హద్దు మీరలేదు

హైదరాబాద్: శ్రీశైలంలో నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నప్పుడే విద్యుత్ ఉత్పత్తి చేశామని, 857 అడుగుల వరకు రిజర్వాయర్‌లో నీరు ఉన్నప్పటికీ అడుగంటుతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పండిట్ కు తెలిపారు.  కృష్ణా నదీయాజమాన్య బోర్డు చైర్మన్ పండిట్ సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో సమావేశమయ్యారు. కేసీఆర్ బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లిన అంశాలను ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఇందులోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

krishna water board copy 1

సోమవారం సచివాలయంలో కృష్ణా జలాల నిర్వహణ బోర్డు చైర్మన్ ఎస్ కె జీ పండిట్ తో సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు

బాబు అధికారంలో ఉన్న సమయంలో అప్పటి అవసరాల మేరకు 750 అడుగుల వరకు నీటిని వాడుకున్న విషయాన్ని పండిట్ దృష్టికి తెచ్చారు. 69, 107, 233 జీవోల ప్రకారం 834 అడుగుల వరకు నీటిని వాడుకునే అవకాశం ఉందన్నారు. ఇన్ని జీవోలు ఉన్నప్పటికీ గతంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్న తొమ్మిదేండ్లలో ఏనాడు నిబంధనలు పట్టించుకోలేదని, 834 అడుగుల నీటిమట్టాన్ని ఒక్క ఏడాది కూడా నిర్వహించలేదని కేసీఆర్ వివరించారు. తాము ఇప్పుడు నిబంధనల మేరకే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నా గగ్గోలు పెడుతున్నారని కేసీఆర్ వివరించారు. కృష్ణానది జలాల దోపిడీ విషయంలో కూడా బోర్డు కచ్చితంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరారు.

సమైక్య రాష్ట్రంలో 58 సంవత్సరాలపాటు నదీ జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయానికి గురైందని తెలిపారు. ఆంధ్ర పాలకులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా తెలంగాణ ప్రజలు త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారని, అందుకే చంద్రబాబునాయుడు కక్ష పెంచుకొని, తెలంగాణలో ఏర్పడిన తొలి ప్రభుత్వాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని చెప్పారు. శ్రీశైలంలో నీటిని వాడుకొనే, విద్యుత్ ఉత్పత్తి చేసుకొనే హక్కు తెలంగాణకు ఉందని, ఈ హక్కును కాపాడాలని ముఖ్యమంత్రి పండిట్‌ను కోరారు. తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాగిందని తెలిపారు. శ్రీశైలం నీటి వాడకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న వాదనలన్నీ తప్పని, ఇదే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు 2002 సంవత్సరంలో హైకోర్టులో సమర్పించిన రిట్ పిటిషన్‌లో నీటి వాడకం విషయంలో ప్రభుత్వానికి పూర్తి హక్కు ఉందని చెప్పిన విషయాన్ని కేసీఆర్ పండిట్ దృష్టికి తీసుకువచ్చారు.

తెలంగాణకు నీళ్లు, కరెంట్ విషయంలో నిబంధనలన్నీ ఉల్లంఘిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణచట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాల్సి ఉన్నా దానిని చంద్రబాబు అడ్డుకున్నారని తెలిపారు. సీలేరు నుంచి కరెంట్ ఇవ్వడం లేదని, ఈ విషయంలో సదరన్ లోడ్ డిస్పాచ్ సెంటర్‌కు ఫిర్యాదు చేశామని చెప్పారు. గోదావరి రివర్ బోర్డు, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చెప్పినా చంద్రబాబు సీలేరు కరెంట్ ఇవ్వలేదన్నారు. కృష్ణపట్నంలో తెలంగాణ జెన్‌కో, డిస్కంలు రూ. 1050 కోట్ల పెట్టుబడి పెట్టాయని, 54 శాతం విద్యుత్ తెలంగాణకు రావాలి. అది ఇవ్వకపోగా హిందూజా నుంచి కూడా విద్యుత్ రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు. దీని వల్ల తెలంగాణకు కరెంట్ రాకుండా చేయడం వల్లే విద్యుత్ కొరత ఏర్పడిందని, ఈ క్రమంలో రైతులను ఆదుకొనేందుకే శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేయడం అనివార్యమయిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పండిట్‌కు వివరించారు.  నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ డిజైన్ మార్చి తెలంగాణకు అన్యాయం చేశారని చెప్పారు. మొదట తెలంగాణకు 160 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ కు 80 టీఎంసీలు కేటాయించగా 25 టీఎంసీలు కూడా తెలంగాణకు దక్కే అవకాశం లేకుండా చేశారని కేసీఆర్ తెలిపారు.

శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని వాడుకుంటున్నది. తెలుగుగంగ ద్వారా 15 టీఎంసీలు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా 19 టీఎంసీలు మాత్రమే వాడుకునే హక్కు ఉన్నప్పటికీ 338 టీఎంసీల నీటిని వాడుకోవడానికి అనువైన రిజర్వాయర్లను నిర్మించారు. తెలంగాణలో జూరాల, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయల్‌సాగర్, ఎస్‌ఎల్‌బీసీ, ఆర్డీఎస్‌లాంటి ప్రాజెక్టులు పూర్తి కాలేదు. కానీ, ఆంధ్రలో మాత్రం ఎలాంటి అనుమతులు, నీటి కేటాయింపులు లేకపోయిన్పటికీ ప్రాజెక్టులు పూర్తయ్యాయి. ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం వల్ల కృష్ణా నీటిలో తెలంగాణకు ఉన్న వాటాను వినియోగించుకోలేకపోతున్నామని సీఎం వివరించారు. కృష్ణానది జలాల్లో కేటాయింపుల్లోనే అన్యాయం జరిగిందని, తెలంగాణకు ఇప్పుడైనా న్యాయం చేయాలని ఎస్కే పండిట్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. 29 న కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరుగుతున్నందున తెలంగాణకు జరిగిన అన్యాయంపై సవివరంగా చర్చించాలని కోరారు. రాష్ట్రం తరఫున బోర్డు సమావేశానికి సాగునీటిరంగ నిపుణులు ఆర్ విద్యాసాగర్‌రావు హాజరవుతారని సీఎం తెలిపారు. సాగర్ పూర్తి స్థాయిలో నీటిపారుదల ప్రాజెక్టు అయితే, శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు అని.. దీనికనుగుణంగా నీటి వాడకం విషయంలో కచ్చితమైన ఆపరేషన్ రూల్స్ రూపొందించాలని ముఖ్యమంత్రి కోరారు.

కేసీఆర్ వాదనను సావధానంగా విన్న పండిట్, బోర్డు సమావేశంలో ఈ అంశాలన్నింటినీ తప్పకుండా చర్చించి, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని స్పష్టంచేశారు. ఈ సమావేశంలో భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, బీవీ పాపారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, నీటిపారుదలశాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.