బాబు చేతిలో సాక్షి

(పాత చిత్రం)

విజయవాడ: అధికార, ప్రతిపక్ష అధినాయకుల మధ్య నిత్యం అగ్ని రాజుకుంటూనే ఉంది. ఒకరిపై మరొకరు నిందలు వేసుకుంటూ ఎవరికి వారే యమునాతీరే అన్న చందంగా తయారయింది. నువ్వంటే నువ్వని ఒకిరిపై మరోకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. దీనికి తోడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి వ్యవహారశైలి అగ్నిలో ఆజ్యంపోసే విధంగా తయారైంది. అదేంటో తెలుసుకుందాం.

సాక్షి పత్రికకు, ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మధ్య ఉన్న వైరం ఎలాంటిందో అందరికి తెలిసిన విషయమే. సాక్షి పత్రికను చదవొద్దని, సాక్షి టీవీని చూడవద్దని ముఖ్యమంత్రి బహిరంగంగానే హుకుం జారీచేశారని తెలుస్తోంది. సాక్షి పత్రికల్లో వచ్చిన కథనాలపై ఆయనకు కంటి మీద కునుకు లేకుండా పోయింది.

ఇటీవల ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో జిల్లాల వారీగా తెలుగుదేశం పార్టీ నేతలతో సమీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాల టీడీపీ నేతల వ్యవహారశైలి, రాజకీయాలపై సమీక్షించారు. దీంతో వారి అవినీతి వ్యవహారాలు, వర్గ విభేదాలకు సంబంధించి సాక్షి పత్రికలో ప్రచురితమైన కథనాల క్లిప్పింగులను నేతల ముందుంచి కథనాలపై సమాధానం ఏమిటని వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దీంతో నేతలు తమకు వ్యతిరేకంగా సాక్షి పత్రిక కావాలనే రాసిందని చెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ ముఖ్యమంత్రి సంతృప్తి చెందలేదని చెబుతున్నారు. ముఖ్యమంత్రి వద్ద సాక్షి క్లిప్పింగులు చూసి అవాక్కవడం నేతల వంతైంది.

టీడీపీ పార్టీ, ప్రభుత్వంపై ప్రజల స్పందన క్షుణ్నంగా తెలియాలంటే సాక్షి మీడీయా ద్వారానే తెలుస్తుందని ముఖ్యమంత్రి భావించినట్లు తెలుస్తోంది. మిగతా పత్రికలు టీడీపీ కి వ్యతిరేకంగా కథనాలు రాయనప్పటికీ సాక్షి మీడియా ద్వారానే తనకు కావల్సిన సమాచారం దొరుకుతుందని ముఖ్యమంత్రి భావించినట్లుంది. సాక్షి పత్రికను చదవద్దని బహిరంగా చెప్పిన చంద్రబాబే, తన దగ్గర ప్రతులు పెట్టుకోవడం చూసి నేతలు అవాక్యయ్యారని చెబుతున్నారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.