స్వైన్ ఫ్లూ… వణికిస్తోంది

తెలంగాణలో స్వైన్ ఫ్లూ వణికిస్తోంది. హైదరాబాద్ లో స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కొన్నాళ్లుగా జాడలేని వైరస్ మళ్లీ చురుగ్గా విస్తరించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో స్వైన్ ఫ్లూ మరింతగా విజృంభిస్తోంది.

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 63 స్వైన్ ఫ్లూ కేసులు నమోదవ్వగా, వీటిలో 8 మంది మృత్యువాత పడ్డారు. వీరిలో కేవలం స్వైన్ ఫ్లూ మరణించిన వారు ఒక్కరూ లేరని, దీర్ఘకాలిక వ్యాధులతో పాటు స్వైన్ ఫ్లూ సోకడం వల్ల మృతిచెందారని వైద్యులు అంటున్నారు. గత సంవత్సరాల్లో నమోదైన వాటితో పోలిస్తే ప్రస్తుతం నమోదయిన కేసుల గురించి పెద్దగా ఆందోళన చేందాల్సిన అవసరం లేదని డాక్టర్లు అంటున్నారు.

స్వైన్ ఫ్లూ వైరస్ ఉన్న వ్యక్తులు బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే ఆ జబ్బు ఇతరులకు సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ వైరస్ ఒక రోగి నుంచి 10 మందికి వ్యాప్తి చెందే అవకాశం ఉందని డాక్టర్లు అంటున్నారు. చలి వాతావరణంలో ఈ వైరస్ త్వరగా విస్తరించే ప్రమాదం ఉంది. స్వైన్ ఫ్లూ ఉన్నట్లు ఏ మాత్రం అనుమానం ఉన్నా ప్రజలు తక్షణమే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

తెలంగాణలో గత కొంత కాలంగా నమోదవుతున్న స్వైన్ ఫ్లూ కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనిపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కనీసం అవగాహ కూడా వారిలో లేదు. ఇంత జరుగుతున్నా వైద్య ఆరోగ్య శాఖ కనీస అవగాహన కార్యక్రమాలు చేపట్టడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. స్వైన్ ఫ్లూ ప్రభావం అంతగా లేదని తగ్గించే ప్రయత్నం అధికారులు ఎంత చేస్తున్నా పెరుగుతున్న కేసులు మాత్రం అధికారుల అంచాలను దాటిపోతున్నాయి. ఈ డిసెంబర్ లోనే 21 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అవడం, 4 మరణాలు సంభవించడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఇంత తీవ్రస్థాయిలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తున్నా, అధికారులు మాత్రం అంతగా ప్రభావం లేదు ఎలాంటి భయాందోళనలు అక్కరలేదంటున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.