ఎన్నికల ఫలితాలు: పొంతనలేని ఓట్లు, సీట్లు

రాజకీయాలు –  ఎన్నికలు ఈ రెండూ ప్రజలకు కొత్తరకమైన పాఠాలను నేర్పిస్తుంటాయి. ఎన్నికల సమయంలో ప్రజలు సైతం తమ ఓటు ద్వారా తామేమనుకుంటున్నారో తెలియచేసే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తారు. ప్రతీసారి ఎన్నికలు జరిగినప్పుడల్లా ఈ రకమైన పరిస్థితి కనిపిస్తన్నప్పటికీ ఈసారి జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు గట్టి షాకిచ్చాయి. ప్రచార సమయంలో ఎవరెన్ని వాగ్దానాలు చేసినప్పటికీ అధికారంలో ఉన్న ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో చూపించి చాలామంది నాయకులకు రాజకీయ భవిష్యత్తును అగమ్యగోచరంగా చేశారు. శాసనసభ ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలపై ప్రజల్లో ఎలాంటి ఆశలు ఉన్నాయో… తమకెలాంటి మార్పు కావాలో స్పష్టంగా చూపించారు. అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన కీలక అంశం పోలైన ఓట్ల శాతం. చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి ఓట్లశాతం ఐదురాష్ట్రాల్లోనూ వాళ్ళుగెలుచుకున్న సీట్లకు ఏమాత్రం పొంతనలేకుండా ఉంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లో పోలైన ఓట్లు – అక్కడి పరిస్థితి

2014లో ఎన్నికలు జరిగిన తర్వాత కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజీపీ మనసుపెట్టి 2017 అసెంబ్లీ ఎన్నికల్లో యూపీ కోటను చేజిక్కించుకోవడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు రాజ్‌నాథ్ సింగ్ వంటి మహామహులు సమాజ్ వాది పార్టీ కంచుకోటను బద్దలుకొట్టి ఓటర్లను తమవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు. ఎస్పీ- కాంగ్రెస్ కలిసి పోటీ చేయడం వల్ల ఫలితాల్లో ఆ రెండు పార్టీలు ముందుంటాయని మొదట్లో అనుకున్నారు. ఈ ఎన్నికల్లో మోడీ పరువు పోవడం ఖాయమని అందరూ భావించారు. ఆ తర్వాత బీఎస్పీ పుంజుకోవడంతో ఒక దశలో ఎస్పీ-కాంగ్రెస్ పార్టీలను మించిపోతుందని కూడా అంచనాలు వేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బిఎస్పీ ఆ స్థాయిలో ఫలితాలను రాబట్టుకోలేకపోయింది. ఉత్తర్‌ప్రదేశ్‌లో లో బీజేపీ 40 శాతం ఓట్లను సాధించగా, అధికారంలో ఉన్న ఎస్పీతోపాటు కాంగ్రెస్, బీఎస్పీలు ఏమాత్రం తమ ప్రభావాన్ని చూపించలేకపోయాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఎస్పీ 47 సీట్లు గెలుచుకోగా  21.9 శాతం ఓట్లు సాధించింది. కేవలం 19 సీట్లతో సరిపెట్టుకున్న బీఎస్పీ ఓట్ల విషయంలో 22.2 శాతంతో ముందంజలో ఉండటం కూడా యాద‌ృచ్చికం ఏమాత్రం కాదు.

