ఆనం సోదరులను పట్టించుకొనే నాథుడు కరువయ్యాడా???

Anam brothers not at all satisfied with the ongoing actions in TDP

Anam brothers not at all satisfied with the ongoing actions in TDP

“అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటీ బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట”…. ఈ పాట అప్పుడప్పుడు రాజకీయాల్లో కొంతమంది నాయకులు పాడుకోవడానికి చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే పార్టీ మారితే మళ్ళీ పునర్వైభవం దక్కుతుందనుకొని వేసిన అడుగులు ముందుకు ఏమాత్రం కదలకపోగా ఇన్నేళ్ళు సంపాదించుకున్న రాజకీయ పలుకుబడికాస్తా ఎందుకూ పనికిరాకుండా పోతోంది. ఇలా చాలామంది నాయకులే ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఇక్కడ ప్రస్తావించుకొనేది మాత్రం నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అప్రతిహతంగా ముందుకుసాగి ఇప్పడు బొక్క బోర్లా పడ్డ ఆనం బ్రదర్స్ గురించి. అంతా సాఫీగా ఉంటుంద‌ని ఆశ‌పెడితే అనుకోని ఆటంకాలు ఎదుర‌వుతున్నాయి ఆనం వారికి.

రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ఘోరాతిఘోరంగా ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్‌లో ఉంటే రాజకీయ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుందనుకొని అధికార పార్టీ టీడీపీలో చేరితే అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇక్కడ పరిస్థితి అంతా భిన్నంగా కనిపిస్తోంది. అదికారపార్టీ నాయకులే పిలిచి పచ్చ కండువా క‌ప్ప‌డంతో రాజకీయ క‌ష్టాలు తీరిపోతాయ‌ని భావిస్తే కొత్త స‌మ‌స్య‌లు వచ్చిపడ్డాయి. అధికారపార్టీలో చేరిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ఎలాగైతే నెల్లూరు గ‌డ్డపై మీసం మెలేసి రాజుల్లాగా పాలన చేసిన ఆనం సోదరులు అధికారపార్టీలో చేరి మోసపోయామా అన్న నైరాశ్యంలో పడిపోయారు. ఎందుకంటే ఆనం సోదరులు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో చేరారో అప్పటినుంచి కూడా పార్టీ అధినేత చంద్రబాబు బ్రదర్స్‌ను ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలులేవు.

కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలంపాటు చ‌క్రం తిప్పి, వైఎస్సాఆర్ చనిపోయినప్పుడు , ఆ తర్వాత కూడా సీఎం రేసులో కూడా పేరు ప‌రిశీల‌కు వెళ్లే స్థాయిలో ఉన్నతంలా హవా కొనసాగించిన ఆనం బ్రదర్స్‌కు ఇప్పుడు టీడీపీలో అంతర్గత రాజకీయాలతో ఉక్కపోత భరించలేకపోతున్నారు. కాంగ్రెస్ అడ్రస్‌లేకుండా పోవడంతో అప్పటివరకు వేరేదారిలేక అధికారపార్టీనే దిక్కనుకొని సైకిలెక్కేశారు. అలా సైకిలెక్కిన తర్వాత ప్రతిపక్షనేత జగన్‌ను టార్గెట్ చేసుకున్నప్పటికీ చంద్రబాబుని సంతృప్తి పరచలేకపోయారు ఆనం సోదరులు. జగన్‌ను ఎదుర్కోవాలంటే సీమ రెడ్లే నయమనుకున్న చంద్రబాబు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కొంతమందికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ తర్వాత నెల్లూరులో పచ్చగడ్డివేస్తే భగ్గమనే ఆనం సోదరుల ప్రత్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి క్యాబినెట్లో సీటు కల్పించడంతో ఆనం సోదరుల పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. నెల్లూరులో మళ్లీ మీసం మెలేద్దామ‌నుకుంటే ఏంచేయలేని స్థితికి దిగజారిపోయారు.

మొదట్లో తెలుగుదేశంలోకి వచ్చిన తర్వాత ఆనం రామ‌నారాయ‌ణరెడ్డి ఎమ్మెల్సీ సీటు కోసం గట్టిగానే ప్రయత్నించారు. స్థానిక సంస్థ‌ల కోటాలో త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కోరారు. అయితే క‌నీసం అపాయింట్ కూడా నామ్ కే వాస్తే అన్న తీరులో ఇచ్చీ ఇవ్వనట్లుగా ఉండడంతో చాలా ఫీల్ అయ్యారట ఆనం సోదరులు. దానికితోడు సోమిరెడ్డికి మంత్రిపదవి ఇవ్వడంతో ఇప్పుడు నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి కింద ఆనం సోదరులు పనిచేయాల్సిన పరిస్థితి నెలకొంది. దానికితోడు గవర్నర్ కోటాలో ఇచ్చే సీటు కాస్తా జమ్మలమడుగు ఆదినారాయణరెడ్డికి కేటాయించడంతో ఆనం సోదరులకు ఏమాత్రం మింగుడుపడట్లేదట.

నెల్లూరు జిల్లా టీడీపీలో ఈ ఇద్దరు సోదరుల ప్రాధాన్యత చేరిన మొదటినుండి రోజు రోజుకి తగ్గుతూనే ఉంది. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఉన్నన్ని రోజులూ తెలుగు తమ్ముళ్ళను ముప్పుతిప్పలు పెట్టిన వీళ్ళను స్థానిక నేతలు ఎవ్వరూ పట్టించుకోవట్లేదట. అందుకే జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్న ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరేటప్పుడు ఒకరికి మంత్రి పదవి మరొకరికి నామినేటెడ్ పోస్టు ఇచ్చేలా మంత్రి నారాయణ చంద్రబాబుతో మాట ఇప్పించుకొని చేరారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమాత్రం వాళ్ళు అనుకున్నదానికి అనుకూలంగా లేకపోగా, వారిని స్థానికనాయకులు సైతం పట్టించుకోకపోవడం చూస్తే ఆనం బ్రదర్స్ ఎలాంటి పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.