బోరుబావులపై పాఠం నేర్పిన చిన్నారి మీనా

Baby Meena stuck in borewell pulled out after rescue operations

ఎన్నో ఉద్విగ్వ క్షణాలు, ఎంతోమంది ఆశలు, చిన్నారి ఎలాగైనా బయటికొస్తుంది… అరవై గంటలుగా మాటలకు చెప్పలేని మనోవేదనకు గురైన తల్లిదండ్రులకు కన్నీళ్ళు తుడుస్తుందని అందరూ అనుకుంటున్న సమయంలో చిన్నారి మృతి చెందిందనే వార్త ఎవరికీ మింగుడుపడట్లేదు. క్షణక్షణం ఉత్కంఠ.. చిన్నారి జాడ కనిపించకపోతుందా.. ఆఖరి చూపైనా దక్కకపోతుందా అన్న ఆవేదన చిన్నారి ఆచూకీ కూడా లేకపోవడంతో చిన్నారి మృతి చెందిందని ఎయిర్ ప్రెషర్ ద్వారా చివరి ప్రయత్నం చేయగా చిన్నారి అవశేషాలు ఒక్కటొక్కటిగా బయటికి వచ్చాయి.

Baby Meena stuck in borewell pulled out after rescue operations

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం చన్‌వెళ్లిలో గురువారం సాయంత్రం బోరుబావిలో పడిన చిన్నారి మీనా ఎప్పటికైనా సజీవంగా బయటికి వస్తుందన్న ఆశలు చివరికి అడియాసలయ్యాయి. అరవై గంటలకు పైగా శ్రమించినా కనీసం పాప మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించలేకపోవటంతో తీవ్ర విషాదం నెలకొంది. గురువారం రాత్రి నుంచి అత్యాధునిక పరికరాలతో బయటకు తీసేందుకు సిబ్బంది చేసిన యత్నాలు ఏమాత్రం ఫలించలేదు.

మొదట 40 అడుగుల లోతున ఇరుక్కుపోయిన చిన్నారి ఆచూకీ శుక్రవారం బోరుబావిలోని మోటారు తీసినప్పటి నుంచి జాడ కనబడకుండా పోయింది. దీంతో శనివారం ఉదయం ప్రత్యేక లేజర్‌ కెమెరాలు తెప్పించి.. 110 అడుగుల లోతు వరకు పంపి పరిశీలించినా పాప ఆనవాళ్లు కనబడలేదు. దాంతో అత్యాధునిక మ్యాట్రిక్స్‌ వాటర్‌ప్రూఫ్‌ కెమెరాను తెప్పించి.. 210 అడుగుల లోతు వరకు వెతికారు. అయినా పాప ఎక్కడ చిక్కుకుపోయిందనేది తేలకపోవడంతో సహాయక చర్యలపై తర్జనభర్జన జరిగింది. పాప బోరుబావి పక్క భాగంలో భూమిలో అతుక్కుపోయిందా? లేక కిందకు జారిన పాపపై మట్టి పెళ్లలు పడడంతో కెమెరాలకు కనిపించడం లేదా అన్నదానిపై సందిగ్ధత చాలాసేపు నెలకొంది. దీంతో సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కె.లక్ష్మారెడ్డి, అధికారులు చర్చించి.. బోరుబావి పెకలించాలని నిర్ణయించారు.

See Also: ఇదేం దిక్కుమాలిన పాలసీ

ఆదివారం తెల్లవారుజామునుంచి ఎయిర్‌ప్రెషర్ ద్వారా బయటకు తీయాలని చేసిన చివరి ప్రయత్నం కొంత మేలని అధికారులు భావించారు. అయితే ఫ్లషింగ్‌తో మృతదేహాన్ని బయటకు తీయాలని చూడగా మొదటగా బోరుబావి నుంచి దుర్వాసన వచ్చింది. ఆపై చిన్నారి మీనా దుస్తులు బయటకు వచ్చాయి. ఆ తర్వాత మరికాసేపు ఫ్లషింగ్ చేయగా చిన్నారి మీనా అవశేషాలు ఒక్కొక్కటిగా బయటకురావడంతో అక్కడ ఉన్న అందరికీ కంటతడి పెట్టించింది. ముఖ్యంగా ఇది చూడగానే చిన్నారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు మూడు రోజులుగా నీళ్లు, మట్టిలో చిన్నారి కూరుకుపోవడంతో చనిపోయి మృతదేహం కుళ్లిపోయింది.

పాపను బయటికి తీసేందుకు సహాయక బృందాలు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. తమకు తెలిసిన పరిజ్ఞానంతో పాపను బయటకు తీస్తామని చెప్పిన వారందరికీ అవకాశం కల్పించారు. బోరుబావిలోకి కొక్కెం వేసి, అది పాప దుస్తులకు చిక్కుకుంటే బయటికి లాగాలని ప్రయత్నించారు. అది కూడా ఏమాత్రం ఫలించలేదు. అలాగే బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లను లాగేందుకు ఉపయోగించే పంజరం లాంటి యంత్రాన్ని సైతం వినియోగించారు. 360 డిగ్రీల కోణంలో దృశ్యాలను చిత్రీకరించగల ప్రత్యేక కెమెరాలను తెప్పించి పరిశీలించినా.. శనివారం అర్ధరాత్రి వరకూ పాప జాడ తెలియలేదు.

See Also: ఇప్పటికైనా కళ్ళుతెరుద్దామా???

బోరునుంచి బయటికితీసిన చిన్నారి మీనా అవశేశాలను శవ పరీక్ష కోసం చేవెళ్ల ఆస్పత్రికి తరలించారు. పనిచేయని బోరుబావులు మూసివేయకుండా ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని ఘటనా స్థలంలో ఉన్న మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. చిన్నారి కుటంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. ప్రమాదానికి కారణమైన బోరు యాజమాని మల్లారెడ్డిపై 336 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మొత్తానికి చిన్నారి మీనా సంఘటనతోనైనా మనలో ఎంతమందికి కళ్ళు తెరుచుకుంటాయో చూడాల్సిందే. పనికిరాకుండా ఉన్న బోర్లను ఇప్పటికైనా మూసి మీనాలా మరో చిన్నారి బోరు బావికి బలి అవ్వకుండా , చిన్నారి తల్లిదండ్రుల్లా మరే తల్లిదండ్రులకు మానసికవేదన కలిగించకుండా, కన్నీళ్ళు తెప్పించకుండా ఉండాలని అందరం కోరుకుందాం.

Have something to add? Share it in the comments

Your email address will not be published.