మంత్రివర్గ విస్తరణలో అమ‌ర్ నాథ్ రెడ్డికి అవకాశం

కర్నూలు: ఎవరికి ఎప్పుడు ఏ ముసలం ముంచుకు వస్తుందో అర్ధంకాని పరిస్థితి. ఎవరి పదవి ఉంటుందో, ఎవరిది ఊడుతుందో తెలియని అయోమయస్థితి. ఎప్పుడు ఏం వార్త వినాల్సి వస్తుందో అన్న అందోళన. ఇటువంటి పరిస్థితులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు బిక్కు బిక్కుమని కాలం గడుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తన మంత్రి వర్గంలో నుంచి కొంతమంది మంత్రులకు ఉద్వాసన చేప్పే యోచనలో ఉన్నారనే వార్త సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. అందులో రాష్ట్ర మంత్రి పల్లె రఘనాధరెడ్డికి కూడా పదవీ గండం ఉండబోతుందని ప్రచారం సాగింది.

గ‌త 22 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకుని ఉన్న ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి ఎన్నికల్లో తన సొంత డబ్బునే ఖర్చుచేస్తూ మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒక‌సారి ఎమ్మెల్సీగా గెలుపొందారు. రాయలసీమ రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్న వారిలో అమ‌ర్ నాథ్ రెడ్డి, సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి, మాగుంట శ్రీ‌నివాసులు రెడ్డి ఉన్నారు.

సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మూడుసార్లు ఓడిపోయినప్పటికీ ఆనం బ్ర‌ద‌ర్స్ ను కాద‌ని మ‌రీ చంద్ర‌బాబు ఎమ్మెల్సీగా అవ‌కాశం క‌ల్పించారు. సోమిరెడ్డి అక్ర‌మాస్తులు కూడ‌బెట్టార‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇప్పటికే పలు కోర్టుల్లో కేసులు కూడా న‌డుస్తున్నాయి.  కాకాని వ‌ర్సెస్ సోమిరెడ్డి వివాదాలు కూడా సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నాయి. సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది.

చంద్ర‌బాబుకి మాగుంట శ్రీనివాసులు రెడ్డి పైన సదాభిప్రాయం లేదని వినికిడి. అయినప్పటికి శ్రీనివాసులు రెడ్డి ఎలాగైనా మంత్రి కావాలనే పట్టుదలతో ప్రయత్నం చేస్తున్నారు. శ్రీనివాసులు రెడ్డి లోగడ పార్లమెంటు సభ్యులుగా కూడా పనిచేశారు. ఇదిలా ఉండగా భూమా నాగిరెడ్డి, అమ‌ర్ నాథ్ రెడ్డిల పేర్ల‌ను ముఖ్యమంత్రి మంత్రివ‌ర్గంలోకి తీసుకోవ‌డానికి ప‌రిశీలించి, భూమాకు మంత్రి పదవి ఇవ్వాలని భావించారని తెలుస్తోంది. పార్టీ ఫిరాయింపుదారుడిచేత ప్రమాణం చేయించడానికి గవర్నర్ నరసింహన్ సిద్ధంగా లేకపోవడంతో జాప్యం జరిగింది. ఈ లోగా భూమా నాగిరెడ్డి ఆదివారం ఉదయం గుండెపోటుతో ఆకస్మిక మరణం చెందారు.

సంతాప దినాలు ముగియకముందే అఖిల ప్రియ‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తారనే ప్రచారం మొదలైంది. అఖిలప్రియ మొదటిసారి ఎమ్మెల్యే కాబట్టి ఆమెకు మంత్రి పదవి నిర్వహించడానికి అవసరమైన అనుభ‌వం లేద‌ని, ఆమెకు నామినేటెడ్ ప‌ద‌విని ఇస్తారని, చంద్ర‌బాబు భావిస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అమ‌ర‌నాథ‌రెడ్డికి మాత్రం మంత్రి ప‌ద‌వి లభించే అవ‌కాశం ఉందంటున్నారు. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లా కోటాలో ముఖ్యమంత్రితోపాటు బొజ్జ‌ల ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేస్తున్న నారా లోకేష్ కు ఎలాగూ మంత్రి ప‌ద‌వి ఖాయం కాబ‌ట్టి ఒక్క చిత్తూరు జిల్లా నుంచి ముగ్గురు మంత్రులవుతారు. ఈ నేపధ్యంలో అమ‌ర్ నాథ్ రెడ్డికి ఇవ్వాలంటే బొజ్జ‌ల గోపాల‌రెడ్డిని మంత్రి పదవి నుంచి త‌ప్పించ‌డం మిన‌హా మ‌రో అవ‌కాశం లేదు. బొజ్జల కొగసాగించడమో లేదా ఆయనకు స్వస్తి చెప్పడమో చంద్రబాబు నిర్ణయించుకోవల్సి ఉంటుంది.

భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇచ్చిఉన్నట్లయితే బొజ్జల గోపాలకృష్ణను గానీ, పల్లె రఘనాధరెడ్డి గాని తొలగించవలసి వచ్చేది. ఇప్పుడు ఆ భయం తప్పింది. కానీ అమ‌ర్ నాథ్ రెడ్డికి పదవి ఇవ్వాల్సి వస్తే ఉద్వాసన బొజ్జకు చెబుతారా లేదా పల్లెకు చెబుతారనేది ప్రశ్న.

Have something to add? Share it in the comments

Your email address will not be published.