`సత్యా`న్ని బలిపశువు చేసిందెవరు?

Ayesha Murder case : Who is responsible for the loss happened to Satyambabu

Ayesha Murder case : Who is responsible for the loss happened to Satyambabu

ఆయేషా మీరా హత్య కేసులో ఓ అమాయక బలహీనుణ్ణి మన వ్యవస్థ అడ్డంగా బలిచేసింది. అసలు నిందితులు వేరే ఉన్నారంటూ ఎంతోమంది విన్నపాలు చేసినా, నిరసనలు చేసి తమ అసహనాన్ని వెళ్ళగక్కినా, సాక్ష్యాలు కాలగర్భంలో కలిసిపోయేవరకు ప్రశాంతంగా ఓ అభాగ్యుడిని అరెస్ట్ చేసి చేతులు దులుపుకున్న పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా కళ్ళు తెరుస్తుందా..? ప్రభుత్వమైనా కాసింత ద‌‌‌ృష్టిసారించి అసలు ఆయేషామీరా హత్య కేసులో ఇప్పటివరకు బయటపడకుండా జల్సాలు చేస్తూ దర్జాగా దొరల్లాగా బయటతిరుగుతున్న ‘కామ’రాబందులను పట్టుకుంటుందా అన్న ప్రశ్న మళ్ళీ హైకోర్టు తీర్పుతో వెలుగులోకి వచ్చింది. అసలు ఈ సత్యంబాబు కథేంటి? ఆయేషా మీరా హత్య కేసులో ఎందుకు బలిపశువు అయ్యాడు? ఇన్నేళ్ళు రాజకీయబలంతో బయటికిరాని పేర్లు ఏవైనా ఇప్పటికైనా బయటికొస్తాయా?

అమరావతి: దళిత యువకుడు సత్యం బాబుని పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు. పోలీసులు చివరకు నడవలేని స్థితిలో ప్లాస్టిక్ కుర్చీలో కూర్చోపెట్టి తోసుకుంటూ వెళ్ళి కోర్టు ముందు హాజరుపర్చారు. ఆ మధ్యలో ఏంజరిగిందో మనం అర్ధం చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు అతను నిలబడలేని స్థితిలో ఉన్నాడు. ఇద్దరి మనుషుల సహాయం ఉంటే తప్ప అతను నడవలేని పరిస్థితి. ఇదీ మన పోలీసుల నిర్వాకం. గడిచిపోయిన 8 ఏళ్ళ జీవితాన్ని సత్యానికి ఎవరు తిరిగి తెచ్చిస్తారు? లక్ష రూపాయల పరిహారం ఇస్తే అతనికి గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? ఆ ముసలి తల్లి గుండెకోత తీర్చేదెవరు?

ఇబ్రహీంపట్నం శ్రీ దుర్గ హాస్టల్ లో ఉంటున్న బీ ఫార్మసీ విద్యార్ధిని ఆయేషా 2007 డిసెంబర్ 26న తన గదిలో హత్యకు గురైందన విషయం అందరికి తెలిసింది. పిడతల సత్యంబాబే అత్యాచారంచేసి చంపేశాడని పోలీసులు కేసు నమోదుచేసుకొని అరెస్టు చేశారు. ఈ నేపధ్యంలో శుక్రవారం హైదరాబాద్ ఉమ్మడి కోర్టు పిడతల సత్యం బాబు నిర్దోషి అని తీర్పు చెప్పింది.

పోలీసు మొదట గుర్విందర్ సింగ్ ఆనంద్ అలియాస్ లడ్డుని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. కాని కొన్ని నెలల తర్వాత, పోలీసులు అతనిని విడుదలచేసి లడ్డు స్నేహితుడైన ఉపేందర్ సింగ్ అరెస్ట్ చేశారు. అతనిని కూడా పోలీసులు ఈ కేసు నుండి తప్పించి దళిత యువకుడైన పిడతల సత్యంబాబును అరెస్ట్ చేసి, కోర్టులో హాజరుపరచారు. స్థానిక కోర్టు అతనికి యావజ్జీవ కారగార శిక్ష విధించింది.

సత్యంబాబును అరెస్ట్ చేసినప్పటి నుండి దళిత, మానవహక్కుల సంఘాలు ఆయేషా హత్య కేసులో అతని పాత్రను ఖండించారు. అదే విధంగా సత్యంబాబు కుటుంబ సభ్యులు కూడా ఈ హత్యను ఖండించారు. ఈ హత్యకు సత్యం బాబు ప్రమేయం ఉందని పోలీసులు ఎంత వాదించినప్పటికీ అయేషా మీరా తల్లిదండ్రులు మాత్రం, తన కూతురు హత్యలో అతని ప్రమేయం లేదని చెప్పడం ఆసక్తికరంగా మారింది. మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి కోనేరు రంగారావు మనవడు కోనేరు సతీష్ బాబే అత్యాచారంచేసి హత్యచేశాడని అయేసా మీరా, సత్యంబాబు కుటుంబ సభ్యులు ఆరోపించారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా వీరికి మద్దతు తెలిపింది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసును పునర్విచారణ చేయిస్తామని చంద్రబాబు నాయుడు, నాయకులు అప్పట్లో హామీ ఇచ్చారు.

టిడిపి నేతలు, బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపణలు చేసిన నేపధ్యంలో పోలీసులు సతీష్ పై లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించి అతనికి క్లీన్ చిట్ ఇచ్చి ఈ కేసు నుండి విముక్తి చేశారు. అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సతీష్ బాబు ప్రమేయాన్ని ఖండించారు. తన మనవడు నేరం చేశాడని నిరూపించగలిగితే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని కోనేరు రంగారావు టిడిపి నాయకులకు బహిరంగ సవాలు చేశారు.

అయేషా కేసులో సత్యం బాబు నిర్దోషిగా తీర్పు చేబుతూ, అతనికి ఒక లక్ష పరిహారం చెల్లించాలని హైదరాబాద్ హైకోర్టు శుక్రవారం పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉండగా సత్యం బాబు నిర్దోషి అయినప్పుడు అసలు దోషులెవరు అన్న ప్రశ్న మొదలైంది. ఇప్పుడు అసలు దోషులను పట్టుకోవల్సిన బాధ్యత పోలీసుల వంతైంది. గతంలో హామీ ఇచ్చిన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు ఇచ్చిన హామీ మేరకు దోషులకు శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి.

దోషి శిక్షించబడాలి, బాధితుడి కుటుంబానికి న్యాయం జరగాలి. కానీ పోలీసులు సరైన విచారణ చేయకుండా నిరపరాధిని అరెస్టు చేసినందుకు తరతమ బేధాలు లేకుండా వారిని కూడా శిక్షించాలి.

కేసు పూర్తయింది, కానీ సమాజం ముందు ఒక పెద్ద ప్రశ్న మొదలైంది. నేరం చేయకుండా 8 సంవత్సరాల పాటు సత్యం బాబు ఖైదీగా ఉన్నాడు. ఇప్పుడు అతను పోగొట్టుకున్న తన విలువైన జీవితాన్ని ఎవరు తిరిగి ఇస్తారు?

Have something to add? Share it in the comments

Your email address will not be published.