పంజాబ్‌లో పోలైన ఓట్లు – అక్కడి పరిస్థితి

పంజాబ్‌లో త్రిముఖ పోటీ కారణంగా రాజకీయ పరిణాలు చాలావేగంగా మారిపోయియి. ప్రచారం జరుగుతున్న సమయంలోనే కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఎన్నికల ముందు, ప్రచార సమయంలో చాలామంది నాయకులు పార్టీలు మారారు. దీంతో కొత్తదనం కోరుకొనే ఓటర్లను చాలా ఈజీగా ఆకట్టుకోగలిగారు జంప్ జిలానీలు. పంజాబ్ లో బీజేపీతో కలిసి పోటీ చేసిన అధికార శిరోమణి అకాలీదళ్‌కు ప్రజలు మార్పును కోరుకొని మనసులోని మాటను ఓట్ల రూపంలో చూపించారు. దీంతో  ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైంది.  ఢిల్లీ బయట ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొన్న ఆద్మీ పార్టీ సైతం ప్రచార సమయంలో కాంగ్రెస్‌తోపాటు  శిరోమణి అకాలీదళ్‌కు గట్టిపోటీ ఇస్తుందని ప్రచారం జరిగినప్పటికీ ఆ పార్టీ ఆశించిన స్థాయిలో కూడా సీట్లు గెలుచుకోలేకపోయింది. ఈ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆద్మీ పార్టీ 20 స్థానాల్లో గెలిచి 23.9శాతం ఓట్లు తమ పక్షాన తెచ్చుకోగా, 15 స్థానాల్లో గెలిచిన అకాలీదళ్‌కు 25.3 శాతం ఓట్లు పోలయ్యాయి. కెప్టెన్ అమరిందర్ సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ 77 సీట్లను గెలుచుకొని 38.5శాతం ఓట్లు సాధించగలిగింది.

గోవాలో పోలైన ఓట్లు – అక్కడి పరిస్థితి

గోవాలో అధికారంలో ఉన్న బీజేపీ 13 సీట్లు మాత్రమే గెలుచుకోగా 33.1 శాతం ఓట్లు సాధించుకుంది. 2012లో గోవాలో ముఖ్యమంత్రిగా ఎన్నికైన మనోహర్ పారికర్ కేంద్రమంత్రిగా ప్రమోట్ అయి ఢిల్లీ వెళ్ళిన తర్వాత గోవా బీజేపీలో బలమైన నాయకుడులేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ  కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుచుకున్నప్పటికీ 27.7 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ కన్నా 4 సీట్లు ఎక్కువ గెలుచుకున్నప్పటికీ ఓట్లు మాత్రం తగ్గాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తమవైపు తిప్పుకోవడంలో హస్తం ఓ మాదిరిగా సక్సెస్ అయ్యిందనే చెప్పుకోవచ్చు.

మణిపూర్‌లో పోలైన ఓట్లు – అక్కడి పరిస్థితి

మణిపూర్‌లోనూ మిగతాచోట్ల వచ్చిన విధంగానే ఫలితాలు వచ్చాయి. మణిపూర్‌లో కాంగ్రెస్ 28 స్థానాల్లో గెలుపొందగా, ఆ పార్టీకి 34.5 శాతం ఓట్లు వచ్చాయి.  అయితే 21 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీకి 36 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎక్కువ సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ కు తక్కువ ఓట్లు, తక్కువ సీట్లు గెలుచుకున్న బీజేపీకి ఎక్కువ ఓట్లు పోలవడం విశేషం. అదే సమయంలో మణిపురీల అభ్యున్నతికోసం 16 ఏళ్ళపాటు నిరాహారదీక్ష చేసిన షర్మిళ కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఉత్తరాఖండ్‌లో పోలైన ఓట్లు – అక్కడి పరిస్థితి

ఈ నాలుగు రాష్ట్రాలతో పోల్చితే ఉత్తరాఖండ్ లో మాత్రం ఓట్ల సరళి భిన్నంగానే ఉంది. ఈ రాష్ట్రంలో బీజేపీ  57 స్థానాల్లో గెలుపొందగా, 46.5 శాతం ఓట్లు సాధించుకుంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ మాత్రం కేవలం 11 స్థానాలకు పరిమితమై, మొత్తం 33.5 శాతం ఓట్లు పోలయ్యాయి. ఏ రాష్ట్రంలో కనిపించని విధంగా ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు 10 శాతం ఓట్లు రాబట్టుకోగలిగారు.

మొత్తంమీద ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు అన్ని రాజకీయపార్టీలకు గుణపాఠాలను నేర్పించడమేకాకుండా మరో రెండేళ్ళలో దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికలకు ఎలా సిద్ధమైతే విజయాన్ని అందుకోవచ్చో తెలుసుకోవడానికి ఓ మంచి అవకాశాన్ని కల్పించిందనే చెప్పుకోవాలి.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.