భగవద్గీత చావుమేళమా??

Bhagavad Gita is not for mourning and not to meant to be played during deaths
  • ఇదేం సంస్కృతి – ఇవేం ఆలోచనలు

“పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం
వ్యాసేన గ్రథితాం ,పురాణమునినా మధ్యే మహా భారతం
అధ్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం
అంబత్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం” అని  ఘంటసాల ఎంతో అద్భుతంగా గానం చేసి మనకు అందించిన భగవద్గీత వినిపించందంటే చాలు ఆ దగ్గర్లో ఎవరో చనిపోయారని, లేదా ఎదురుగా ఏదో శవాన్ని తీసుకెళ్ళే వాహనం వెళ్తోందని అనుకొనే నీఛ స్థితికి ప్రస్తుతం మన సమాజం చేరుకుంది.

Bhagavad Gita is not for mourning and not to meant to be played during deaths

ఎందుకంటే గత కొన్నేళ్ళుగా మన సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గుళ్ళలో, ఇంట్లో పారాయణం జరగాల్సిన భగవద్గీత కాస్తా ఇప్పుడు ఎవరైనా చనిపోతేనే గుర్తుకొస్తోంది. అసలు మానవాళికి వేదాల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. అలాంటి భగవద్గీతకు జరుగుతున్న అవమానం గురించి మాట్లాడే తీరిక ఎవరికీ లేదు. ఎవరైనా మాట్లాడితే వీడికెందుకింత ఛాదస్తం అని తిట్టుకొనేవాళ్ళే ఎక్కువగా ఉంటున్నారు. అందుకే ఎవరైనా భగవద్గీత చావుమేళం కాదు అని గొంతెత్తి అరిచినా సమాజం వాడిని పిచ్చోడిని చూసినట్లు చూస్తుందే తప్ప అసలు విషయాన్ని తెలుసుకొనే ప్రయత్నం చేయదు.

ప్రస్తుత సమాజంలో, వ్యవస్థలో మనిషి జీవితం ఎంత దరిద్రంగా తయారవుతోందో కొత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే ఒకప్పుడు బ్రాహ్మీ ముహూర్తంలో, తెలవారుతుండగా గుడి మైకులనుండి వినబడే ఘంటసాల భగవద్గీత వినడానికి ఎంతో ఆనందంగా ఉండేది. ప్రతీరోజు అనంత కాలగమనంలో మనిషి జీవితం ఎంత చిన్నదో కాల స్వరూపమైన దైవం ఎంత విస్తృతమో గుర్తుచేస్తుండేది. మనిషిని ఒకరకమైన అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక భావనలోకి తీసుకెళ్ళి జీవితసారాన్ని నేర్పిస్తుంది.

అలాంటి ఎంతో ఉత్తమమైన భగవద్గీతను ఎవరో మేధావి చనిపోయినప్పుడు పారయణం చేస్తే అదే ఇప్పుడు మనపాలిట చావుమేళంలా తయారై, మన పిల్లలకు భగవద్గీతను ఎవరైనా చనిపోయనప్పుడు చదవాలనే స్థితికి తీసుకెళ్తున్నాం. ఇప్పటికే ఇంట్లో ఎవరైనా భగవద్గీత పెట్టారంటే ఏమైనా పీనుగలేచిందా లేక ఎవడైనా చచ్చాడా అనే మాటలు వినిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి మాటలే ఇంట్లో భగవద్గీత పెట్టుకోవాలంటేనే భయపడే స్థితికి తీసుకొచ్చారు మన మేధావులు. పవిత్రమైన భగవద్గీతను కోర్టుల్లో ప్రమాణాలు చేసే ఒక పుస్తకంగా వాడుతున్నారే తప్ప నిజ జీవితంలో ఎలాంటి పరిస్థితుల్లో వాడుతున్నామనే ఇంగిత జ్ఞానం జనాలకు లేకుండా పోయింది. అంతేగాక సమాజంలో ఎవరైనా పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు టీవీల్లో వచ్చే లైవ్ టెలికాస్ట్‌ల్లో బ్యాగ్రౌండ్‌లో వినిపించే పారయణ ఒక్కటే.. అదే భగవద్గీత. ఆఖరికి ఇటీవల చనిపోయిన సి.నారాయణరెడ్డి శవయాత్రలో కూడా భగవద్గీతను చావుమేళంగానే వాడుకున్నమంటే మన పరిస్థితి ఎంత దౌర్భాగ్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

