16వ సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ విడుదల

general-elections

ఎన్నికల నగారా మోగింది. 16వ లోక్ సభ ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎస్. సంపత్ విడుదల చేశారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో ఎన్నికల కమీషనర్ మాట్లాడుతూ.. పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ముమ్మర కసరత్తు చేశామని తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల పరీక్షలు, వాతావరణ పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఎన్నికల షెడ్యూలు రూపొందించినట్టు ఆయన చెప్పారు.

ఎన్నికల షెడ్యూలుపై అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీలను సంప్రదించామని ఆయన వెల్లడించారు. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈసారి 10 కోట్ల మంది కొత్త ఓటర్లు చేరారని తెలిపారు. దీంతో దేశంలో మొత్తం 81.4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేందుకు మార్చి 9న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటరు నమోదు ప్రక్రియ ఏర్పాటు చేశామని, ఇంకా ఎవరైనా ఉంటే ఓటర్లుగా నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా 9 లక్షల 30 వేల పోలింగ్ కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

మే 12న జరిగే చివరి ఎన్నికలతో ఈ ప్రక్రియ ముగుస్తుందని ఆయన వివరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు, ఎన్నికల ఖర్చుల పర్యవేక్షణకు అధికారులను నియమించామని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిషా, సిక్కిం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరుగుతాయని ఆయన అన్నారు. దీంతో నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. మే 31 నాటికి కొత్త ప్రభుత్వం కొలువు తీరేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ వివరించారు.

ఆంధ్రప్రదేశ్ లో రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది. ఏప్రిల్ 30న తొలి విడత ఎన్నికలు జరగనుండగా, రెండో విడత మే 7న జరగనున్నాయి.

తెలంగాణలో ఎన్నికల తేదీల వివరాలు…
16వ సార్వత్రిక ఎన్నికలకు ఏప్రిల్ 30న తెలంగాణలో పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ ఏప్రిల్ 9 వ తేదీ కాగా, నామినేషన్లను ఏప్రిల్ 10న పరిశీలించనున్నారు. ఏప్రిల్ 12న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. తెలంగాణలో ని లోక్ సభ స్థానాలకు ఏప్రిల్ 30 న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మే 16న జరుగనుంది.

సీమాంధ్రలో ఎన్నికల తేదీల వివరాలు…
16వ సార్వత్రిక ఎన్నికలకు సీమాంధ్రలో ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కాగా, ఏప్రిల్ 21న నామినేషన్లు పరిశీలిస్తారు. ఏప్రిల్ 23న నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు గడువుగా నిర్ణయించారు. మే 7న సీమాంధ్ర వ్యాప్తంగా ఎన్నికలు జరపనున్నారు. మే 16న ఓట్ల లెక్కంపు పూర్తి చేసి ఫలితాలను వెల్లడించనున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.