సినారె ‘అమర సాహితీ ప్రస్థానం’

C Narayana Reddy an Unparalleled personality in Telugu literary world

“నేను పుట్టకముందే నెత్తిమీద నీలితెర కాళ్ళకింద ధూళిపొర ఆ తెరకు అద్దిన అద్దాల బిళ్లల్లో మిణుగురులు కనురెప్పలు మిటకరించాయి చిచ్చుముద్దల్లోంచి చిమ్ముకొచ్చిన పచ్చి వెలుగులు పాలమీగడల్లా పరుచుకున్నాయి’ అంటూ డాక్టర్ సి. నారాయణ రెడ్డిగారు, భూమ్యాకాశాల పుట్టుక నుంచి మొదలై… కాలం స్వరూపాన్ని, మనిషి వికాసాన్ని, చైతన్యాన్ని, ఆ చైతన్యం ప్రదర్శించిన విశ్వరూపాన్ని అనేక విధాలుగా తన ‘విశ్వంభర’ గ్రంథంలో ఆవిష్కరించారు.

C Narayana Reddy an Unparalleled personality in Telugu literary world

మనసు శక్తి ఒక వ్యక్తిగా సాగితే జీవిత చరిత్రగా.. సమష్టిగా సాగితే సమాజ చరిత్రగా… ఎలా కనిపిస్తుందో సినారె కలం దాన్ని ఒడిసి పట్టుకుని మరీ మనముందు నిలుపుతుంది. మానవ ప్రస్థానంలో మజిలీలు, ఆ మజిలీల పునాదుల మీద భవిష్యత్తరాలు సాధించిన విజయాలు, ఆ విజయాల సోపానాల మీద పయనించిన మానవుడు పొందిన అనుభవాలు… అన్నీ ‘విశ్వంభర’ పద్య కావ్యంలో పాఠకుల కళ్లముందు సాక్షాత్కరింపజేసిన మహనీయుడు సినారె. అంతటి మహనీయుడు మనల్ని ఈలోకంలో వదిలి ఒంటరిగా వేరే లోకాలకు వెళ్ళిపోయారు. ఈ  సందర్భంగా ఆయన సాహిత్య జీవన ప్రయాణంలోకి ఓసారలా తొంగిచూసే చిరు ప్రయత్నం…

విశ్వంభర అంటే మానవుడు

విశ్వంభర అంటే భూమి, ప్రపంచం అని అర్థాలు. అయితే ఇది కేవలం భూగోళం అనే మట్టిముద్దను గురించిన కావ్యం కాదు. ఆ మట్టిలో పుట్టిన మనిషి అనే ప్రాణి పొందిన వికారాన్ని, వికాసాలను గురించి ఆ వికాస క్రమంలో ఆ మనిషి చైతన్యస్థాయి గురించి, ఈ చైతన్యానికి మూలమైన మట్టితో..

సినారెగా ప్రసిద్ధి చెందిన సింగిరెడ్డి నారాయణరెడ్డి.. ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త. ఈయన తెలుగు సాహిత్యానికి చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకు 1988వ సంవత్సరంలో విశ్వంభర కావ్యానికిగాను భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారమయిన “జ్ఞానపీఠ” అవార్డును అందుకున్నారు. రాజ్యసభ సభ్యునిగా కూడా నియమితులయిన సినారే రాసిన పాటలు తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందాయి.

కరీంనగర్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామమైన హనుమాజీపేటలో 1931వ సంవత్సరం జూలై 29వ తేదీన జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో పోస్టుగ్రాడ్యుయేషన్ డిగ్రీ, డాక్టరేట్ డిగ్రీలను పొందారు. ఆ తరువాత ఆరంభంలో సికింద్రాబాదులోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత నిజాం కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.  ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారములు పొందారు.1977లో పద్మ పురస్కారాన్ని అందుకున్న ఆయన.. 1978లో కళాప్రపూర్ణ, 1988లో విశ్వంభర కావ్యానికిగానూ ప్రఖ్యాత జ్ఞానపీఠ్‌ పురస్కారాన్ని అందుకున్నారు. 1992లో పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని పొందారు.

మనల్ని ఆశ్చర్యానికి గురిచేసే అంశమేంటంటే… సినారె డిగ్రీ వరకూ ఉర్దూ మాధ్యమంలోనే విద్యను అభ్యసించారట. అయితే ఆ తరువాత తెలుగు సాహిత్యాన్ని ఒంటబట్టించుకున్న ఆయన అనేక రచనా అద్భుతాలను సృష్టించారు. ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ తరువాత జ్ఞానపీఠ అవార్డును పొందిన తెలుగు సాహితీకారుడు సినారేనే కావడం తెలుగువారికి గర్వకారణం.  సినారె “విశ్వంభర”ను రాజాలక్ష్మీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరియు తన ప్రియమిత్రులైన శ్రీ రమణయ్య రాజా గారికి అంకితమిచ్చారు. ఈ పద్య కావ్యాన్ని మొట్టమొదటిసారిగా 1980వ సంవత్సరంలో ముద్రించారు. ఈ కావ్యాన్ని కొన్ని విశ్వవిద్యాలయాలు ఎం.ఏ. స్థాయిలో పాఠ్యగ్రంథంగా నిర్ణయించాయి.

ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా శోభ పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి జనశక్తి పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ప్రహ్లాద చరిత్ర, సీతాపహరణం వంటి పద్య నాటికలు, భలే శిష్యులు తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో నవ్వని పువ్వు సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రె తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.

రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. సినారె పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని ‘నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ’ అనే పాటతో ప్రారంభించి తుది శ్వాస విడిచేవరకు 3500 పాటలు రచించారు.

అంతేగాక సినారె రచించిన గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదం అయ్యాయి. ఆయనే స్వయంగా హిందీ, ఉర్దూభాషల్లో కవితలు అల్లారు. అమెరికా, ఇంగ్లండు, ఫ్రాన్స్,రష్యా, జపాన్, కెనడా, ఇటలీ, డెన్మార్క్, థాయ్‌లాండ్, సింగపూర్, మలేషియా, మారిషస్, యుగోస్లోవియా, ఆస్ట్రేలియా, గల్ఫ్‌వంటి అనేక దేశాలను సందర్శించారు. అంతేగాక 1990లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నారు సినారే.

అవయవాలు చస్తాయి కాని ఆలోచనలు చావవు..  ‘మట్టి మనిషి ఆకాశం’ గ్రంథంలో డాక్టర్‌ సింగిరెడ్డి నారాయణరెడ్డి రాసిన మాటలివి. బురద నవ్వింది కమలాలుగా పువ్వు నవ్వింది భ్రమరాలుగా…  పుడమి కదిలింది చరణాలుగా …. జడిమ కదిలింది హరిణాలుగా …. నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది…. నింగికి అడుగులు కదిలి నేలనందుకుంది… ప్రకృతి నేపథ్యాన్ని అక్షర మాలలుగా మలచిన కవి సి.నారాయణరెడ్డి సృష్టి అవును. కవివర్యుడు భౌతికంగా చనిపోయారుగానీ అక్షరాల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారు. సినారె- సుశీల దంపతులకు నలుగురు ఆడపిల్లలు. గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య సుశీల మరణానంతరం ఆమె పేరుమీద ఔత్సాహిక సాహితీకారులకు ఏటా అవార్డులు అందిస్తున్నారు సినారె.

Have something to add? Share it in the comments

Your email address will not be published.