టార్గెట్ తెలంగాణా మొదలైంది

BJP Chief Amit Shah Target Telangana 3 Days Tour started in nalgonda District aiming MIM and TRS

BJP Chief Amit Shah Target Telangana 3 Days Tour started in nalgonda District aiming MIM and TRS

దక్షిణాదిలో పాగా వేయడానికి తెగ ఉవ్విళ్ళూరుతున్న భారతీయ జనతాపార్టీ తెలంగాణానుండే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అందులోభాగంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తెలంగాణాలో పర్యటిస్తున్నారు. ఈరోజు మొదలైన పర్యటన బుధవారం వరకు నల్లగొండ జిల్లాలోని  రాజకీయవర్గాల్లోనే కాకుండా ఇతర రంగాలకు చెందిన ప్రముఖుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మౌలికంగా రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు అమిత్‌షా ఈ పర్యటనకు వచ్చినప్పటికీ, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అధ్యక్షుడిగా ఇది రాజకీయంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.

ఢిల్లీ నుండి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాకు విమానాశ్రయంలో రాష్ట్ర నాయకులు లక్ష్మణ్‌, చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్‌ ఘనస్వాగతం పలికారు.  విమానాశ్రయం నుంచి నేరుగా నల్గొండ జిల్లా చుండూరు మండలం తెరటుపల్లి రోడ్డు మార్గంలో చేరుకున్నారు. అనంతరం మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటించారు.  ఈ సందర్భంగా అక్కడ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి బీజేపీ దివంగత నాయకుడు గుండగోని మైసయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలంగాణలో కిందస్థాయిలోకి వెళ్లడం లేదని అమిత్‌ షా అన్నారు. తెరట్‌పల్లిలో స్వచ్ఛభారత్‌ జరగడం లేదని, మరుగుదొడ్లు లేవని విమర్శించారు. కేంద్ర పథకాలు కిందస్థాయికి చేరడం లేదనటానికి మరుగుదొడ్లు లేకపోవడమే నిదర్శనమని ఎద్దేవా చేశారు. తెలంగాణలోని బీజేపీ కార్యకర్త ఇంటింటికి వెళ్లి పార్టీ ఆశయాల గురించి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం అభివృద్ధి సాధించినట్లే తెలంగాణలో కూడా జరగాలని అన్నారు. అంతేగాక ప్రధాని మోదీ అందరి కోసం, అందరి అభివృద్ధి కోసం పని చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. అందుకోసమే  మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో పర్యటించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామన్నారు.

సమావేశం తర్వాత అమిత్‌ షా ఎస్సీ కాలనీలో సహపంక్తి భోజనం చేశారు. పార్టీ కోసం కార్యకర్త మైసయ్య ప్రాణాలు విడిచారని ఆయన గుర్తు చేసుకున్నారు. అనంతరం గ్రామంలోని కొన్ని ఇళ్లకు వెళ్లిన అమిత్‌ షా …అక్కడ స్థానికులతో మాట్లాడారు. ఆ తర్వాత అమిత్‌ షా బూత్‌ స్థాయి కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. బూత్‌, గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ అధ్యక్షులు ఒకే వేదికపైకి రావటం అరుదైన విషయమని చెప్పుకొచ్చారు అమిత్‌షా.

Have something to add? Share it in the comments

Your email address will not be published.