కేంద్రమంత్రి అనిల్ దవే కన్నుమూత

Central Minister Anil Madhav Dave passes away with ill health

Central Minister Anil Madhav Dave passes away with ill health

కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అనిల్ మాధ‌వ్ ద‌వే ఈరోజు ఉదయం క‌న్నుమూశారు. 61 ఏళ్ల ద‌వే ఈ ఏడాది జనవరిలో నిమోనియాతో తీవ్రంగా బాధపడ్డారు. అప్పటినుంచి ఆయన ఆరోగ్యంలో మార్పులు వచ్చాయి. గురువారం ఉదయం ఒంట్లో నలతగా ఉందని ఇంట్లో చెప్పడంతో ఆయనను కుటుంబసభ్యులు ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు దవే.

1956లో జూలై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌‌లో దవే జన్మించారు. గుజరాతీ కళాశాల నుంచి ఎం.కామ్‌ పట్టాను పొందారు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరిన దవే.. నర్మదా నది సంరక్షణ కోసం పోరాడారు. మధ్యప్రదేశ్‌ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతేడాది జరిగిన మంత్రివర్గ విస్తరణలో ప్రధానమంత్రి మోదీ.. దవేకు పర్యావరణ, అటవీ శాఖ బాధ్యతలను అప్పజెప్పారు. నిన్న చాలా సమయం ఆయన సమీక్షా సమావేశాలతో గడిపారు. ఆ తర్వాత పాలసీల గురించి ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సాయంత్రం భేటీ అయ్యి చర్చించారు.  ఇవాళ ఉద‌యం హ‌ఠాత్తుగా తుది శ్వాస విడిచారు. పార్ల‌మెంట్‌లోని అనేక క‌మిటీల్లో ఆయ‌న స‌భ్యుడిగా ఉన్నారు. గ్లోబ‌ల్ వార్మింగ్‌, క్లైమెట్ చేంజ్ పార్ల‌మెంట్ క‌మిటీలో దవే కీల‌క స‌భ్యుడిగా ఉన్నారు.

కేంద్ర మంత్రి ద‌వే మృతి ప‌ట్ల ప్ర‌ధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. దవే మృతి వ్యక్తిగతంగా తనకు తీవ్ర నష్టమని, నిన్న సాయంత్రం వరకూ ఆయన తనతో కీలక విధానాలు చర్చించినట్లు నరేంద్ర మోదీ తెలిపారు.  ద‌వే మృతి త‌న‌ను షాక్‌కు గురిచేసిన‌ట్లు ప్ర‌ధాని ట్వీట్ చేశారు. ప్ర‌జాసేవ‌కుడిగా ద‌వేను స్మ‌రించుకుంటామ‌న్నారు. ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం ద‌వే చాలా ప‌ట్టుద‌ల‌తో ప‌నిచేసేవార‌న్నారు. బుధ‌వారం సాయంత్రం కూడా త‌న‌తో విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు మోదీ చెప్పారు.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.