స్వార్ధపరుల మాటలు విని మోసపోవద్దు: అగ్రి గోల్డ్ బాధితులతో పవన్

 

కాటమరాయుడికి కోపం వచ్చింది.  ప్రజలు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ బాధలను పంచుకొని, కన్నీళ్ళను తుడవడానికి ప్రయత్నం చేశాడు కాటమరాయుడు. అయితే ఇది కాటమరాయుడు సినిమాలో సీన్ కాదు. మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న సమస్యల పరిష్కారానికి నడుం బిగించిన పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ జనసేనానిగా అవతారమెత్తాడు. గత కొన్నేళ్ళుగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నఅగ్రిగోల్డ్ బాధితులను విజయవాడలో కలిసి వాళ్ళను పరామర్శించాడు జనసేనాని. సుమారు 650 మంది బాధితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వారి సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి ఈ ముఖా ముఖిని ఏర్పాటు చేశారు.

అగ్రిగోల్డ్ ఉదంతం వెలుగుచూసినప్పటినుండి ఇప్పటివరకు వందకు పైగా అగ్రి గోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో వారి సమస్యలు ఏంటో తెలసుకునేందుకు ప్రత్యక్షంగా రంగంలోకి దిగారు పవన్. తుమ్మల పల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ ” అగ్రిగోల్డ్ పై కోర్టు ఉత్తర్వులు జారీచేసిన నేపధ్యంలో బాధితులకు న్యాయం జరుగుతందనే నమ్మకం ఉండేది. కానీ కోర్టే దీనిపై అసహనంగా ఉంది అన్న వార్తలు వచ్చిన నేపధ్యంలో ఎక్కడో న్యాయం జరగటం లేదని అనిపించింది. అనుకున్న రీతిలో, ఎలా జరగాలో అలా న్యాయం జరగటడం లేదనే విషయం నా దృష్టికి వచ్చింది. ప్రజా సమస్యలకోసం పార్టీలకు అతీతంగా కలిసి పనిచేయాల్సిన ఉద్దేశం జనసేన పార్టీకీ ఉంది. దాంట్లో భాగంగానే నేను ఇక్కడకు రావడం జరిగింది. అలాగే వామపక్ష పార్టీలపట్ల నాకున్న గౌరవం కూడా నన్ను ముందుకు నడిపించింది.”

” చట్టం బలహీనులకి బలంగాను, బలవంతులకు బలహీనంగా పనిచేస్తుందని అగ్రి గోల్డ్ కేసు సాక్ష్యంగా చూడవచ్చు. ఎందుకు చెబుతానంటే ఈ బాద మొదటి కొద్ది రోజుల్లోనే కొన్ని అగ్రి గోల్డ్ కు చెందిన కొన్ని వందల చెక్కులు బౌన్స్ అయినప్పుడు అప్పుడే ఆపి ఉంటే ఈ పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు. గోటితోపోయేదాన్ని గొడ్డలితో పెట్టు అన్న సామెతగా తయారైంది. తప్పు జరుగుతున్నప్పుడు ఎదిరించగలిగే సత్తా, దమ్ము, ధైర్యం ప్రజలకు ఉండాలని మనస్సూర్తిగా కోరుకుంటాను. కానీ సమస్య ఎక్కడొస్తుండంటే మన రాజకీయనాయకులు గానీ ఎంఎల్ఏ, ఎంపీలు గానీ చాలా బాధ్యతతో వ్యవహరించాలి.

“1995లో అగ్రి గోల్డ్ సంస్థ మొదలైంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్లు, కూలీ నాలీ చేసుకునేవాళ్లు దీంట్లో పెట్టుబడులు పెట్టారు. వారి పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారని, ఎంతో కొంత సొమ్ము తిరిగి వస్తుందని భవిష్యత్తుమీద ఒక భరోసా కోసం ఇలాంటి పెట్టుబడులు పెడుతున్నారు. ప్రభుత్వం వారు ఒక వైపు యాజమాన్యం వారికి అవార్డులు ప్రకటిస్తుంది. ఇది చెప్పుకొని ఏజెంట్లు ఊర్లర్లోకి వెళ్లి ఇటువంటి కంపెనీల్లో డబ్బు పెడితే ఎక్కువ డబ్బు వస్తుందని ఆశలు కల్పించి ప్రజల వద్ద డబ్బులు తీసుకుంటారు. రాజకీయ నాయకులు అండవుందని ప్రజలకు నమ్మకం కల్పిస్తారు.”

