‌చ్ఛ యూనిట్‌కు కేటాయించిన తక్షణ మరమ్మత్తు (ఇన్‌స్టాంట్ రిపేర్ టీం)  బృందం అందించిన సేవ‌లపై న‌గ‌ర వాసులు ప్ర‌శంస‌లు కురిపించారు. దీర్ఘ‌కాలంగా ఉన్న రోడ్ల‌పై గుంత‌లు, మ్యాన్‌హోళ్ళు, ఫుట్‌పాత్‌ల మ‌ర‌మ్మ‌తులు, వ‌ర్ష‌పు నీటి కాలువ‌ల మ‌ర‌మ్మ‌తులను చేశారు. ఈ ఐదు రోజుల్లో సుమారు 15 వేలకు పైగా మ‌ర‌మ్మ‌తులు  చేప‌ట్టారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పాల్గొన్న ఈ స్వ‌చ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో ప్ర‌జ‌ల నుండి సుమారు 600 కోట్ల‌కు విలువైన విన‌త‌లు అందాయి. వీటిలో ప్ర‌ధానంగా బీ.టీ, సీసీ రోడ్ల నిర్మాణం, క‌మ్యూనిటీ హాళ్ళ నిర్మాణం, జిమ్‌లు, లైబ్ర‌రీల ఏర్పాటు, డ్రైనేజి తదితర స‌మ‌స్య‌లు ఉన్నాయి. స్వ‌చ్ఛ హైదరాబాద్ కార్య‌క్ర‌మంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు, సినీ న‌టులు, వీఐపీలు అధికారులు, పోలీసులు మరెందరో భాగ‌స్వాముల‌య్యారు.

న‌గ‌రాన్ని విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు అన్ని ర‌కాల చ‌ర్య‌ల‌ను తీసుకొంటామ‌ని ముఖ్యమంత్రి తెలిపారు. న‌గ‌రంలో ప్ర‌తి రోజు వ‌చ్చే చెత్త నుండి విద్యుత్ ను, ఎరువుల త‌యారీకి సంబందించి వెంట‌నే ప్ర‌ణాళిక‌ల‌ను సిద్దం చేయాల‌ని ముఖ్యమంత్రి అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌తి ఇంటికి రెండు చెత్త డ‌బ్బాలు అందించాలని, వాటిలో త‌డి, పొడి చెత్త‌ను సేక‌రించాల‌ని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

న‌గ‌రంలో సుమారు రెండు ల‌క్ష‌ల మంది నిరుపేద‌లున్నార‌ని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఉస్మానియా యూనివ‌ర్శిటీ లో కొంత భూమిలో పేద‌ల‌కు ఇళ్ళ‌ను నిర్మిస్తామ‌ని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. యూనివ‌ర్శిటీ భూమిలో ఇళ్ళ నిర్మాణంపై ఓయూ విద్యార్థులు మండిప‌డుతున్నారు. ముఖ్యమంత్రి తీరుపై విద్యార్ధులు మండిప‌డుతున్నారు.

రానున్న జీహెచ్ ఎం సీ ఎన్నిక‌ల‌కు సిద్దం కావ‌డానికి వీలుగా స్వ‌చ్చ హైద్రాబాద్ ను వేదిక‌గా చేసుకున్నట్లు తెలసుస్తోంది. స్వ‌చ్ఛ హైద్రాబాద్ లో భాగంగా ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా నెరవేర్చగలిగితే, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో రాజ‌కీయంగా ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది. పైకి మాత్రం స్వ‌చ్ఛ హైదరాబాద్ కు, జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల‌కు సంబందం లేద‌ని చెబుతున్నా, దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాల కోసం ప్రభుత్వం వ్యూహాత్మ‌కంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ మేర‌కు స్వ‌చ్ఛ హైదరాబాద్ కార్య‌క్ర‌మంలో ప్ర‌జ‌లకు ఇచ్చిన హామీలను తీర్చేందుకు ప్ర‌య‌త్నిస్తామ‌నే విశ్వాసం క‌ల్గిస్తే, దాని ఫ‌లితాలు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయ‌ప‌డుతోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.