ఓరుగల్లులో ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధం

All set for TRS Pragati Nivedana Sabha in Warangal and painted pink

All set for TRS Pragati Nivedana Sabha in Warangal and painted pink

ఓరుగల్లు గులాబీమయమైంది. ఎటు చూసినా గులాబీ జెండాల రెపరెపలు అలరారుతున్నాయి. తెలంగాణాలోని అన్ని దారులు ఇప్పుడు ఓరుగల్లులోని ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంవైపే పరుగెడుతున్నాయి. టీఆర్‌ఎస్ 16వ వార్షికోత్సవ సభకు వరంగల్ సర్వం సిద్ధమైంది. రాష్ట్ర నలుమూలల నుంచి లక్షలాదిగా ప్రజలు, కార్యకర్తలు, రైతులు  వరంగల్‌కు బయలుదేరారు.

వరంగల్ జిల్లా ప్రకాశ్‌రెడ్డిపేటలో ఉన్న 1250ఎకరాల్లో నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభాప్రాంగణాన్ని 275 ఎకరాల్లో ఏర్పాటు చేస్తుండగా, మరో వెయ్యి ఎకరాలకు పైగా సభకు వస్తున్న ప్రజల వాహనాల పార్కింగ్‌కే కేటాయించారు. మండుతున్న ఎండ వేడిని తట్టుకునేందుకు 20లక్షల వాటర్ ప్యాకెట్లు, 10లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 20 బోర్లు, వాటికి అనుబంధంగా నల్లాలు, 200 వాటర్ ట్యాంకర్లు, ఆరు హెల్త్ క్యాంపులు, ప్రత్యేక ఐసీయూ, తాత్కాలిక మరుగుదొడ్లు నిర్మించారు. సభ నిర్వహణ కోసం మొత్తం 13 కమిటీలు తమకు కేటాయించిన పనులన్నీ పూర్తిచేశాయి.

సభకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సభ జరిగే ప్రాంతం నుంచి చుట్టుపక్కల ప్రాంతాల వరకు పోలీసు శాఖాపరంగా 12 సెక్టార్లగా విభజించి ప్రతి సెక్టారుకు ఒక ఐపీఎస్‌ అధికారిని ఇన్‌ఛార్జిగా నియమించారు. వీరితోపాటు అదనపు పోలీసులను మోహరించారు. కమిషనరేట్‌ పరిధిలో సిబ్బందితోపాటు ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బందిని విభాగాలుగా విభజించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

మరోవైపు తెరాస బహిరంగ సభలో నిరసన తెలపాలని ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. సభలో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశముందనే సమాచారంతో పోలీసులు ముందస్తుగా నిరసన తెలిపే వారి నుంచి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎవరైనా నిరసన తెలిపేందుకు వస్తే వారిని వెంటనే అదుపులోకి తీసుకొని పోలీసుస్టేషన్‌కు తరలించే అవకాశముంది. ఇందుకోసం పోలీస్‌ ప్రత్యేక విభాగం సిబ్బంది పని చేస్తుంది. ముందస్తు సమాచారం తీసుకుంటున్నారు. సభలో కూడా ప్రత్యేక విభాగం ఇంటలిజెన్స్‌ విభాగం దృష్టి పెట్టింది.

సర్వాంగ సుందరంగా ఓరుగల్లు

తెలంగాాణా రాష్ట్ర సమితి 16వ ఆవిర్భావ దినోత్సవానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రానున్న నేపథ్యంలో వరంగల్‌ మహా నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. నగర శివారులోని రాంపూర్‌ నుంచి వరంగల్‌ త్రినగరాల వరకు కూడళ్లు, ప్రధాన రహదారులు కళ కళలాడుతున్నాయి. సెంట్రల్‌ డివైడర్లను ఇనుప గ్రిల్స్‌తో సుందరీకరించారు. సెంట్రల్‌ మీడియమ్స్‌లో పచ్చని గడ్డి, రంగురంగుల పూల మొక్కలు నాటారు. ప్రభుత్వ, ప్రైవేటు భవనాల గోడలపై ఆధునిక చిత్రాలు మెరిసిపోతున్నాయి. కాజీపేట, హన్మకొండ, వరంగల్‌ మూడు నగరాల్లో ఎటుచూసినా అభివృద్ధి పనుల హడావుడి కనిపిస్తోంది. సీఎం పర్యటన, హంటర్‌రోడ్‌ ప్రకాశ్‌రెడ్డిపేటలో తెరాస బహిరంగ సభ కోసం నెల రోజులుగా చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తయ్యాయి.

సుదూర ప్రాంతాల నుంచి సభకు తరలివస్తున్న అశేష జనవాహినికి ఘన స్వాగతం తెలపడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పారామోటరింగ్‌ ద్వారా అతిథులపై ఆకాశం నుంచి పూల వర్షం కురిపించనున్నారు. పారామోటరింగ్‌ ఒక సాహస క్రీడ. పారాచ్యుట్‌ తరహాలో ఇద్దరు సాహసికులు పైకి ఎగురుతారు. అక్కడి నుంచి సభకు వచ్చే వారిపై పూలు కురిపిస్తారు.

రాత్రికి వరంగల్‌లోనే బస

తెలంగాణ‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరంగల్‌ జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. గురువారం మధ్యాహ్నం 3.30కి ఆయన హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 4.25కి వరంగల్‌ చేరతారు. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో దిగిన తర్వాత ఎంపీ కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి వెళతారు. అక్కడి నుంచి సాయంత్రం 6.40కి బహిరంగసభ జరిగే స్థలానికి చేరతారు. సభ ముగిసిన తర్వాత కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు ఇంటికి చేరతారు. రాత్రిపూట అక్కడే బస చేసి శుక్రవారం ఉదయం పాలకుర్తిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.