“తెలుగు వెలుగు” సినారె

C Narayana Reddy: The guiding light of Telugu Poetry

ఆయన జీవితమంతా తెలుగు కవిత్వాన్ని వెలిగించాడు. తెలుగు కవిత్వము ఆయన జీవితాన్ని వెలిగించింది. అతని కవితలు వెలుగులు పంచాయి, ఆయన బోధనలు ఎందరికో వెలుగులు నింపాయి. తెలంగాణ మారుమూల తెలుగు పల్లెలో వికసించిన ఆకుసుమం, అనంతమంతా అక్షర పరిమళాన్ని గుభాళించింది.

చదివింది ఉర్ధూ మీడియం. ఒదిగింది తెలుగు తల్లి ఒడిలో. అదే అతని బడి. ఆ చదువుల తల్లి ఈ పల్లెటూరి పిల్లవాడిని “ఙ్ఞానపీఠం” దాకా తీసుకెళ్ళింది, రాజ్యసభ సభ్యుడిగా చేసింది, విశ్వవిద్యాలయాలకు కులపతిని చేసింది. కవిదళపతిని చేసింది.

C Narayana Reddy: The guiding light of Telugu Poetry

సినారె…. ఎంత బాగ రాసినారే” అని అందరితో అనిపించుకున్న గొప్పకవి, అధ్యాపకుడు, ఆచార్యుడు, వక్త, సింగిరెడ్డి నారాయణరెడ్డి. డా: సి.నారాయణ రెడ్డి గా విశ్వమంతా విఖ్యాతి చెందిన ‘విశ్వంభరుడు’ ఙ్ఞానపీఠుడు మన సి.నా.రె.

చిన్నప్పుడు తెలుగు పల్లెలో విన్న హరికథలు, జంగం కథలు సినారెలోని కళాహృదయాన్ని తట్టిలేపాయి. దాశరథి సాన్నిహిత్యం హైదరాబాద్ లో కవిగా నిలబెట్టింది. నారాయణ రెడ్డిగారి సినిమారంగ ప్రవేశం నందమూరి తారక రామారావు అనే నట సింహద్వారం ద్వారా జరిగింది.అందుకే ఆయన “నేను దొడ్డిదారిన రాలేదు- రెడ్డిదారిన వచ్చాను”అని అంటుంటారు.

గులేబకావళికథ” తో ఆయన సినీగీత రచనా ప్రస్థానం ప్రారంభమైంది.”నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని” అంటూ నన్ను నిన్ను అందర్ని ఆ పాటతో దోచిన దొర నారాయణరెడ్డి.

సినిమా పాటకు ‘కావ్యగౌరవం’ తీసుకువచ్చిన కవి కుల తిలకుడు సి.నా.రె. ఈనాటి భాషలో చెప్పాలంటే ఆయన ఎంట్రీ అదుర్స్….ఆ సినిమాకు  అన్నిపాటలు ఆయనే రాసారు.(సినిమా పరిభాషలో సింగిల్ కార్డ్) ఆ సినిమా హిట్, ఆపాటలన్నీహిట్, ఆయన సూపర్ హిట్.

