‘చిత్రాంగద’ మూవీ రివ్యూ

సినిమా: చిత్రాంగద

నటీనటులు :అంజలి, స్వాతి దీక్షిత్, సింధు తులాని, దీపక్ (అర్జున్ బజ్వా), సప్తగిరి

సంగీతం :వి. సెల్వగణేష్

నిర్మాతలు :గంగ పట్నం శ్రీధర్

దర్శకత్వం :జి. అశోక్

పిల్ల జమీందారు సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అశోక్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి వంటి సినిమాల్లో తన అభినయంతో అందరినీ కట్టిపడేసిన హీరోయిన్ అంజలి. వీళ్ళిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమా చిత్రాంగద. అంజలి లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమాఅనుకోని కారణాల వల్ల విడుదల ఆలస్యం అయి చివరికి ఈరోజు విడుదలకు నోచుకుంది. హారిజాంటల్ కామెడీగా తెరకెక్కిన చిత్రాంగద ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంది?

కథ :

చిత్ర (అంజలి) చదువు పూర్తిచేసుకొని అదే కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫసర్‌గా పనిచేస్తూ కాలేజ్ హాస్టల్‌లో అందరు పిల్లలతో కలిసి అక్కడే ఉంటుంది. ఆ హాస్టల్‌లో ఓ దయ్యం ఉందని అప్పటికే చాలాసార్లు స్టూడెంట్స్ ఫిర్యాదు చేసినప్పటికీ అలాంటిది ఏమీలేదని చిత్రతో సహా కాలేజీ యాజమాన్యం అందరికీ చెప్పుకుంటూ వస్తుంటోంది. అయితే రాత్రి వేళల్లో హాస్టల్లో కొంతమంది అమ్మాయిలకు ఓ దయ్యం తమ వెంటపడుతున్న ఫీలింగ్‌లో ఉంటారు. అయితే ఒకరోజు హాస్టల్ బయట ఎవరో తిరుగుతునన్నట్లుగా చూసిన చిత్రాంగద వింతగా ప్రవర్తించడం ప్రారంభిస్తుంది.  అమ్మాయిలను దగ్గరికి తీసుకొని లైంగికంగా లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటుంది చిత్రాంగద. అయితే ఆమె ఆ విచిత్ర ప్రవర్తన బయటపడిన తర్వాత చిత్ర అలా ఎందుకు ప్రవర్తిస్తుందో కననుక్కోవడానికి ప్రయత్నిస్తాడు కాలేజీ ఛైర్మెన్ ( రాజా రవీంద్ర). ఓ సైకియాట్రిస్ట్ సహాయంతో అసలు సమస్య ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తనకు రాత్రిపూట నిద్రలో వస్తున్న కలకు తన ప్రవర్తనకు ఏదో సంబంధం ఉందని తెలుసుకున్న చిత్రాంగద తన సమస్య పరిష్కారానికి ఓ యంగ్ డాక్టర్ ( స్వాతి దీక్షిత్)తో కలిసి వెళ్తుంది. ఓ మహిళ  ఓ వ్యక్తిని ఓ చెరువు దగ్గర హత్య చేసినట్లుగా తన కలలో వస్తున్న ఆ ప్రదేశానికి చిత్రాంగద వెళ్ళగలిగిందా? అసలు చిత్రాంగదకు ఆ కలలో ఉన్నవాళ్ళకి సంబంధం ఏంటి? అసలు ఆ హత్య మిస్టరీ ఏంటి? చిత్రకు వచ్చిన సమస్య పరిష్కారమైందా లేదా అన్నదే కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ముఖ్యమైన రెండు ప్లస్ పాయింట్లు ఉన్నాయి. ఒకటి బలమైన కథను చాలా డీటైల్డ్‌గా తెరకెక్కించిన దర్శకుడు