కేజ్రీవాల్ నిజంగా అవినీతిపరుడా??

Arvind Kejriwal may escape from allegations,but AAP image will go down for sure

Arvind Kejriwal may escape from allegations,but AAP image will go down for sure

ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచి రాజకీయాల్లోకి రావాలనుకొనే యువతకు స్పూర్థిగా నిలిచిన ఆమ్‌ ఆద్మీ పార్టీలో ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే తయారైంది. విద్యార్థులు, యువత అవినీతికి వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పుట్టుకొచ్చిన ఆప్‌కు ఇప్పుడు అవినీతి మరకలు అంటుకుంటున్నాయి. అది కూడా ఎంతోమందికి స్పూర్థిని నింపి ఎంతోమంది యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిన అరవింద్ కేజ్రీవాల్‌పై ఇప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేగాక ఆమ్‌ ఆద్మీ పార్టీలో అంతర్యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేసి పార్టీ నుండి సస్పెండ్‌ అయిన కపిల్‌ మిశ్రా సీఎంపై విమర్శలు వర్షం కురిపిస్తూనే ఉన్నారు. కపిల్‌ మిశ్రా కేజ్రీవాల్‌పై ఆరోపణలు చేయగా తాజాగా ఆప్‌ బహిష్కృత ఎమ్మెల్యే ఆసిమ్‌ అహ్మద్‌ ఖాన్‌ కూడా ఆయన బాటలో చేరారు. కేజ్రీవాల్‌, ఆయన అనుచరులు తనను 5 కోట్ల రూపాయలు డిమాండ్‌ చేశారని వెల్లడించారు. పార్టీని ప్రైవేటు కంపెనీలా మార్చేశారని ధ్వజమెత్తారు. పార్టీ అవినీతికి కపిల్‌ మిశ్రాను బలిపశువు చేశారని వాపోయారు. కేజ్రీవాల్‌ను వ్యతిరేకించే వారిని పార్టీ నుంచి గెంటేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రివర్గ బాధ్యతలను సరిగా నిర్వర్తించలేదన్న కారణంతో కపిల్‌ మిశ్రాను గత శనివారం పదవి నుంచి తొలగించిన తర్వాత అంతర్యుద్ధం మరింత ఎక్కువైంది. కేజ్రీవాల్‌ 2కోట్ల రూపాయలు తీసుకోవడం స్వయంగా తన కళ్లతో చూశానని ఆరోపించిన తర్వాత సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మిశ్రాను పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. దీంతో కపిల్ మిశ్రా కేజ్రీవాల్‌కు సవాలు విసిరారు. దమ్ముంటే ఎన్నికలు పెట్టి తనపై పోటీ చేయాలని , ట్యాంకర్‌ స్కామ్‌ గురించిన అన్ని వివరాలు ఏసీబీకి అందించానని, ఇప్పుడు సీబీఐకి కూడా చెబుతానని హెచ్చరిస్తున్నారు కపిల్ మిశ్రా.

కపిల్ మిశ్రా తెరలేపిన అవినీతి ఆరోపణలను ఆప్ సర్కార్ ఎలా ఎదుర్కోబోంది? పార్టీలో ఇప్పటికే ముదిరిన అంతర్యుద్ధానికి కేజ్రీవాల్ చెక్‌పెడ్తారా లేక ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటారా? ప్రస్తుతం ఢిల్లీ రాజకీయవర్గాల్లో ఈ ప్రశ్నలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటు చేసిన కేజ్రీ సర్కార్ ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీలో పొగపెడుతున్న నాయకులకు ధీటుగా జవాబు ఇవ్వడానికి సిద్ధమైంది. అయితే విమర్శల వర్షం కురిపిస్తునే కేజ్రీవాల్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి ప్రతిపక్ష బిజెపి, కాంగ్రెస్ పార్టీలు.

అయితే ఈ తతంగంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకున్నప్పటికీ, నిజాయితీకి మారుపేరుగా అవినీతికి దూరంగా ఏర్పడ్డ ఆమ్‌ఆద్మీ పార్టీ ఇమేజ్‌కు మాత్రం  మరిన్ని గట్టి దెబ్బలే తగలనున్నాయి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.