ఆ చేతికి లొంగని కవితలేదు. అది విని పొంగని మనిషిలేడు. గీతం, గేయం, గీతిక, సంగీత రూపకం, కథాకావ్యాలు, గేయనాటకం…అన్నీ ఆ కవి దివిలో పొంగిపొర్లాయి. సి.నా.రె కు ప్రకృతి అంటే ఇష్టం, పల్లె అంటే ఇష్టం, పాట అంటే ఇష్టం, పాఠం అంటే ఇష్టం, నదీనదులంటే ఇష్టం, శిష్యులంటే ఇష్టం ఇవన్నీ ఆయన్ను గొప్ప కవిగా, గొప్ప మనిషిగా నిలబెట్టాయి. ఆ ప్రకృతి ప్రేమ, ఆ విశ్వమానవ హృదయం “విశ్వంభర” రాయించింది. ఙ్ఞానపీఠాన్ని ఎక్కించింది. సాహిత్యం, సంగీతం, భోధన….ఇలా ముప్పేటగా వారి జీవితం వికసించింది. కవికి గ్లామర్ తీసుకువచ్చారాయన. దేవులపల్లి ఆహార్యం, పోతన కవితా  ప్రవాహం, శ్రీనాధుని రసాత్మక జీవితం నారాయణరెడ్డి గారికి ప్రేరణాత్మక అంశాలు. కావ్యాలే గాక, జీవితమనే కావ్యాన్నీ అందంగా మలచుకున్న శిల్పి సి.నా.రె. ఆయన ఎక్కని ఎత్తులు లేవు పొందని కీర్తిలేదు. సమయం, అక్షరం, మానవ సంబంధాలు….అన్నింటినీ సద్వినియోగం చేసుకున్న గెలుపు వీరుడు ఆయన.” పంచెకట్టుటలోన ప్రపంచాన మెనగాడు….ఇంకెవ్వరయ్య తెలుగు వాడు” అని చెప్పిన ఆయన పంచెకట్టులో తెలుగుతనాన్ని కళ్ళకు కట్టించిన తెలుగు మూర్తి సి.నా.రె. ఆయన రాసిన పాటలన్నీ ఆయనకు ఇష్టం, మనకూ ఇష్టం, “తోటలో నారాజు” అనే పాట ఎందుకో ఆయకు చాలా ఇష్టం ఆ “కళ్యాణి” రాగం కూడా ఎంతో ఇష్టం. ఆపాటను ఎవరు హమ్ చేసిన పదేపదే పాడించుకొని వినేవారు.

చెళ్ళపిళ్ళ, విశ్వనాథ సాహిత్యలోకంలో ఎంతో గెలిచారు. వారి శిష్యులు అంతే గెలిచారు. అలాగే నారాయణరెడ్డిగారి శిష్యులందరూ జీవితంలో ఎంతో గెలిచారు. ఆచార్య ఎన్.గోపి, ఆచార్య ఎల్లూరు శివారెడ్డి, డా: పరుచూరి గోపాలకృష్ణ, టి.సుబ్బిరామిరెడ్డి, జైపాల్ రెడ్డి….ఇలా రంగం ఏదైనా ఆయన శిష్యులందరూ ప్రయోజకులయ్యారు, విజయులయ్యారు.

తెలుగు గజల్స్ గజ్జకట్టి ఆడాయి, గజల్ శ్రీనివాస్, సి.నా.రె గజల్ మానసపుత్రుడు అయ్యాడు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ విశాఖ సాగరతీరంలో నారాయణరెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించారు.

తెలుగు జాతి మనది ….నిండుగ వెలుగు జాతి మనది”అని అప్పుడు చెప్పాడు.”తెలుగు జాతి మనది రెండుగ వెలుగుజాతి మనది”అని ఇప్పుడు చెప్పాడు. కుందుర్తి ఆంజనేయుల మాటల్లో”నారాయణరెడ్డి తిలక్ లాగా రెండంచుల పదును గల కత్తి,కవిత్వంలో అగ్నిరగిలించగలడు…అమృతం కురిపించగలడు”.

మనకు అమృతం కురిపించి, ”దివిజకవివరుల గుండియల్ దిగ్గురనగ…. అరగుచున్నాడు సి.నా.రె అమర పురికి”….’తెలుగు వెలుగు’ సింగిరెడ్డి నారాయణరెడ్డికి వొంగివొంగి అర్పించే అచ్చపు జోతలివే! వెలిగించే అక్షర జ్యోతులివే.

మా శర్మ

Have something to add? Share it in the comments

Your email address will not be published.  • Dr RV Kumar says:

    గొప్ప మనిషికి గొప్ప నివాళి