అశోక్. రెండో బలమైన అంశం ఈ సినిమాలో అంజలి తనపాత్రలో ఒదిగిపోయి నటించడం. ఈ రెండు అంశాలు కథలో ప్రేక్షకులు లీనమయ్యేటట్లు చేస్తాయి. దర్శకుడు అశోక్ పిల్లజమీందార్‌ తర్వాత తీసిన సుకుమారుడు స్టైల్లోకాకుండా కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి తెలుగులో కొత్తరకమైన హారిజాంటల్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో చాలా చక్కగా తెరకెక్కించారు. ఈ సినిమాలో ప్రతీ సీన్‌కు మరో సీన్‌కు లింక్ ఉండేలా ఎక్కడా మిస్ మ్యాచ్ అవ్వకుండా చాలా జాగ్రత్తపడ్డారని చెప్పుకోవాలి. అంతేగాక హీరోయిన్ అంజలి వెనుక బ్యాగ్రౌండ్లో జరిగే అంశాలు ఆసక్తికరంగా ఉంటాయి. చిత్ర అనే ఓ  బలమైన క్యారెక్టర్లో నటించిన అంజలి తన స్టైల్లో సినిమాని చాలా బాగా తీసుకెళ్ళింది. చిత్ర చూపించే లెస్బియన్ లక్షణాలు… భయపెట్టే ఎక్స్ ప్రెషన్స్, ఆవేశంగా చెప్పే డైలాగ్స్ కొత్తగా ఉంటాయి.  డాక్టర్ పాత్రలో జయప్రకాశ్, అంజలితోపాటు అమెరికా వచ్చిన యంగ్ డాక్టర్ క్యారెక్టర్లో స్వాతి దీక్షిత్ బాగా నటించారు. ప్రీ క్లైమాక్స్‌లో, క్లైమాక్స్‌లో రాజసం ఉట్టిపడేలా అర్జున్ నెగెటివ్ రోల్‌లో ఆకట్టుకున్నాడు. సింధుతులానికి అర్జున్‌కి మధ్య జరిగే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుండడం ఈ సినిమాకి ప్లస్ అయ్యింది. అంతేగాక సినిమాలో ఎక్కువశాతం అమెరికాలో షూట్ చేయడం వల్ల లొకేషన్లు అదరగొట్టాయి. వీటికితోడు ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ చిత్రంలోని అనవసర పాటలు పెద్ద మైనస్ పాయింట్ అయితే థ్రిల్లర్ సినిమాలకు బలంగా ఉండాల్సిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఏమాత్రం బలాన్ని ఇవ్వకపోగా సినిమాకే పెద్ద మైనస్‌గా అనిపించింది. వీటికితోడు ఎడిటింగ్ విషయంలోనూ కాస్త జాగ్రత్త తీసుకొని ఉండి, రన్‌టైమ్‌ను తగ్గిస్తే బాగుండేది. అంతేగాక ఈ సినిమాని మరింత ఆకట్టుకొనేవిధంగా తీసే అవకాశం ఉన్నప్పటికీ అంతగా తీయలేకపోయారని అనిపించింది. కథపై దృష్టిపెట్టిన అశోక్ సినిమా సాగతీతపై దృష్టిపెడితే బాగుండేదనిపించింది. వీటికితోడు సినిమాని ఒంటిచేత్తో నడిపించిన అంజలి యాక్షన్ సీన్లు కొన్నిచోట్ల ఓవారాక్షన్లుగా అనిపించాయి. సప్తగిరి కామెడీ ట్రాక్ రొటీన్‌గా చాలా చప్పగా ఉందే తప్ప ఏమాత్రం నూతనత్వం కనిపించలేదు. ఏ దయ్యం సినిమా అయినా సప్తగిరి కామెడీ మాత్రం ఒకేలా ఉంటుందని చెప్పుకోవడానికి ఈ సినిమాలో క్యారెక్టర్ ఓ ఉదాహరణ.

 

 ఓవరాల్: ఇంటర్వెల్ బ్యాంగ్ నుండి సరికొత్త అంశాలతో దూసుకెళ్ళిన ‘చిత్రాంగద’

రేటింగ్: 3/5

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.