మిర్చి రైతులను కరుణించిన కేంద్రం

Centre responds to Mirchi Farmers plight announces 5000 support price per quint

Center responds to Mirchi Farmers plight announces 5000 support price per quint

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో గిట్టుబాటు ధరలేక ఆందోళన కార్యక్రమాలు చేపట్టి ప్రభుత్వానికి ముచ్చెమటలు తెప్పిస్తున్న మిర్చి రైతుల గోడును కేంద్రం పట్టించుకుంది. గిట్టుబాటు ధర లేక మండిపోతున్న మిర్చి రైతుకు కేంద్రం కాస్త ఊరటనిచ్చే మాట చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల‌ను ఆదుకోవాల‌ని కేంద్రమంత్రి వెంక‌య్య‌నాయుడు కేంద్ర వ్య‌వ‌సాయశాఖ మంత్రి రాధామోహ‌న్ సింగ్‌ను కోరడంతో ఆయన దీనిపై సానుకూలంగా స్పందించారు.

తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం మిర్చి రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్ష‌న్ స్కీమ్ ద్వారా మిర్చి కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాధామోహన్  ప్రకటించారు. మే 2 నుంచి మే 31 వ‌ర‌కు కొనుగోళ్లు చేస్తామ‌ని రాధామోహ‌న్ సింగ్ చెప్పారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఏజెన్సీల ద్వారానే మిర్చి కొనుగోలు ఉంటుంద‌న్నారు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్.

మిర్చి క్వింటాలుకు 5 వేల రూపాయల మద్దతు ధర ఇస్తామని అదనపు ఖర్చుల కోసం మరో 1500 రూపాయలు చెల్లిస్తామని వెల్లడించారు కేంద్రమంత్రి. అంతేగాక ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 50 50 శాతం భరించాలని స్పష్టంచేశారు.

గత కొన్నిరోజులుగా తెలుగురాష్ట్రాలలో మిర్చి రైతులు మద్దతు ధర కోసం నిరసనలు, ధర్నాలు చేస్తున్న పరిస్థితిని వెంకయ్యనాయుడు వ్యవసాయశాఖామంత్రి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల ఈ మాత్రం స్పందన కనిపించింది. అంతేగాక మిర్చికి మద్దతు ధర విషయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు రైతులకు మద్దతు ధర ప్రకటించే విషయంపై పెద్దగా స్పందించలేదు. అయితే కేంద్రం మాత్రం ఈ విషయంపై కాస్త స్పందించి అన్నదాతల కడుపుమంటను చల్లార్చడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది.

 

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.