హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 181

హైదరాబాద్, నవంబర్ 7: రాష్ట్రంలో మహిళల భద్రతకు సంబంధించిన సమస్యల సత్వర పరిష్కారం కోసం 24 గంటలపాటు పనిచేసే హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. 181 టోల్ ఫ్రీ నంబర్‌తో హెల్ప్‌ లైన్‌తోపాటు, ప్రస్తుతం హైదరాబాద్‌లో అమలవుతున్న షీ టీమ్స్‌ ను అన్ని జిల్లాలోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోలీసుశాఖలోని అన్ని స్థాయిల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని, ప్రతి పోలీస్ స్టేషన్‌లో పరిధిలో మహిళా విభాగం పనిచేయాలని సీఎం సూచించారు.

ఈవ్ టీజింగ్ నియంత్రణకు ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. మహిళల సమస్యలు-పరిష్కార మార్గాలు అనే అంశంపై అధ్యయనం చేసిన పూనం మాలకొండయ్య నేతృత్వంలోని కమిటీ చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. మహిళా భద్రతా కమిటీ తమ సిఫార్సులను సీఎం కేసీఆర్‌కు అందజేసింది. ఈవ్‌టీజింగ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది. జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆకతాయిల వేధింపులను అరికట్టేందుకు అమలుచేస్తున్న కార్యక్రమాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
జనం రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ బస్సుల్లో ముందు వైపు మహిళలు, వెనుకవైపు పురుషులు ఎక్కి దిగేలా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, ఎంపీ జితేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే గొంగిడి సునీత, ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, స్వాతి లక్డా, సౌమ్య మిశ్రా, స్మితా సబర్వాల్, చారుసిన్హా తదితరులు పాల్గొన్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.