“పుట్టిన ప్రతి ఒక్కరూ చావక తప్పదు” అన్న మౌలిక సత్యాన్ని మనం అంతా కూడా తప్పక తెలుసుకోవాలి. “పుట్టుటయు నిజము .. పోవుటయు నిజము .. నట్టనడి మీ పని నాటకము” అన్నారు అన్నమయ్య. మహాత్మాగాంధీ నుంచి ఐన్‌స్టీన్ లాంటి మేధావులనూ భగవద్గీత ప్రభావితం చేసిందనీ, ఆధ్యాత్మిక, లౌకిక, పారమార్థిక, నైతిక అంశాలెన్నో అందులో ఉన్నాయని పిల్లలకు చెబుతుంటాం. పాశ్చాత్యదేశాల్లోని విదేశీయులు సైతం గీతను ఆదరించి విజ్ఞానవంతులు అవుతున్నారని గొప్పలు చెబుతుంటాం. ప్రతి ఇంట్లో ఈ గ్రంథాన్ని పూజించాలనీ, అందరూ చదవాలని సూచిస్తుంటాం. మనిషిని మహోన్నతునిగా తీర్చిదిద్దే ఆ గ్రంథంలోని సూక్ష్మాలను, శ్లోకాలను, తాత్పర్యాలతో సహా వివరిస్తుంటాం. అంతేగాక బతుకు సారమంతా శ్రీమద్భగవద్గీతలోనే ఉందనీ, అది ఒక మత గ్రంథం కాదనీ, వ్యక్తిత్వాన్ని వికసింపజేసే గురువులాంటిదని అందరూ ఉపన్యాసాల్లో దంచి కొడుతుంటాం. అయితే ఆచరణలో మాత్రం చావులకు మాత్రమే భగవద్గీత అనేట్లు తయారుచేస్తున్నాం.

‘భగవద్గీత’ను కేవలం మరణ సందర్భంలో రికార్డుల ద్వారా వినిపించడం అనే విష సంస్కృతి మారాల్సిన అవసరం ఎంతో ఉంది. అసలు భగవద్గీతకీ మరణ సంస్కారాలకీ సంబంధమే లేదు. ఆ సమయంలో భగవద్గీత, విష్ణుసహస్రనామాలు, శివనామాలు వంటి వాటి అవసరం ఏమాత్రం లేదు. జన్మ ప్రభ్రుతి మరణపర్యంతం ‘షోడశసంస్కారాలు’ ఉన్నాయి. ఆయా సందర్భాలలో చేయవలసిన కర్మలు, మంత్రాలు ఉన్నాయి. అంతేగానీ కేవలం ఎవరైనా మరణించనప్పుడు మాత్రమే గీతాపఠనం చేయరు. మానవ జ్ఞానం కోసం భగవద్గీత ఉండాలే కాని ఔర్ధ్వ దైహిక క్రియల కోసం  ఏమాత్రం కాదనేది అందరికీ తెలియచేయాల్సిన అవసరం ఎంతో ఉంది.

ముస్లింలు చిన్నగా ఉన్నప్పుడే తమ చిన్నారులకు ఉర్దూ నేర్చించి ఖురాన్‌ని చిన్నతనం నుంచే అధ్యయనం చేయిస్తారు.  అంతేగాక వారి మతాచారాలను చాలా కఠినంగా అనుసరిస్తారు. అలాంటి కఠినత్వం హిందూ కుటుంబాల్లో లోపించడం వల్లే ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు పుట్టుకొస్తున్నాయి. పాశ్చాత్య సంస్కృతి కారణంగా అదే విద్యాబోధన వల్ల ఎంతో సనాతనమైన హిందూ ధర్మాన్ని పిల్లలకు ఒంటబట్టించాకపోవడంతో చిన్నప్పటినుండే గీతా జ్ఞానం ఉండకపోవడంతోపాటు ఏ సందర్భానికి ఏది చేయాలో కూడా తెలియని దయనీయ స్థితికి మనం వెళ్తూ మన చిన్నారులను తీసుకెళ్తున్నాం. అందుకే స్వధర్మ నిష్ఠ ఎవరికీ కలగట్లేదు. ఆఖరికి ‘గోవింద’ నామమన్నా, రామ్‌ నామ్ సత్య హే అనే నినాదాలు వినిపించినా కొందరికి శవయాత్రయే గుర్తుకొచ్చే పరిస్థితి ఏర్పడింది.

ఈ విషయంపై ఇప్పటికైనా జనాలు ఆలోచించి, ఈ నీచ సంస్కృతినుండి బయటపడాల్సిన అవసరం ఎంతో ఉంది.

-శరత్‌చంద్ర

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • యర్రమిల్లి రామభద్ర శర్మ says:

    శుభోదయం,
    చాలా బాగా చెప్పారు. క్లుప్తంగా ఉంది. అర్ధం అయ్యేలా ఉంది. మీరు వాడిన తెలుగు ఫాంట్ బావుంది. ఎలా దిగుమతి చేసుకోవాలి తెలియజేయండి. నమస్కారం.