ఉపాధి కోసం ఎవరైనా అమరావతికి రావాల్సిందే: చంద్రబాబు

Chandrababu Signs MOU with Singapore Minister Eeshwaran for Startup zone in Amaravathi

Chandrababu Signs MOU with Singapore Minister Eeshwaran for Startup zone in Amaravathi

ఏపీ సీఎం చంద్రబాబు మళ్ళీ ట్రాక్‌ పైకి వచ్చారు. గత కొన్ని రోజులుగా అస్థిరంగా ఉన్న పరిస్థితులను చక్కబెడుతూ చంద్రబాబు సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ఎంఓయూ చేసుకున్నారు. మంత్రివర్గ విస్తరణతో మొదలైన చికాకులతో విసిగిన చంద్రబాబు ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్ళిన సమయంలో ప్రధాని మోడీ ప్రతిపక్షనేత జగన్‌కు అపాయింట్మెంట్‌ ఇచ్చి భేటీ అవ్వడంతో చంద్రబాబు కాస్త కలవరపడ్డారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే ఢిల్లీలో దిగిన తర్వాత రహస్య మంతనాలు చేసుకొని క్లారిటీ తెచ్చుకున్న చంద్రబాబు తన వర్క్‌ విషయంలో సీరియస్‌నెస్ మరింత పెంచారు.

అందులోభాగంగానే అమరావతి బృహత్‌ ప్రణాళిక రూపకల్పన, స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న సింగపూర్‌ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్‌ బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ఆర్థికాభివృద్ధి, రాజధానిలో స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి, ప్రభుత్వ విభాగాల్లో సామర్థ్యం పెంపు, ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సహకారాన్ని సింగపూర్‌ ప్రభుత్వం అందజేస్తుంది. ఎంవోయూలో భాగంగా ఏపీ ప్రభుత్వం సింగపూర్‌కు 1691 ఎకరాలు అందజేయనుంది. అమరావతిలో 6.84 చదరపు కిలోమీటర్‌ ప్రాంతాన్ని సింగపూర్‌ కన్సార్టియం అభివృద్ధి చేయనుంది. సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి సమక్షంలో ఒప్పంద పత్రాలపై అధికారులు సంతకాలు చేశారు.

ఆ తర్వాత మందడంలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో నేనో మాట చెప్పా. రాజధాని లేదు. కాలేజీలు, పరిశ్రమలు లేవు. దృఢ సంకల్పం.. ఉక్కు సంకల్పం మాత్రం ఉంది. మళ్లీ సింగపూర్‌లాంటి సిటీ నిర్మిస్తానన్నా. ఆ మాట నేడు సఫలీకృతం అవుతుంది. ఎంతో ఆనందంగా ఉంది.’ అని అన్నారు. అంతేగాక రాజధాని అభివృద్ధి పనులకు అడుగడుగునా ఇబ్బందులు, సమస్యలు సృష్టించారు. ప్రజల చొరవ చూపడం వల్ల ఎవరూ ఏమీ చేయలేకపోయారు. ఈ పని సంవత్సరం కంటే ముందే జరగాల్సింది. కానీ కొంతమంది న్యాయస్థానాలను ఆశ్రయించడం, పదే పదే ఆరోపణలు చేయడంతో ఆలస్యమైంది. సంకల్పబలం ఉంటే.. మనలో మంచితనం ఉంటే.. ప్రపంచంలో ఎవరైనా మన తరఫున నిలుస్తారని నిరూపితం అయ్యింది’ అన్నారు చంద్రబాబు.

అంతేగాక అమరావతి పేరుకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని, భూలోక స్వర్గంగా అమరావతిని నిర్మిస్తామని, ప్రపంచంలోని ఐదు నగరాల్లో అమరావతి ఒకటిగా ఉంటుందని స్పష్టంచేశారు చంద్రబాబు. రాజధాని అభివృద్ధికి ధృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నానని, రాజధాని రైతుల త్యాగం వల్లే రాజధాని కల సాకారమైందని సీఎం స్పష్టంచేశారు. సింగపూర్‌ కన్సార్టియం ద్వారా స్టార్టప్‌ ఏరియా అభివృద్ధికి శ్రీకారం చుట్టామని, సింగపూర్‌లాగా అభివృద్ధి చేస్తామంటే ఎగతాళి చేశారని కొంతమంది కోర్టుకెళ్లడం వల్లే రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగిందని చంద్రబాబు వివరించారు. 190 రోజుల్లో తాత్కాలిక సచివాలయాన్ని నిర్మించిన ఘనత ఈప్రభుత్వానిదేనని, ఉపాధి కోసం ఎవరైనా ఇక్కడికి రావాల్సిందేనని చంద్రబాబు అన్నారు.

రాజధాని అభివృద్ధి ప్రాంతంలో సీఆర్డీఏకు 42 శాతం వాటా ఉందని, 2.50 లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని తెలిపారు. దీని వల్ల ప్రభుత్వానికి రూ.8-10 వేల కోట్ల ఆదాయం వస్తుందని చంద్రబాబు స్పష్టంచేశారు.

Have something to add? Share it in the comments

Your email address will not be published.