ఎక్కడి ఆస్తికి అక్కడే రిజిస్ట్రేషన్

Anywhere Registrations System Stopped In The State

హైదరాబాద్: రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, అక్రమాలను నిరోధించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే కఠినమైన నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల జరుగుతున్న తీరుపై ఆయన ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణం స్పందించి, అవినీతి నిరోధించడానికి, అక్రమాలకు తావు లేని విధంగా ప్రక్షాళన జరగాలని ఆకాంక్షించారు. ఎక్కడి ఆస్తిని మరెక్కడి రిజిష్ట్రార్ కార్యాలయంలోనైనా రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని (ఎనీవేర్ రిజిస్ట్రేషన్) రద్దు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశానుసారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఇందుకు అవసరమైన వ్యూహాన్ని ఖరారు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

Anywhere Registrations System Stopped In The State

రిజిస్ట్రేషన్ శాఖ వ్యవహారాలపై ప్రగతి భవన్లో మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సిఎం మహమూద్ అలీ, మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి.సింగ్, డిజిపి అనురాగ్ శర్మ, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు బిఆర్ మీనా, నదీమ్ అహ్మద్, శాంత కుమారి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎంపి కె.కవిత, ఐజి పూర్ణచందర్ రావు, రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్ రావు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ముఖ్య అధికారులు పాల్గొన్నారు.

మేడ్చల్ జిల్లా పరిధిలోని మియాపూర్లో 796 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన వ్యవహారంపై ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహించాలని, సిఐడి ఆధ్వర్యంలో లోతైన దర్యాప్తు జరగాలని ఆదేశించారు. ఇందులో బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అయితే.. ఇదే సందర్భంలో ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందనే ప్రచారం కూడా పూర్తిగా అవాస్తమని కేసీఆర్ స్పష్టం చేశారు. మియాపూర్ పరిధిలో ఒక్క గజం ప్రభుత్వ స్థలం కూడా వేరే వ్యక్తులకు పోలేదని అధికారులతో ధృవీకరించుకున్న తర్వాత ముఖ్యమంత్రి ప్రకటించారు.

‘‘బ్యాంకుల నుంచి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు కొందరు ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్లు వేసి 2016లో రిజిస్ట్రేషన్ చేయించారు. దీనికి అధికారులు కూడా సహకరించారు. ఈ విషయం ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన అధికారులు 25 మే, 2017న ఆ రిజిస్ట్రేషన్ రద్దు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకున్నారు. దీనిలో ఎంత మంది బాధ్యులున్నా వారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. నిజానికి ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయడం చట్ట విరుద్ధం. అలా చేసినప్పటికీ ఆ రిజిస్ట్రేషన్ చెల్లదు. మియాపూర్లో ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ జరిగినా, దానికి చట్ట బద్దత లేదు. కాబట్టి భూ బదలాయింపు జరగలేదు. ప్రభుత్వ స్థలమంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. ప్రైవేటు వ్యక్తులు అప్పులు పొందడం కోసం ఈ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమి ఎక్కడికీ పోలేదు. కాబట్టి ప్రజలు అపోహ పడాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోయిందనే ప్రచారం కూడా తప్పు’’ అని సిఎం స్పష్టం చేశారు.

‘‘డబ్బులిస్తేనే తప్ప రిజిస్ట్రేషన్లు కావనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.  ఈ పరిస్థితి పోవాలి. రిజిస్ట్రేషన్ శాఖలో సంస్కరణలు జరగాలి. పూర్తి ప్రక్షాళన అవసరం. ఒక్క రూపాయి ఇవ్వకున్నా పని జరగాలి. దీనికోసం అవసరమైతే కొత్తగా విధి విధానాలు రూపొందించాలి’’ అని సిఎం అధికారులను ఆదేశించారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.