ధర్నాచౌక్ ఉద్యమం: కోదండరాం, వామపక్ష నాయకుల అరెస్ట్

హైదరాబాద్: ఇందిరాపార్కు వద్ద ఉన్న ధర్నాచౌక్‌ ను నగరం వెలుపలకి తరలించాలనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, తెలంగాణ జేఏసీ, వామపక్షాలు తలపెట్టిన 2కే రన్ ఉద్రిక్తంగా మారింది. 2కే రన్‌లో పాల్గొన్న టీజాక్ చైర్మన్‌ కోదండరాంను పలువురు వామపక్ష నేతలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ధర్నాచౌక్‌ తరలింపునకు నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి 2కే రన్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాంతో పాటు సీపీఐ, సీపీఎంల నాయకులతోపాటు పలువురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అనంతరం టీజాక్ చైర్మన్ కోదండరాం మాట్లాడుతూ ఇందిరాపార్కు వద్ద ధర్నాచౌక్ ను ప్రభుత్వం మూసేసిన సంగతి అందరికి తెలిసిందే. దానికి తాళం పెట్టిన తర్వాత హైదరాబాద్ లో మామూలు ప్రజలు నిరసన తెలపడానికి ఒక వేదిక అంటూ లేకుండా పోయిందన్నారు. ధర్నాచౌకును పునరుద్ధరించాలని యధాతధంగా కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని సంఘాలు విడివిడిగా నిరసన తెలియజేయటమే కాకుండా ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఉమ్మడిగా ధర్నాచౌక్ పరిరక్షణ కమిటిగా ఏర్పడ్డాయన్నారు. ఈ కమిటిలో వామపక్షాలతోపాటు అనేక ప్రజా సంఘాలు వారు భాగస్వాములయ్యారన్నారు. దీంట్లో భాగంగా ఆదివారం మొట్ట మొదటగా ఈ ఉదయం 2కె రన్ కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ 2కె రన్ కార్యక్రమంలోనే అందరం కలిసి పాల్గొన్ని ఉదయమే 6-30 గంటలకు బయలుదేరి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుండి ఇందిరాపార్కు వరకు ఊరేగింపు మొదలు కాకముందే పోలీసులు అందరిని అరెస్టు చేశారన్నారు. సుమారు 500 మందిని అరెస్టు చేశారని కోదండరాం తెలిపారు.

ప్రస్తుతం ఇందిరాపార్క్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. పెద్ద ఎత్తున పోలీసుల మొహరింపుతో ఆ ప్రాంతం కర్ఫ్యూను తలపిస్తోంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.