మంత్రివర్గంలో ‘జంప్ జిలానీ’లకు పెద్దపీట

Chandrababu gcabinet reshuffling done with 11 new faces inducted and 5 out
 Chandrababu gcabinet reshuffling done with 11 new faces inducted and 5 out
అంతా అనుకున్నట్లుగానే జరుగుతోంది. చంద్రబాబు ఏరకంగా పావులు కదపాలని అనుకుంటున్నారో ఆ విధంగానే పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం మంత్రిమండలిలో ఉన్న మంత్రుల పనితీరుపై గత కొంతకాలంగా రిపోర్టులు తెప్పించుకున్న చంద్రబాబు,  ముఖ్యంగా ప్రభుత్వాన్ని వివిధ సందర్భాల్లో ఇరుకునపెట్టిన మంత్రులను టార్గెట్‌ చేసుకున్నారు. దీనికితోడు మంత్రుల పనితీరు అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకున్న చంద్రబాబు ఐదుగురికి ఉద్వాసన పలికారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌ బాబు,  సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి, అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి లను  మంత్రిమండలినుండి  తప్పించడానికి ఇప్పటికే వారి దగ్గరినుండి రాజీనామాలేఖలు తీసుకున్నారట చంద్రబాబు.
టార్గెట్ వైసీపీ:
ఇప్పుడు చంద్రబాబు ఆలోచనలంతా రెండేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల గురించే. 2019 ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకొని రావాలంటే పార్టీపరంగా ఏ అంశాల్లో , ఏ ప్రాంతాల్లో వెనుకబడి ఉన్నమో ఇప్పటికే తెలుసుకున్న బాబు వాటిపై ద‌ృష్టిపెట్టారు. అందులో భాగంగానే క్యాబినెట్లో మార్పులు చేసి వచ్చే ఎన్నికలకు సమాయత్తమయ్యే క్యాబినెట్‌ను రెడీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి బలంగా ఉండి, టీడీపీకి గట్టి దెబ్బ తగిలిన రాయలసీమలో పాగా వేయాలని బాబు ఆలోచిస్తున్నారు. కేవలం అనంతపురం జిల్లాలో మాత్రమే టీడీపీకి కాస్త చెప్పుకోదగ్గ సీట్లు వచ్చాయి. అందుకే అక్కడ పార్టీ క్యాడర్‌లో కొత్త ఉత్సాహం నింపేందుకు చర్యలు ప్రారంభించారు. సీమలో జగన్‌ను ఢీ కొట్టాలంటే వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన ఎమ్మెల్యేలకు మంత్రిమండలి రూపకల్పనలో పెద్దపీట వేశారు. అందులోభాగంగా అమర్‌నాథ్ రెడ్డి, ఆదినారాయణ్ రెడ్డి, భూమా అఖిలప్రియ, సుజయక్రిష్ణ రంగారావులను మంత్రులుగా చేసి వైసీపీపై పోరాటానికి రెడీ చేస్తున్నారు చంద్రబాబు.
పార్టీ విధేయులకే:
వైసీపీ నుండి వచ్చిన జంప్‌జిలీనీలతోపాటు పార్టీలో మొదటి నుండి ఉన్న విధేయులకి పట్టం కట్టాలని నిర్ణయంచుకున్నారు. అందులోభాగంగా కళా వెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిలను లిస్ట్‌లో చేర్చారు. వీరితోపాటు క్యాబినెట్‌లో యువతకు ప్రాధానత్యత ఇస్తున్నట్లు చూపించుకోవడానికి నారా లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారు. అంతేగాక టీడీపీకి పార్టీ ఆవిర్భావం నుండి పట్టుకొమ్మగా ఉన్న బీసీలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చూపించడానికి క్యాబినెట్లో వారికి పెద్దపీట వేసి ఎన్నికల దిశగా పార్టీ క్యాడర్‌ను బలోపేతం చేయాలని ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు.

క్యాబినెట్‌లోకి వచ్చే కొత్త మంత్రులు..?

 1. నారా లోకేష్
 2. అఖిల‌ప్రియ‌
 3. కళా వెంకట్రావు
 4. కాల్వ శ్రీనివాసులు
 5. సుజ‌య క్రిష్ణ‌ రంగారావు
 6. అమర్‌నాాథ్ రెడ్డి
 7. సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి
 8. న‌క్కా ఆనంద్ బాబు
 9. పితాని సత్యనారాయణ
 10. జవహర్
 11. ఆదినారాయణరెడ్డి

మంత్రుల ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నాయి. ఆదివారం ఉదయం 9.22 గంటలకు కొత్త మంత్రల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.

Have something to add? Share it in the comments

Your email address will not be published.