“అండగుంటారనుకున్న నాయకులే ఇటువంటి సమయంలో కనీసం మాట కూడా మాట్లాడరు. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే లక్షా నలభైవేల మంది ఏజెంట్లు బాధించబడుతున్నారు. యాజమాన్యం మోసం చేస్తే ఏజేంట్ల మీద దాడి జరుపుతున్నారు. ఇలాంటివి జరుగుతున్నప్పుడు వాటిని ప్రభుత్వం కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏజెంట్ల తప్పు లేనప్పటికీ, కంపెనీ యాజమాన్యం ఇచ్చిన నమ్మకంతో వారు డబ్బు వసూలు చేశారు. పెట్టుబడి తీసుకున్న డబ్బుతో దాదాపు 20 వేల ఎకరాలు కొన్నారు. ఆస్తులున్నాయి, అప్పులుకూడా ఉన్నాయి. కానీ అప్పులకంటే ఆస్తుల విలువ మార్కెట్ ధర ప్రకారం చాలా ఎక్కువ. కానీ ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్దితో అమలు చేయలేపోతున్నారో అర్ధం కావడం లేదు. అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అవి కార్యరూపం దాల్చడం లేదు.

“చెప్పులు చప్పుడు వినబడుతుంటే ఎవరు వచ్చి కొడతారేమో అని మా గుండెల్లో గుబులు వస్తోందని కొందరు ఎజేంట్లు వాపోతున్నారు. ముందుగా ఏ ఏజంట్లకు ప్రాణ హానీ జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కొంతమంది పెద్ద వ్యక్తులు వ్యక్తిగత లబ్దిపొందాలని చూస్తున్నారు. చవకగా కంపెనీ ఆస్తులు కొట్టేద్దామని కొందరు రాజకీయ నాయకులు ఆలోచిస్తున్నారు. ఇటువంటి ఆలోచన చాలా దౌర్భాగ్యమైనది. కంపెనీకి దాదాపు 20 వేల ఎకరాలు ఆస్తులున్నాయి. 9 రాష్ట్రాల్లో వీరి వ్యాపారం విస్తరించి ఉంది. ఇంత సమస్య ఉన్నప్పుడు దీనిపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. అగ్రి గోల్డ్ బాధితులు సంక్షోభంలో ఉన్నారు. ఇది ఒక రాష్ట్రం సమస్యకాదు.”

” ఏ ప్రభుత్వమైనా కావచ్చు గత ప్రభుత్వాలతో భాగస్వాములు కానప్పటికీ ప్రస్తుత సమస్యను ఈ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ముందుగా ఆత్మహత్యలు చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టి వారికి భరోసా కల్పించాలి. 20 వేలు డిపాజిట్లు వేసిన వ్యక్తులు దాదాపు 13 లక్షల మంది ఉన్నారు. వారికి ఎంతో కొంత డబ్బు ప్రభుత్వం ఇవ్వాలి. ఇవి ప్రభుత్వ ఖాజానుంచి ఇవ్వాల్సిన పని లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అగ్రి గోల్డ్ కు 14 వేల ఎకరాలున్నాయి. అదే విధంగా గుంటూరులో ఉన్న680 ఎకరాలు ఉన్న హాయిలాండ్ థీమ్ పార్కు ఉంది. అది ఒక్కటి అమ్మినా కొన్నివందల కోట్లు వస్తాయి. కంపెనీ ఆస్తులన్నీ ప్రభుత్వానికే చెందాలి గానీ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులకు చెందితే పెద్ద గొడవలకు దారి తీస్తుంది.

“వీళ్ల ఆస్తులని ఏ విధంగానైనా తెలిగ్గా తీసుకోవచ్చు, యాజమాన్యం చేసిన తప్పుల ద్వారా మనం లబ్దిపొందవచ్చు అని ఏ ఒక్క రాజకీయనాయుకుడు అనుకున్నా అది పెద్ద తప్పు చేసిన వాళ్లు అవుతారు. ఇలా చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. అలాంటి ఉద్దేశ్యంతో ఏ రాజకీయ పెద్దలు లబ్దిపొందాలని చూస్తే నేను వామపక్షాలతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.”

“అగ్రిగోల్డ్‌కు వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉంచుకొని ఇంతమంది చనిపోవడం చాలా దారుణమైన విషయం. ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాను. అగ్రి గోల్డ్ ఆస్తులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని” డిమాండ్ చేశారు పవన్ కళ్యాణ్.

Have something to add? Share it in the comments

Your email address will not be published.