నిరంతర పోరాట యోధుడు భూమా

Bhuma Nagri Reddy: A fighter all along

Bhuma Nagri Reddy: A fighter all along

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే  భూమా నాగిరెడ్డి అనూహ్య మృతితో ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, అభిమానుల తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 53 ఏళ్లకే ఆయన గుండెపోటుకుగురై మృతిచెందడం పట్ల తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లె అనే ఒక మారుమూల గ్రామంలో భూమా బాలిరెడ్డి , ఈశ్వరమ్మ దంపతులకు భూమా నాగిరెడ్డి, జనవరి 8, 1964లో జన్మించారు. ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబ కక్షల రాజకీయాల కారణంగా తన తండ్రి బాలిరెడ్డి నాగిరెడ్డిని చెన్నైలోని వెలంకన్ని ప్రైవేట్ పాఠశాలలో 10+2 చదివించారు. అనంతరం బెంగళూర్ లో నాగిరెడ్డి వైద్య విద్యను అభ్యసిస్తున్న సమయంలో తన తండ్రి హత్యకు గురి కావడంతో తిరిగి వచ్చేశారు. ఈ సంఘటన కారణంగా ఆయన జీవితం మొత్తం మారిపోయి రాయలసీమలో ఒక ప్రఖ్యాత రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఈ తరుణంలో సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి యస్.వి.సుబ్బారెడ్డి కుమార్తె శోభారాణితో వివాహం అయింది.

1984లో భూమా నాగిరెడ్డి తొలిసారిగా రాజకీయరంగ ప్రవేశం చేశారు. తొలుత సొసైటీ అధ్యక్షునిగా పనిచేసిన ఆయన తర్వాత ఎంపీపీగా ఎన్నికయ్యారు. కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉన్న ఆయన సోదరుడు భూమా శేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణంతో భూమా ఈ స్థానానికి ఎంపికయ్యారు. 1992లో ఆంధ్రప్రదేశ్ శాసనసభకు మధ్యంతర ఎన్నికలలో గెలుపోంది తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా 1996లో మధ్యంతర ఎన్నిక జరిగిన నంద్యాల లోక్ సభ నియోజకవర్గానికి పి.వి.నరసింహారావుపై పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ ఆయనను ఎంపిక చేసింది. ఈ పరిణామంతో నాగిరెడ్డి మరింత వెలుగులోకి వచ్చారు. నంద్యాలతోపాటు బరంపురం స్థానాన్నికూడా గెలుచుకున్న పీవీ నంద్యాల స్థానానికి రాజీనామా చేయడంతో జరిగిన ఉపఎన్నికలో నాగిరెడ్డి గెలుపొందారు. ఆ తరువాత 1998, 1999 లలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఆయన నంద్యాల నియోజకవర్గం నుండి గెలుపొందారు.

తొలుత టీడీపీలో ఉన్న నాగిరెడ్డి , తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి అక్కడి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 2014లో వైఎస్సార్‌సీపీ టికెట్‌పై భూమా నాగిరెడ్డి నంద్యాల ఎమ్మెల్యేగా గెలుపోందారు. 2014లో భార్య శోభానాగిరెడ్డి రోడ్డు ప్ర‌మాదంలో మృతి చెందడంతో ఆళ్లగడ్డ నియోజకవర్గానికి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. నాగిరెడ్డి కూతురు అఖిలప్రియ వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ పై ఆళ్లగడ్డ శాసనసభ్యురాలిగా ఎన్నికయ్యారు. 2016లో కూతురు అఖిలప్రియతో కలిసి భూమా తెలుగుదేశం పార్టీలో చేరారు. శోభ మృతి తర్వాత భూమా నాగిరెడ్డి మానసికంగా కుంగిపోయారు. అనారోగ్యం కారణంగా ఆయనకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది.

తెలుగుదేశం పార్టీ తరపున భూమా నాగిరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ నేపధ్యంలో శనివారం విజయవాడకు వెళ్ళి ముఖ‍్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వివిధ అంశాలపై చర్చించారు. అంతర్గత విభేదాల కారణంగా పార్టీకి నష్టం కలగకూడదన్న ఉద్దేశంతోనే శిల్పా చక్రపాణికి తన మద్దతు తెలుపుతున్నట్లు చంద్రబాబుని కలిసి స్పష్టం చేశారు. అనంతరం రాత్రి బయలుదేరి ఆళ‍్లగడ‍్డకు వచ్చారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నా ఆయనకు కేబినెట్‌ పదవి లభించలేదనే అసంతృప్తి మాత్రం అలాగే ఉండిపోయిందని తన అనునాయులు చెబుతుంటారు. ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పలుమార్లు చర్చలు కూడా జరిపారు. శనివారం నాడు ముఖ్యమంత్రిని కలసినప్పుడు మంత్రి పదవి ప్రస్తావన వచ్చిందని, ఫిరాయింపులదారుల చేత ప్రమాణం చేయించడానికి గవర్నర్ నరసింహన్ విముఖంగా ఉన్నారని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది. దాంతో ఆయన మనస్తాపానికి గురైనారని సన్నిహతులు చెబుతున్నారు. ఈలోగానే ఆయన అకాల మరణం చెందడం అందరినీ విస్మయానికి గురిచేసింది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.