ఆక్వాకాటు.. కాగ్‌ పోటుతో సభ టాటా! కాగ్‌పైనా కుట్ర ముద్ర వేస్తారా?

Budget Session Bogged down Aqua deaths, CAG indictment

ఈ శాసనసభ సమావేశాలు మొత్తంపైన ప్రభుత్వానికి చుక్కెదురుగానే నడిచాయి. వరుసగా జరిగిన ప్రతికూల పరిణామాలు ఉక్కిరి బిక్కిరి చేశాయి. ఆర్టీఎ కమిషనర్‌పై దాడి, నారాయణ హైస్కూలులో లీకేజీ, మొగల్తూరు ఆక్వా ఫ్యాక్టరీలో విషవాయువుల ధాటికి కార్మికుల మృతి అన్నీ ఆత్మరణక్షలో పడేశాయి. ఈ మద్యలో మంత్రి పత్తిపాటి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలూ అట్టుడికించాయి. చాలా విషయాల్లో అధికార పక్షం క్షమాపణలు విచారణల వరకూ వెళ్లవలసి వచ్చింది. ఎవరినైనా వదిలేదిలేదని తమ ఎంపిలు మంత్రుల గురించి మాట్లాడాల్సి వచ్చింది. ఎన్నికల ముందు సంవత్సరంలో ఇది ఎదురుదెబ్బే.

ఎందుకంటే వైసీపీ వ్యూహలోపాలను ఉపయోగించుకుని లేదా తమ వారితో దాడి చేయించి ప్రభుత్వం ఆయా సందర్భాల్లో గట్టెక్కి వుండొచ్చు గాని బలహీనంగా సమర్థించుకోవడం స్పష్టంగా కానవచ్చింది. ఇది తమకు చాలా బ్యాడ్‌ పీరియడ్‌ అని పాలకపక్షీయులు వాపోయారు గాని వాస్తవానికి బ్యాడ్‌విధానాలే ఇందుకు కారణం.తప్పులు గుర్తించి నిజాలు రాబట్టేందుకు నివారించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఎంతో బావుండేది. దానికి బదులు ఎదురుదాడికి దిగారు. ఆ క్రమంలో అనవసరంగా జగన్‌పై పదే పదే దాడి చేసి ఆయన కూడా అడ్డం తిరిగేలా చేశారు. తన ఆస్తులు కేసులు విద్యార్హతలు అన్ని విషయాలపైన జగన్‌ సూటిగానే మాట్లాడారు గాని వాటిని ఖండించే పరిస్థితి లేకుండా పోయింది. అనుభవం లేదని చెప్పబడే జగన్‌ తనను తాను ముఖ్యమంత్రితో ముఖాముఖి సవాలు చేసే పరిస్థితి తీసుకురాగలిగారు. నిరాకరించిన చర్చలను నిరసనతో మళ్తీ మొదలు పెట్టించారు. నిస్సందేహంగా ఇది ప్రతిపక్ష విజయమే.

పులిమీద పుట్రలా ఈ సమయంలోనే కాగ్‌ నివేదిక వచ్చింది. ప్రతిపక్షాలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నట్టు పట్టిసీమ పనులలో 109 కోట్లు అదనంగా వ్యయమైనట్టు, గుత్తేదార్లకు అయాచితంగా లాభం కలిగినట్టు ఆక్షేపించింది. పుష్కరపనుల్లో మరో 21 కోట్లు దుబారా తేల్చింది. ఎక్సయిజ్‌ రేట్ల చెల్లింపు కింద 14 కోట్ల అయాచిత లాభం, కార్మిక సంఘాల సంక్షేమ నిధిని తప్పుగా బదలాయించడం వల్ల మరో 14 కోట్లు కాంట్రాక్టర్ల పరమైనాయని అభిశంసించింది. మీడియా కథనాలు అబద్దమనీ, ప్రతిపక్షం విమర్శలు అభివృద్దికి అడ్డు అని ఆరోపించిన ప్రభుత్వం ఇప్పుడు కాగ్‌కు కూడా అదే కుట్ర ట్యాగ్‌ వేస్తుందా మరి?

తెలకపల్లి రవి

Have something to add? Share it in the comments

Your email address will not be published.