మిర్చి ఘాటు ఇంకెన్నాళ్ళు??

Chilli Politics Centers Mirchi Politics doesn't help the Chili farmers in two Telugu states

Chilli Politics Centers Mirchi Politics doesn't help the Chili farmers in two Telugu states

 

  • మిర్చి కొనుగోలులో సవాలక్ష నిబంధనలు అవసరమా??
  • రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా మద్దతుధర ప్రకటించారే తప్ప మిర్చి రైతులపై కేంద్రానికి ఎలాంటి ప్రేమ లేదా?

మిర్చి ఘాటుకి కేంద్రం దిగొచ్చినట్లు అందరికీ కనిపించి మద్దతు ధర ప్రకటించేసరికి అంతా సద్దుమణిగిపోయిందనుకుంటుంటే కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. నిజంగా కేంద్రానికి మిర్చి రైతుల బాధలను పట్టించుకోవాలని ఉందా లేక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మిర్చి రైతులు చేస్తున్న ఆందోళనను తమకు మద్దతుగా మరల్చుకొని తమ స్థానాన్ని పదిలపరుచుకోవాలని భావిస్తోందా??? క్వింటాలుకి 5వేల రూపాయలు మద్దతుధర ఇస్తామని కేంద్రమంత్రి ప్రకటించడం, దానికి మరో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అంతా తాను మాట్లాడినందువల్లే మిర్చి రైతులకు ఈ మాత్రం ధరైనా వస్తుందని చెప్పడం అంతా రాజకీయ ఎత్తుగడలో భాగమే తప్ప నిజంగా మిర్చి రైతులపై కేంద్రానికి ఎలాంటి ప్రేమ లేదనేది అర్థమౌతోంది.

ఎందుకంటే క్వింటాలుకి 5వేలు మద్దతు ధర ఇచ్చిన తర్వాత నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి చెరి సగం పంచుకోవడం అంటే చేతులు దులుపుకోవడమేనని అర్థమౌతోంది. అంతేగాక నిజంగా మిర్చి రైతులను ఆదుకోవాలనుకొనే ధృడ సంకల్పమే ఉంటే పండిన మొత్తం పంటను కొంటామని చెప్పకుండా ఏదో నామమాత్రంగా మేం ఇంతేకొంటామని చెప్పడాన్ని రైతులు, రాష్ట్ర నాయకులు తప్పుబడుతున్నారు.

తెలంగాణారాష్ట్రంలో 7 లక్షల మెట్రిక్‌ టన్నుల మిర్చి పండితే 33 వేల మెట్రిక్‌ టన్నులే కొంటామని  కేంద్రం చెప్పడాన్ని తప్పుబడుతున్నారు తెలంగాణా రాష్ట్ర మార్కెటింగ్ శాఖామంత్రి హరీష్‌‌రావు. రాష్ట్ర బిజెపి నేతలు మార్కెట్‌ యార్డులు సందర్శించి మిర్చి క్వింటాకు 10వేల రూపాయల మద్దతుధర ఇవ్వాలని డిమాండ్ చేస్తుంటే, కేంద్రమేమో 5వేల రూపాయలు ప్రకటించి మిర్చి రైతులకు శఠగోపం పెట్టిందని దుయ్యబట్టారు హరీశ్. రాష్ట్రమే మిర్చి కొనుగోలు చేయాలని చెప్పి నష్టాల్లో పాలుపంచుకుంటామని కేంద్రం చెప్పడం సమస్య నుంచి తప్పించుకోవడమేనని మండిపడ్డారు.

అంతేగాక రైతులకు జరుగుతున్న నష్టానికి గతంలో పాలించిన యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. మిర్చి ధరపై స్పష్టత లేనిది భాజపా నేతలకు, దత్తాత్రేయకేనని విమర్శించారు. భాజపా నేతలు రాజకీయ లబ్ధి కోసం మాట్లాడుతున్నారన్నారు. 7 వేలకు మిర్చి కొనుగోలు చేయాలని కోరుతూ ఏప్రిల్ 1న కేంద్రమంత్రి రాదామోహన్‌సింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం మార్చి 31న లేఖ రాసిందని తెలిపారు. మిర్చి, పసుపు పంటల కనీస మద్దతు ధర నిర్ణయించాల్సింది కేంద్రమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా లేఖ రాసినా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిందన్నారు హరీశ్‌రావు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ మిర్చి రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కేంద్రం 5వేల రూపాయల మద్దతు ధర ప్రకటించి మే 2వ తేదీ నుండి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించడంతో రైతులు భారీగా మిర్చిని యార్డుకు తరిలించారు. మిర్చి యార్డులో స్థలం లేకపోవడంతో వాహనాలను దగ్గర్లో ఉన్న ఖాళీ ప్రదేశంలోకి పంపారు. అక్కడ కొనుగోలు నిర్వహిస్తామని అధికారులు చెప్పి కొనుగోళ్లు జరపకపోవడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డుకు అడ్డంగా రాళ్లుపెట్టి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. అంతేగాక కమీషన్‌ ఏజెంట్లు ధరల్లో కోత పెట్టడాన్ని నిరసిస్తూ మిరప రైతులు ఆందోళన చేశారు.

మొత్తానికి మిర్చి రైతుల ఆందోళనలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ల దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంప్రదింపులు జరుపుకొని మిర్చి ఘాటు జనాలకు తగలకుండా చూసుకోకపోతే ప్రభుత్వాలకు మిర్చి ఘాటు తప్పదేమో.

 

Have something to add? Share it in the comments

Your email address will not be published.